పోస్టల్ విభాగంలో మొత్తం 55వేల గ్రామీణ డాక్సేవక్ పోస్టులను నవంబర్లో భర్తీ చేయనున్నట్టు భారత పోస్టల్ విభాగం సెక్రెటరీ బీవీ సుధాకర్ తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నవంబర్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డాక్సదన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీవీ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగం పనితీరు, మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామీణ డాక్సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్టుమాస్టర్కి పదో తరగతి , పోస్ట్ మాస్టర్ కాకుండా డెలివరి సిబ్బందికి ఎనిమిదవ తరగతి విద్యార్హతగా ఉంటుందని చెప్పారు. అభ్యర్థుల పదోతరగతి మెమో, కులధ్రువీకరణ, తదితర ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే, వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకే తొలిసారిగా ఆన్లైన్ విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు.