Friday, December 06, 2019
Follow Us on :

కర్ణాటకం.. 18న తేలిపోనుందా..?

By BhaaratToday | Published On Jul 15th, 2019

కర్ణాటకలో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. ఎప్పుడు ఎటువంటి మలుపులు చోటుచేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది. 

దీంతో కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికార పక్షానికి కొంత సమయం ఇస్తున్నామని, ఈ నెల 18న ఉదయం పదకొండు గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు. అలాగే విధాన సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును బీజేపీ నేత జేసీ మధుస్వామి ప్రవేశపెట్టారు. సభలో ఆధిక్యత నిరూపించుకునేంత వరకూ సభ నిర్వహించవద్దని స్పీకర్ ను కోరారు. ఒకవేళ సభ నిర్వహిస్తే వాకౌట్ చేస్తామని స్పీకర్ కు స్పష్టం చేశారు.  దీంతో 18వ తేదీన ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 


కర్ణాటకం.. గతంలో ఏమి జరిగిందంటే..! 

చందనసీమలో ముదిరిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. కర్నాటకలో అధికారమే లక్ష్యంగా గతంలో.. ఎన్నోసార్లు సంకీర్ణ రాజకీయాలు చేసింది జేడీఎస్. గతంలో ఓసారి కాంగ్రెస్ తో, ఓసారి బీజేపీతో మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ తో సంకీర్ణ రాజకీయాలు చేస్తూ అధికారం అనుభవిస్తూ వస్తోంది. అయితే, గతంలో కాంగ్రెస్ తో జట్టుకట్టిన జేడీఎస్ 2006లో ‘కూటమి’ని భగ్నం చేసింది. అంతవరకు మతతత్త్వ పార్టీ అని తాము చిత్రీకరించిన బీజేపీతో జట్టుకట్టింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ను గద్దెదించింది. అప్పుడు ఈ లౌకిక జనతాదళ్ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తుండిన సిద్ధరామయ్య ఆ తరువాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం, 2013 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావడం అవకాశవాద రాజకీయ చరిత్రలో మరపురాని ఘట్టాలు.

2006లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుమారస్వామి కూలగొట్టడానికి కారణం తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మాత్రమే. ఆ తర్వాత బీజేపీతో మైత్రిని కూడా భగ్నం చేశారు కుమారస్వామి. బీజేపీతో కుదిరిన ఒప్పందం మేరకు ఇరవై నెలలపాటు తాను ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ తరువాత ఇరవై నెలలపాటు బీజేపీకి చెందిన యడియూరప్పకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలి. కానీ ఇరవై నెలల తరువాత 2007 అక్టోబర్‌లో కుమారస్వామి గద్దె దిగలేదు, ఒప్పందాన్ని భగ్నం చేశాడు. ఇలా కాంగ్రెస్‌ను, తరువాత బీజేపీని వంచించిన ఘనమైన చరిత్ర కుమారస్వామిది. రాజకీయ తృతీయశక్తిగా కర్నాటకలో ‘శిఖండి’పాత్రను పోషిస్తున్న కుమారస్వామి, ప్రజల ఘోర తిరస్కృతికి గురైన‌ప్పటికీ అనూహ్యంగా మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.

మేం రాకపోయినా సరే! మీరు మాత్రం రావొద్దు!.. అనే పొలిటికల్ ట్రెండ్ ను ఫాలో అయిన కాంగ్రెస్.. కుమారస్వామికి పగ్గాలు అప్పగించింది. బీజేపీని అధికారంలోకి రాకుండా చూడాలన్న ఏకైక తలంపుతో జేడీఎస్ తో అనైతిక మైత్రికి సిద్ధపడింది. ప్రజలచే చీకొట్టబడి.. అత్తెసరు సీట్లతో మూడో స్థానంలో నిలిచిన ఆ పార్టీని అందలమెక్కించింది. పాస్ మార్కులు కూడా రానికి కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యెడ్యూరప్పను గద్దెదించి మరీ కూటమి సర్కార్ గద్దెనెక్కింది.

ఇక అనైతిక మైత్రితో గద్దెనెక్కిన సీఎం కుమారస్వామికి అడుగడుగునా చిక్కులే. అధికారం చేపట్టి నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేతిలో పావుగా మారిపోయారు. హస్తం పార్టీ ఆజమాయిషీతో నలిగిపోతూనేవున్నారు. కమలనాథుల ఎత్తులు, ఎమ్మెల్యేల రాజీనామా బెదిరింపులతో అతుకుల సర్కార్ ను అతి కష్టం మీద లాగిస్తున్నారు కుమారస్వామి. పొత్తుల ఎత్తుల్లో లక్కీగా సీఎం అయిన కుమారస్వామిని మిత్రపక్షం కాంగ్రెస్ చెడుగుడు ఆడుకుంటూనేవుంది. వాళ్ల కోరికలు తీర్చలేక.. కుర్చీని కాపాడుకోలేక కుమారస్వామి పలు మార్లు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు.

మిత్రపక్షం కాంగ్రెస్ తనను లెక్క చేయడం లేదన్న బాధతో ఆయన ఏడ్చేశారు. జేడీఎస్ నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సీఎం కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని.. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని కుమారస్వామి భావోద్వేగానికి గురై జేడీఎస్ ఎమ్మెల్యేల ముందర కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారస్వామి ఏడుపు చూసి కాంగ్రెస్ పై వేచి చూద్దామని.. తీరు మారకపోతే ఆలోచిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత – మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడిని ఓదార్చారట.

కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ సర్కార్ ను లాక్కొస్తున్న కుమారస్వామికి.. ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సాములా మారింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ వేలు పెట్టడంతో.. కాంగ్రెస్ - జేడీఎస్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తుతూనేవున్నాయి. మరోవైపు, దీనికి కాంగ్రెస్ మార్కు రాజకీయాలు సైతం తోడయ్యాయి. కేవలం ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో గద్దెనెక్కిన కుమారస్వామికి కాంగ్రెస్ చుక్కలు చూపిస్తోంది. తరుచూ రాజీనామా బెదిరింపులు వింటూ కాలం గడుతున్నారు కుమారస్వామి. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి చావుదెబ్బ తినడంతో.. కుమారస్వామికి కష్టాలు రెట్టింపయ్యాయి. ఫలితాల వెలువడిన నాటి నుంచే.. సంకీర్ణ సర్కార్ కు దడ మొదలైంది. కర్నాటకలో 28 స్థానాలకు బీజేపీ 25 సీట్లు గెలుచుని సత్తా చాటింది. దీంతో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఇక మూణ్నాళ్ల ముచ్చటేనన్న సంకేతాలు వెలువడ్డాయి. 

లోక్ సభ ఎన్నికల్లో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయో లేదో.. బీజేపీ నేత యెడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయని త్వరలోనే కుమార స్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. చెప్పినట్టే ఇప్పుడు కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదిరిపాకనపడింది.