Monday, November 18, 2019
Follow Us on :

తాళం వేసినట్లే ఉంది.. కానీ బంగారం మాత్రం మాయం

By BhaaratToday | Published On Oct 17th, 2019

చేస్తే స్మగ్లింగ్ చెయ్యి, చేతకాకపోతే చోరీ చెయ్యి.. అంటున్నారు బంగారం దొంగలు. అయితే ఇక్కడ మాత్రం వేసిన తాళం వేసినట్లే ఉంది. గేట్లు.. తలుపులు మూసుకునే ఉన్నాయి. అయినా సరే రూ.కోట్ల విలువచేసే నగలు మాయమైపోయాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామేత ఉంది కదా..!? ఇక్కడా అదే జరిగిందా..!? లేదా నిజంగానే దొంగతనం జరిగిందా..!? అక్కడ సీన్ ఆఫ్ యాక్షన్ చూస్తుంటే మాత్రం ఇంటి దొంగలపనేనంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బ్యాంకులోని లాకర్ తాళాలు వేసినట్లే ఉన్నాయి. కానీ అందులోని బంగారు అభరణాలు మాత్రం మాయం అయ్యాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో మోర్ధానపల్లి వద్దనున్న అమరరాజా పరిశ్రమ ఆవరణలోని ఆంధ్రాబ్యాంకులో 3కోట్ల 45 లక్షల విలువైన 17కిలోల బంగారు అభరణాలు, 2లక్షల 66 వేల నగదు మాయం అయ్యింది. బ్యాంకు తలుపులకు వేసిన తాళాలు, బ్యాంకులోపల లాకర్ తాళాలు వేసినట్లే ఉన్నాయి. బ్యాంకు లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించి సర్వర్ బాక్స్ మాత్రం కనిపించలేదు. 

 అయితే బ్యాంకులో చోరీ జరిగిందనే సమాచారంతో యాదమరి పోలీసులు, క్లూస్ టీం సభ్యులు బ్యాంకుకు వచ్చారు. ఘటనపై పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తాయి. బ్యాంకు తలుపులు, బ్యాంకు లోపల ఉన్న లాకర్ తాళాలు యథావిధిగా ఉన్నాయి. కేవలం సీసీ కెమెరాలకు సంబంధించి హర్డ్ డిస్క్ మాత్రం కనిపించడం లేదు. కంప్యూటర్లు పని చేయలేదు. పోలీసులు అనుమానంతో లాకర్ ను బ్యాంకు మేనేజర్, క్యాషియర్ వద్దనున్న మూడు తాళపుచెవులను ఉపయోగించి లాకర్ ను తెరిచారు. 

అయితే అందులో తనఖా పెట్టిన బంగారు అభరణాలు కన్పించకపోవడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. లాకర్, మిగిలి ఉన్న కొద్దిపాటి నగదును వాసన చూసిన జాగిలాలు హైవేపై చిత్తూరు వరకు కొంతదూరం వచ్చి ఆగిపోయాయి. పోలీసులు మేనేజర్, క్యాషియర్, సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఉదయం నుంచి ఏం జరిగిందో రాబట్టారు. ఇంటిదొంగలపై అనుమానాలు బలపడడంతో మేనేజర్ పురుషోత్తం, క్యాషియర్ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. 

ఇక దుండుగులు చోరీకి పాల్పడితే బ్యాంకు తాళాలు పగులగొట్టడం, లాకర్ ను ధ్వంసం చేయడం చేయాలి. కానీ ఇక్కడ బ్యాంకులో తాళాలతో సహా వస్తువులన్నీ యథాతథంగా ఉన్నాయి. శుక్రవారం బ్యాంకు పని వేళలు ముగిశాక తాళం వేసిన సిబ్బంది మళ్లీ సోమవారం ఉదయం సెక్యూరిటీ సమక్షంలోనే తెరిచారు. శనివారం సెలవు రోజైనా బ్యాంకు మేనేజర్ బ్యాంకుకు వచ్చి విధులు నిర్వహించారని సెక్యూరిటీ పోలీసులకు వివరించారు.  ఉదయం బ్యాంకు తాళాలు తెరిచినప్పుడు తమకు ఎలాంటి అనుమానం తలెత్తలేదని.. తాళాలన్నీ వేసినట్లే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ వచ్చిన వెంటనే సీసీ కెమెరాలకు సంబంధించి హర్డ్ డిస్క్ కనిపించలేదని చెప్పడం గమనార్హం. 

సాధారణంగా సీసీ కెమెరా కేబుల్, సర్వర్ ను దెబ్బతీయాలని చూస్తే సంబంధిత పోలీసు స్టేషన్, బ్రాంచి మేనేజర్ కు అప్రమత్తత సందేశం వస్తుంది. బ్యాంకులో ఏర్పాటు చేసిన అలారమ్ మోగుతుంది. కానీ సర్వర్ ను ఎత్తుకెళ్లినా ఎలాంటి సందేశాలు రాకపోవడం, అలారమ్ మోగకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. అలారాన్ని బ్యాంకు పని వేళల్లో మాత్రమే సైలంట్ మోడ్ లో పెడుతారు. అంటే నగల చోరీ సమయంలో అలారాన్ని సైలెంట్ మోడ్ లో పెట్టి సర్వర్ ను తొలగించారన్నది పోలీసుల అనుమానంగా ఉంది. మరోవైపు రెండో శనివారం సెలవైనప్పటికీ.. మేనేజర్ పురుషోత్తం బ్యాంకుకు వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరం శనివారమే జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. జోనల్ మేనేజర్ మురళీకృష్ణరావు, చీఫ్ మేనేజర్లు పంతులు, వర్మలు మొత్తం వ్యవహారంపై ఉద్యోగులను, సిబ్బందిపై అంతర్గత విచారణ ప్రారంభించారు. అయితే నగదు, బంగారం అభరణాల చోరీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి చెప్పారు. బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారన్నారు. తాళాలు సక్రమంగా ఉండటం, రక్షణ వ్యవస్థ పని చేయకపోవడం, సీసీ కెమెరాల హర్డ్ డిస్క్ మాయం కావడం, ఉద్యోగుల వివరణలు అనుమానస్పదంగా ఉండటంపై విచారణ చేస్తున్నామన్నారు. కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఎంత నగదు, బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నాయనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. 

ఇక బ్యాంకులో రూ.4 లక్షలకు పైగా నగదు ఉంటే కేవలం రూ.2.30 లక్షల వరకు మాత్రమే చోరీ చేసి, మిగిలిన నగదును ఇక్కడే వదిలేశారు. ఇవన్నీ చోరీలో బ్యాంకులో పనిచేసేవారి హస్తం ఉందని నిర్ధారిస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే చోరీకి పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. పైగా బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చోరీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకులో నగలు, నగదు చోరీకి గురికావడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.

అయితే 14ఏళ్ల క్రితం అంటే.. సరిగ్గా 2005వ సంవత్సరం.. యాదమరి మండల కేంద్రంలో ఉన్న యూనియన్‌ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి ఇక్కడున్న బ్యాంకు లాకర్లను తొలగించిన దుండగులు ఏకంగా 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కొల్లగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో తమిళనాడుకు చెందిన అయ్యనార్, మరో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 19 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఖాతాదారులకు పంచడానికి ఏళ్ల సమయం పట్టింది. మరోవైపు బెయిల్‌పై బయటకొచ్చిన ఈ ముఠా కేరళలోని మరో బ్యాంకుకు కన్నంవేసి అక్కడ 20 కిలోలకు పైగా బంగారం దోపిడీ చేయడం సంచలనం రేకెత్తింది.