నాసా సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా తొలిసారిగా సూర్యుడికి అతి సమీపంలోకి వ్యోమనౌక పంపనుంది. సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్ పేరుతో ఈ వ్యోమనౌక ప్రయోగం 2018లో చేయనుంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యడి గురించి మరిన్ని విషయాలను స్టడీ చేయనుంది. సూర్యుడి ఉపరితలంపై 6.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ వ్యోమనౌక ను లాంచ్ చేసి సూర్యుడి చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాలను నాసా అధ్యయనం చేయనుంది. సూర్యుడి చుట్టూ ఉన్న కాంతివలయ భాగం అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడి నుంచే సౌర విద్యుత్ విడుదల జరుగుతుంది. సూర్యుడి నుంచి విడుదలయ్యే సౌరశక్తి అంతరిక్షంలోని వాతావరణంతో పాటు భూమిపై కూడా ప్రభావం చూపుతుంది. సూర్యుడి చుట్టూ ఉన్న కాంతివలయం ఉష్ణోగ్రత ఇతర పొరలకంటే అత్యంత వేడిగా ఉండేందుకు కారణాలను సోలార్ మిషన్ ప్రోబ్ ద్వారా అధ్యయనం చేయనున్నారు.