కన్నడ కథానాయకుడు ఉపేంద్ర సారథ్యంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబడింది. ఆయన మంగళవారం కర్ణాటక ‘ప్రాజ్ఞావంత జనతా పక్ష’ ( కేపీజేపీ) పేరుతో పార్టీని ప్రకటించి, బెంగళూరులోని గాంధీ భవన్లో తన పార్టీని ఆవిష్కరించాడు. పార్టీని స్థాపించిన ఉపేంద్ర, ‘ఇది కేవలం పార్టీనే కాదని,ప్రజల కోసం ప్రజల పార్టీ అని చెప్పారు. ‘నేను కేవలం మీ కోసం ఓ వేదికను సృష్టించాను. పార్టీలో చేరాలని ఆసక్తి ఉన్నవారు చేరవచ్చు, మార్పు తీసుకురావడమే నా లక్ష్యమని’ తెలిపారు. ‘తమ పార్టీ.. వ్యక్తిత్వాలపై దృష్టిపెట్టదని, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్టు’ ఉపేంద్ర చెప్పాడు. ‘ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే వాటిపైనే తమ పార్టీ దృష్టిసారించనుందని’ తెలిపాడు. ‘అందరికీ ఆరోగ్యం, విద్య, మౌలిక అవసరాలు, చిన్న గ్రామాలు , వ్యవసాయభివృద్ది, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి అభివృద్ది చేయడం, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తమ పార్టీ జాబితాలోని అంశాలని’ తెలిపారు. నవంబర్ 10న వెబ్సైట్ యాప్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. పార్టీలోని ఎవరిపైనా నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టదన్నారు. మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం. ఆ దిశగా ఎవరు పనిచేస్తున్నారన్నది ముఖ్యం కాదు... ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారన్నదే అన్నిటికంటే ముఖ్యం.’ అని ఉపేంద్ర పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాల్లో మాదిరిగా స్టేజిపై నుంచి మాట్లాడే ఆనవాయితీకి ఉపేంద్ర చెక్ పెట్టారు. మీడియా ప్రతినిధులందర్నీ స్టేజిమీద కూర్చోబెట్టి ఆయన వేదిక కింద నిలబడి మాట్లాడడం విశేషం. కాగా ఉపేంద్రతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు కూడా కార్మికుల్లాగా ఖాకీ దుస్తులు ధరించడం అందర్నీ ఆకట్టుకుంది.