Tuesday, October 15, 2019
Follow Us on :

ఈ కార‌ణంతోనే అగ్నిప్ర‌మాదం జ‌రిగింది...పోలీసు, క్లూస్‌టీం పరిశోధనలో లభించిన ఆధారాలు..!

By BhaaratToday | Published On Feb 2nd, 2019

ఈ కార‌ణంతోనే అగ్నిప్ర‌మాదం జ‌రిగింది...పోలీసు, క్లూస్‌టీం పరిశోధనలో లభించిన ఆధారాలు
లింగంప‌ల్లిలోని నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదానికి గ‌ల కార‌ణాలను పోలీసులు, క్లూస్‌టీం రాబ‌ట్ట‌గ‌లిగారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై ఆధారాల సేకరణపై పోలీసులు, క్లూస్ టీం 24 గంటల్లోనే పురోగతి సాధించింది. ఘటనా స్థలంలో సేకరించిన శకలాలు, రసాయన పరీక్షలు, త్రీడీ టెక్నాలజీ నైపుణ్యంతో తీసిన చిత్రాల ఆధారంగా విద్యుదాఘాతంతోనే నిప్పంటుకుందని పోలీస్‌ అధికారులు, క్లూస్‌టీం సభ్యులు తేల్చి చెప్పారు. విద్యుదాఘాతం ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకునేందుకు మరిన్ని శకలాలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. శనివారం ఫలితాలు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

రెండు అంశాలపై ప్ర‌త్యేక దృష్టి :
సంఘటనా స్థలంలో క్లూస్ టీం సభ్యులు... వందల సంఖ్యలో ప్లాస్టిక్‌, క్రాకరీ, సింథటిక్‌ వస్తువులు, చీరలు, ఆహారపదార్థాల శాంపిళ్లను గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సేకరించారు. అనంతరం తొలుత నిప్పంటున్న మహేష్‌ బ్యాంక్‌ స్టాల్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మంటల ధాటికి కరిగిపోయిన వైర్లను పరీక్షించారు. స్టాల్‌లో ఉన్న విద్యుత్‌ తీగల్లో కొన్నింటిపై వైరింగ్‌ సరిగా లేకపోవడం లేదా వెలుగుతున్న లైట్‌పై వర్షం లేదా నీటి చుక్కలు పడినప్పుడు ఉత్పన్నమైన వేడి ద్వారా నిప్పంటుకుని ఉండొచ్చని ఫోరెన్సిక్‌ బృందం పోలీసులకు తెలిపింది.

ఫ్లోరెసెంట్‌ బల్బుల శకలాలు.. మహేష్‌ బ్యాంక్‌లో మొదలైన మంటలు వేగంగా పక్కనున్న దుకాణాలకు ఎలా వ్యాపించాయన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒకరిద్దరు విద్యుత్‌ అధికారులను అడిగి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. మహేష్‌ బ్యాంక్‌లో నిప్పంటుకుని పైనున్న రేకుల వద్దకు మంట చేరుకోగానే అక్కడున్న ఫ్లోరెసెంట్‌ బల్బుల్లో (సీఎఫ్‌ఎల్‌) 30వరకూ పేలిపోయాయి. వాటి శకలాలు పక్క దుకాణంపై పడి మంటలు వ్యాపించాయి. ఆ షాపులో ఉన్న బల్బులు పేలిపోవడంతో పెద్దగా శబ్దం వచ్చింది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్నప్పుడు సుమారు వంద బల్బులు పేలిఉంటాయని భావిస్తున్నారు. అయితే నుమాయిష్‌ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశాం. బేగంబజార్‌, ఆబిడ్స్‌ పోలీసులతో పాటు హోంగార్డులు ఎగ్జిబిషన్‌ లోపల విధులు నిర్వహిస్తున్నారు. 9 ప్లటూన్ల ప్రత్యేక పోలీస్‌ బలగాలను అందుబాటులో  ఉంచారు.