చిత్రం : జాగ్వార్
బ్యానర్ : చెన్నాంబికా ఫిలిమ్స్
సమర్పణ : హెచ్.డి కుమారస్వామి
కథ : వి. విజయేంద్ర ప్రసాద్
పాటలు : రామజోగయ్య శాస్త్రి
సంగీతం: యస్.యస్. తమన్
కెమెరా: మనోజ్ పరమ హంస
ఎడిటింగ్ : రూబెన్
కథ -స్క్రీన్ ప్లే – మాటలు -దర్శకత్వం: ఎ. మహదేవ్
నటీనటులు: నిఖిల్ గౌడ, దీప్తి సాతి, జగపతి బాబు, రావు రమేష్, రమ్యకృష్ణ, సంపత్ రాజ్, ఆదిత్యా మీనన్, అవినాష్ తదితరులు.
మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా తెరకెక్కిన మూవీ ‘జాగ్వార్’. రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఇవాళ (అక్టోబర్ 6న) విడుదలైంది. నిఖిల్ గౌడకు ఇదే తొలి సినిమా కాగా, యస్.యస్. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎ. మహదేవ్ కు డైరెక్టర్ గా ఇదే ఫస్ట్ మూవీ.
కథ..
కృష్ణ(నిఖిల్ కుమార్) అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ లాగే ‘జాగ్వార్’లా డ్రెస్ తొడుక్కుని మాస్క్ పెట్టుకుని రిటైర్ జడ్జిని, పోలీస్ ఆఫీసర్ ను చంపేస్తాడు. తను అలా చంపడం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ఓ చానెల్ లో తను చంపే దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. అయితే తమ చానల్ ను ఎవరు హ్యాక్ చేశారు, హత్యలను లైవ్ టెలికాస్ట్ ఎందుకు చేస్తున్నారో తెలియని చానెల్ యాజమాన్యం ఆ షోను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ టి.ఆర్.పి రేటింగ్ కోసం చానెల్ అధినేత శౌర్యప్రసాద్(సంపత్) ఆ ప్రోగ్రాంను అలానే టెలికాస్ట్ చేయమంటాడు. అయితే అలా వరుస హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారో.. తెలుసుకోవడానికి ప్రభుత్వం జె.బి(జగపతిబాబు) అనే సీబీఐ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఈలోగా శాంతి గ్రూప్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ గా కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. ప్రియా(దీప్తి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఇది ఇలా ఉండగా కాలేజీ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్.. ప్రజలకు సేవ చేయకుండా.. వ్యాపార ధోరణిలో నడుస్తుండడం గమనించిన ఆర్య(ఆదర్శ్ బాలకృష్ణ) అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ దాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటాడు. దీంతో హాస్పిటల్ ను నడుపుతున్న శౌర్యప్రసాద్.. ఆర్యను దెబ్బ తీయాలని ఆలోచిస్తాడు. చివరగా ఆర్యను శౌర్య ప్రసాద్ చంపేశాడా..? అసలు ఒకరి తర్వాత ఒకరిని కృష్ణ చంపడానికి కారణమేంటి..? శౌర్యప్రసాద్ చానెల్ నే కృష్ణ ఎందుకు టార్గెట్ చేశాడు..? శౌర్య ప్రసాద్ కారణంగా కృష్ణకు వచ్చిన సమస్యలేంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘జాగ్వార్' అంటూ కోట్ల పెట్టుబడి పెట్టి రిలీజ్ చేసిన సినిమా మూస ధోరణిని మరోసారి గుర్తు చేసింది. హీరో కుటుంబానికి అన్యాయం జరగడం, ఆ అన్యాయం చేసిన వారిని ఎదిరించడానికి హీరో తెర ముందుకు రావడం, వారు చేసిన తప్పులు వారితోనే చెప్పించడం.. ఇప్పటికే మనం ఇలాంటి కథలు చాలానే చూసేశాం. పోనీ కథనంలో, డైలాగ్స్ లో కొత్తదనం ఉంటుందా..? అనుకుంటే పొరపాటే.. సీన్ లో తర్వాత ఏం జరగబోతుంది..? అనేది కామన్ ఆడియన్స్ ఊహించే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది.
ఇక సందర్భం లేకుండా పాటలు రావడం ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి. జగపతి బాబు లాంటి నటుడ్ని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. విలన్ పాత్రలో సంపత్ ఎప్పటిలానే సెటిల్డ్ గా నటించాడు. రావు రమేష్, రమ్యకృష్ణల నటన గురించి చెప్పనక్కర్లేదు. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కనిపిస్తాడు కానీ నవ్వించలేకపోయాడు. హీరోయిన్ ను కేవలం పాటల కోసం పెట్టుకున్నారు తప్ప ఆమె పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. ఇక హీరో నిఖిల్ గౌడకు ఇది మొదటి సినిమా. సినిమాల్లోకి రావడానికి తను అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకున్నాడు. డాన్స్ లు, ఫైట్స్ వరకు ఓకే కానీ నటనలో పరిణితి చెండాల్సి ఉంది. కొన్ని చోట్ల కాస్త అతి చేశాడని అనిపించక మానదు.
తమన్ రెగ్యులర్ మ్యూజిక్ తో విసిగించాడు. పాటలన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంటుంది. విజయేంధ్ర ప్రసాద్ అందించిన కథలో సందేశం ఉన్నా.. డైరెక్టర్ మహదేవ్ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదనే చెప్పాలి.
ప్లస్..
చేజ్ లు, ఫైట్లు ఓకే
రిచ్ ఫొటోగ్రఫీ
మైనస్..
పాత కథ
అసందర్భంగా వచ్చే పాటలు
తమన్ రెగులర్ మ్యూజిక్
బ్రహ్మానందం ఉన్నా వేస్టే
పంచ్ లైన్ : పాత వార్ ‘జాగ్వార్’
భారత్ టుడే రేటింగ్ : 2.25/5