Thursday, September 19, 2019
Follow Us on :

అవును టిక్-టాక్ ప్రాణాలు తీసింది..!

By BhaaratToday | Published On Apr 15th, 2019

ప్రస్తుతం యూత్ లో టిక్-టాక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే ఈ యాప్ ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం మనదేనట..! ఈ యాప్ ద్వారా కొందరు తమ టాలెంట్ ను బయట పెడదామని భావిస్తూ ఉంటారు. అయితే చాలా సార్లు ఈ యాప్ వలన ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ యాప్ ను వాడితే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతామని అనుకుంటారు.. కానీ టిక్ టాక్ వాడుతూ జరిగే చిన్న తప్పుల వలన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో చిత్రాకరిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇటీవలే ఈ యాప్ ను నిషేధించాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఘటన జరిగింది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Image result for tik tok death

సోహైల్, ఆమిర్‌ అనే యువకులిద్దరూ దగ్గరి బంధువులు. ఆదివారం రాత్రి వీరు తమ మిత్రుడు సల్మాన్‌ తో కలిసి ఇండియా గేట్ వద్దకు సరదాగా కారులో వెళ్లారు. రాత్రి 9.45 తర్వాత ఇంటికి తిరిగొచ్చే సమయంలో సల్మాన్‌ కారు నడుపుతుండగా సోహైల్‌ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో టిక్ టాక్ వీడియో చేద్దామని సోహైల్ అనుకున్నాడు. తన దగ్గర ఉన్న నాటు తుపాకీని బయటకు తీసిన సోహైల్ వీడియోలకు పోజులు ఇవ్వడం.. అనుకరించడం మొదలు పెట్టారు. సల్మాన్‌కి గురిపెట్టి ఏదో అనుకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో సల్మాన్‌ చెంపభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన వెంటనే సోహైల్‌, ఆమిర్‌ లు సల్మాన్ ను ఆస్పత్రికి తీసుకు వెళ్ళలేదు. ధర్యాగంజ్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలు అంటిన దుస్తులను మార్చిన తర్వాత.. ఓ బంధువు సాయంతో సల్మాన్‌ను సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. సల్మాన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులకు సమాచారం అందించారు హాస్పిటల్ సిబ్బంది. రాత్రి 11.30 సమయంలో ఆస్పత్రికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోహైల్, ఆమిర్‌తో పాటు వారి బంధువును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టిక్ టాక్ చేస్తూ ఉండగా కారు కుదుపులకు గురైందని.. అందుకే తుపాకీ పేలిందని చెప్పాడు సోహైల్. సోహైల్ కు తుపాకీ ఎక్కడిది.. కావాలనే చంపేసారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.   

Image result for tik tok death