Monday, November 18, 2019
Follow Us on :

నోబెల్ పురస్కారానికి ఎంపికైన భారతీయుడు

By BhaaratToday | Published On Oct 14th, 2019

నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు.  పేదరికాన్ని తగ్గించేందుకు వీరు పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.

Image result for abhijit banerjee

రోజూ ఒక రంగానికి సంబంధించి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడెమీ.. శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. 2019 నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్‌ అలీని వరించింది. పొరుగుదేశం ఎరిట్రియాతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి.. అక్కడి పరిస్థితులను సాధారాణ స్థాయికి తెచ్చి.. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషిచేసిన అబి అహ్మద్ ను శాంతి పురస్కారానికి ఎంపిక చేశారు.

నోబెల్ శాంతి పురస్కార ఎంపిక కమిటీ అయిన ‘నార్వెయిన్ నోబెల్ కమిటీ’.. స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. శాంతి స్థాప‌న కోసం, అంత‌ర్జాతీయ స‌హ‌కారం కోసం ఆయ‌న చేసిన కృషిని నోబెల్ క‌మిటీ గుర్తించింది. ఇథియోపియా సరిహద్దు దేశమైన ఎరిత్రియాల మధ్య 20 ఏళ్లుగా నెలకొన్న వైరాన్ని తొలగించడం, స‌రిహ‌ద్దు స‌మ‌స్యను ప‌రిష్కరించ‌డంలో ప్రధాని అబీ అహ్మాద్ అలీ చేసిన కృషికిగాను నోబెల్ అవార్డు కమిటీ ఆయన పేరును ప్రకటించింది.

 2018 ఏప్రిల్‌లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అబీ.. వెంటనే ఎరిత్రియాతో శాంతి చ‌ర్చల‌కు పునాది వేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో చర్చలు ప్రారంభించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారని.. దీంతో రెండు దేశాల మధ్య స్నేహం చిగురించిందని తెలిపింది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారని.. అలాగే తన నిర్ణయాలతో ఇథియోపియా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని స్పష్టం చేసింది.

నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.

ఇదిలావుంటే, నోబెల్ శాంతి పురస్కారం దక్కడంతో అబి అహ్మద్ అలీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. నిన్నమొన్నటివరకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి.. ఇప్పుడు ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఇంతకీ ఎవరీ అబి అహ్మద్.. ఆయన శాంతి స్థాపన విషయంలో ఆయన సాధించిందేంటనేది చర్చనీయాంశంగా మారింది.

పొరుగుదేశం ఎరిత్రియాతో ఇథియోపియాకు వున్న దశాబ్దాల వైరాన్ని తగ్గించి.. శాంతికి బాటలు వేశారు అబి అహ్మద్ అలీ. 1993 లో ఇథియోపియా నుంచి ఎరిత్రియా విడిపోయింది. అయితే సరిహద్దు విషయంలో తలెత్తిన వివాదం.. చినికి, చినికి గాలివానలా మారి 20 ఏళ్లకు పైగా ఇరు దేశాలను దహించివేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. ఎరిత్రియా-ఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య రక్తం ఏరులైపారింది.

పదికోట్లమంది జనాభా ఉన్న ఇథియోపియాలో అసలే నాలుగైదు తెగల మధ్య నిత్యం సాగే ఘర్షణలకు తోడు.. ఎరిత్రియా యుద్ధం ఆ దేశాన్ని కుంగదీశాయి. యుద్ధం వల్ల 80 వేల మంది మరణించడం మాత్రమే కాదు.. లక్షలమంది వలసలు పోయారు. ఈ నిరర్ధక యుద్ధంవల్ల అసలే పేద దేశాలుగా ఉన్న ఎరిత్రియా, ఇథియోపియా ఆర్థికంగా మరింత కుంగిపోయాయి. 

ఈ నేపథ్యంలో 2018లో అధికారంలోకి వచ్చిన ప్రధాని అబి అహ్మద్ అలీ.. ఇథియోపియా, ఎరిత్రియాల మధ్య 20 ఏళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడంలో విశేషంగా కృషి చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అబీ ఆ వెంటనే ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో చర్చలు ప్రారంభించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. గ‌తేడాది జూలై, సెప్టెంబ‌ర్ల‌లో జ‌రిగిన భేటీల్లో ఇరువురు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే అంత‌ర్జాతీయ బౌండ‌రీ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అబే అంగీక‌రించారు.

 అంతేకాదు, ఇథియోపియాలో పెనుమార్పులు తీసుకురావడంలో ప్రధాని అబి అహ్మద్ కీలకంగా వ్యవహరించారు. తాను తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. దేశ రూపురేఖలను మార్చేశాయి. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజుల్లో అత్యయిక స్థితిని ఎత్తేశారు. జైలులో మగ్గుతున్న ఎరిత్రియాకు చెందిన వారిని విడుదల చేయించారు. తమ దేశం చేసిన దానికి క్షమాపణలు చెప్పారు. 

ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి విషయంలో ఇథియోపియాను విజయపథంలో నడిపిస్తున్నారు అహ్మద్ అలీ. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇథియోపియా ప్రజల భవిష్యత్‌ కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. అవినీతికి పాల్పడ్డ సైనిక, పౌర అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో మహిళల పాత్ర పెంచేందుకు కృషి చేశారు. తన కేబినెట్‌లో సగం మంది మహిళలను తీసుకున్నారు. 

అబి అహ్మద్ ఆధ్వర్యంలో ఇథియోపియా మొక్కలను నాటే కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. జూలై 29వ తేదీన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఆ దేశ వ్యాప్తంగా 12 గంటల్లో 200 మిలియన్ల మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అలా వారు 12 గంటల్లోనే అనుకున్నదానికన్నా ఎక్కువగానే మొక్కలు నాటారు. మొత్తం 350 మిలియన్ల మొక్కలను నాటినట్లు  ఇథియోపియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఈ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. దీంతో దీంతో తక్కువ సమయంలోనే అత్యధిక మొక్కలు నాటిన దేశంగా ఇథియోపియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2016లో ఒక రోజులో దేశ వ్యాప్తంగా 50 మిలియన్ల మొక్కలు నాటిన ఇండియా రికార్డును ఇథియోపియా తిరగరాసింది.

అత్యంత పేదరికం నుంచి వచ్చిన అబి అహ్మద్ అలీ స్వయం కృషితో ప్రధాని స్థాయికి ఎదిగారు. అబి అహ్మద్ తండ్రి ముస్లిం కాగా తల్లి క్రైస్తవరాలు. అబి అహ్మద్ బెషాషా పట్టణంలో పుట్టాడు. అబి అహ్మద్ చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. వారు నివాసమున్న ఇంట్లో విద్యుత్ ఉండేది కాదు. నీటి సరఫరా ఉండేది కాదు. ఎక్కడో నదికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చుకునేవారని ఓ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. టీనేజర్‌గా ఉన్న సమయంలో టెక్నాలజీపై మక్కువతో మిలటరీలో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వంలోకి రాకముందు అబి అహ్మద్ మిలటరీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. ఇథియోపియా సైబర్ సైయింగ్‌ శాఖకు అబి అహ్మద్ వ్యవస్థాపకుడిగా కూడా పనిచేశారు. ఇక అబి ప్రధాని అయిన తర్వాత ఇథియోపియాకు ఎక్కడ లేని గుర్తింపును సంపాదించి పెట్టారు.

ఇథియోపియా ఓ ఆఫ్రికన్ కంట్రీ. సాధారణంగా ఆఫ్రికా అంటేనే ప్రపంచంలోని ఇతరచోట్ల చిన్న చూపు ఉంటుంది. మీడియాలో ఆ ప్రపంచం గురించిన వార్తలు పెద్దగా ఉండవు. ఆఫ్రికా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడో, ఉగ్రవాద దాడుల్లో భారీ సంఖ్యలో జనం మరణించినప్పుడో ఆ దేశాల ప్రస్తావన కనబడుతుంది. ఆ సమయాల్లో మాత్రమే ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది. కనుక అక్కడి నేతల గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అబీ కూడా తన సంస్కరణ విషయంలో హంగూ ఆర్భాటం ప్రదర్శించలేదు. తాను అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల కలిగే ఫలితా లేమిటన్న అంశంపైనే అధికంగా  దృష్టి సారించారు. అవన్నీ ఇప్పుడు కళ్లముందు కనబడుతున్నాయి. వీటిల్లో పాశ్చాత్య ప్రపంచాన్ని అబీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం వగైరాలు ఆకర్షించి ఉండొచ్చు. ఎర్ర సముద్రానికి ఆవల ఉన్న ఇథియోపియాలో జరుగుతున్నదేమిటో... వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో యెమెన్, ఇతర గల్ఫ్‌ దేశాలు గుర్తించాయి. పొరుగునున్న ఉన్న సోమాలియా, జిబౌతి, సుడాన్, దక్షిణ సుడాన్‌ దేశాలు సైతం అబీని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అంతరిక్షంలో వినూత్న పరిశోధనలు.. సరికొత్త గ్రహాలు, నక్షత్రాలను కనుగొన్నందుకు ముగ్గురు విజ్ఞాన యోధులకు ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. జేమ్స్ పీబెల్స్, మైఖెల్ మేయర్, డిడియర్ క్వెలోజ్ లను ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేశారు. ఇక సెల్ ఫోన్లకు, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసే బ్యాటరీలను కొనుగొన్న ముగ్గరు రసాయన శాస్త్ర ఉద్ధండులను సైతం నోబెల్ పురస్కారం వరించింది. జాన్ బీ గూడెనో, స్టాన్లీ విట్టింగ్ హాం, అకీరా యోషినో లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. ఇక, కణాలు ఆక్సిజన్ ను గుర్తించే ప్రక్రియను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో నోబెల్ పురస్కారం లభించింది.

 ఫిజికల్ కాస్మాలజీలో విస్తృత పరిశోధనలు చేసినందుకు కెనడాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జేమ్స్ పీబెల్స్, స్విట్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ జెనీవా ప్రొఫెసర్ మైఖెల్ మేయర్ లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. 

 ఈ ఇద్దరితో పాటు సూర్యుడి తరహా మరో సరి కొత్త గ్రహాన్ని కనుగొన్నందుకు జెనీవా యూనివర్శిటీకే చెందిన డిడియర్ క్వెలోజ్ పేరును ఎంపిక చేశామని అకాడెమీ తెలిపింది. మన పాలపుంతకు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి తరహా అత్యంత భారీ గ్రహం ఉందనే విషయాన్ని క్వెలోజ్ కనుగొన్నారు. దీనిపై విస్తృత పరిశోధనలను నిర్వహించారు. నోబెల్ అవార్డు కింద ఈ ముగ్గురికీ 9,18,000 అమెరికన్ డాలర్ల నగదు, బంగారు పతకం, డిప్లొమా సర్టిఫికెట్ ను అందజేస్తారు. మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే ఈ నగదు బహుమతి విలువ ఆరున్నర కోట్ల రూపాయల పైమాటే.

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా వివిధ రంగాలకు సేవలు చేసిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని ఇవ్వడాన్ని 1901లో ప్రారంభించారు. ఇప్పటిదాకా 47 మందికి మాత్రమే ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు లభించింది. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఫిజిక్స్ లో నోబెల్ అవార్డును అందజేసేంత స్థాయిలో పరిశోధనలు చోటు చేసుకోనందున.. ఈ కేటగిరీలో ఏటేటా అవార్డులను ఇవ్వలేదు.

ఇక సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు.. ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ దక్కింది. జర్మనీకి చెందిన జాన్ బీ గూడెనో, యూకేకు చెందిన ఎం. స్టాన్లీ విట్టింగ్ హాం, జపాన్ కు అకీరా యోషినో లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డును అందజేయనున్నారు. స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ కే హ్యాన్సన్ గత బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాపు, ఎలక్ట్రిక్ కార్లల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను రూపొందించినందుకు వారికి ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.

 1922లో జర్మనీలో జన్మించిన జాన్ బీ గూడెనో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఎం స్టాన్లీ కూడా అమెరికాలో ఉంటున్నారు. బింగ్ హ్యామ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టాన్లీ 1941లో జన్మించారు. మీజో యూనివర్శిటీ ప్రొఫెసర్ గా పని చేస్తోన్న అకీరా యోషినో 1948లో జపాన్ లో జన్మించారు. రసాయనిక శాస్త్రంలో వారు ముగ్గురూ విస్తృత పరిశోధనలు చేశారు. ప్రస్తుతం మనం వినియోగిస్తోన్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాపులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను కనుగొన్నది ఈ ముగ్గురు శాస్త్రవేత్తలే.

 ఈ తరహా బ్యాటరీలను రూపొందించడమే కాకుండా.. ఎలా వినియోగించాలనే అంశంపైనా విస్తృత పరిశోధనలు చేశారు. ఫలితంగా- లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. వైర్ లెస్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగానికి విస్తృతం కావడానికి ఈ బ్యాటరీలే ప్రధాన కారణమని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నోబెల్ ఫౌండేషన్ వెల్లడించింది. తక్కువ బరువుతో ఉండేలా, వందలాది సార్లు ఛార్జింగ్ చేయడానికి వీలుగా లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలకు ప్రధాన కారణమైన ఫార్ములాను కనుగొన్నారని ప్రశంసించింది.

లిథియం అయాన్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు యానోడ్, క్యాథోఢ్ మధ్య ఎన్నిసార్లయినా ప్రవహిస్తాయనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ బ్యాటరీలను రూపొందించినట్లు నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. విద్యుదావేశాన్ని అత్యధికంగా కలిగి ఉండే ఎలక్ట్రోడ్స్ వలయాలను ధ్వంసం చేయని విధంగా, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ వెలువడని విధంగా లిథియం అయాన్ బ్యాటరీలను రూపొందంచడం రసాయనిక శాస్త్రంలో ఓ గొప్ప మలుపుగా ఫౌండేషన్ అభిప్రాయ పడింది. ఈ రంగంలో వారు చేసిన పరిశోధనలు అంచనాలకు మించి ఫలించాయని స్పష్టం చేసింది.

 వైద్యశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురుకి నోబెల్‌ బహుమతి వరించింది. అందులో ఇద్దరు అమెరికన్లు. ఒకరిది బ్రిటన్‌. విలయం జి. కెలిన్‌, ఎల్‌ సీమెన్జ్‌, సర్‌ పీటర్‌ జె ర్యాట్‌క్లిఫ్‌ ఈ పురస్కారం పొందిన వారిలో ఉన్నారు. ' కణాలు ఆక్సిజన్‌ను ఎలా గుర్తించి, స్వీకరిస్తాయి' అన్న అంశంపై చేసిన ఆవిష్కరణకు గానూ ఈ గౌరవం దక్కింది. ఆక్సిజన్‌ను గుర్తించడం అనేదే అధిక వ్యాధులకు కేంద్ర బిందువు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ద్వారా ఈ విషయాన్ని ఈ ఏడాది వెలుగులోకి తీసుకొచ్చారని.. రక్త హీనత, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధుల పోరాటానికి శరీరశాస్త్రంలో కొత్త మార్గాన్ని కొనుగొన్నారని.. నోబెల్ కమిటీ కొనియాడింది.

వైద్యశాస్త్రంలో అందుకోనున్న ఈ పురస్కారం 110వది. 1901 నుంచీ నోబెల్‌ను వైద్యశాస్త్రంలో సేవలందిస్తున్నవారికి ప్రదానం చేస్తున్నారు. 6 కోట్ల రూపాయలను గ్రహీతలకు అందజేయనుంది. ఎంతమందికి ఈ గౌరవం దక్కితే అందరికి ఈ డబ్బును సమానంగా ఇవ్వనున్నారు.

నోబెల్ సాహిత్య పురస్కారం విషయంలో ఈసారి ఓ వింత చోటుచేసుకుంది. నోబెల్ ప్రైజ్ ఇష్టం లేదన్న వ్యక్తికే ఆ అరుదైన బహుమానం లభించింది. సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్కే కు 2019 నోబెల్ పురస్కారం లభించింది. ఇక, 2018 కి సంబంధించి.. పోలెండ్ కు చెందిన రచయిత్రి ఓల్గా టోకార్జక్ ను సాహిత్య నోబెల్ వరించింది.

గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కరాలను ప్రకటించలేదు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో గతేడాది సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించలేదు. దీంతో ఈ ఏడాది ఒకేసారి రెండు సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. 2019కి గాను ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్కేను నోబెల్ సాహిత్య పురస్కారం వరించగా... 2018కి గాను పోలాండ్‌కు చెందిన రచయిత్రి ఓల్గా టొకార్జక్ ను వరించింది.

అక్షరాలతో తన అన్వేషణ కొనసాగిస్తూ.. సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. వాటిని పాఠకులు, ప్రేక్షకుల ముందు నిలిపే ఆస్ట్రియా నవలా - నాటక రచయిత పీటర్‌ హాన్‌డ్కే. సాహిత్యంలో నోబెల్‌ అందుకుంటున్న 15వ మహిళ వోల్గా. 57 సంవత్సరాల ఆ రచయిత్రి పూర్తి శాకాహారి. మనస్తత్వ శాస్త్రాన్ని అభ్యసించిన ఆమె... కొన్నాళ్లు థెరపిస్టుగా కూడా పనిచేశారు. రాజకీయ కార్యకర్త, విశ్లేషకురాలిగా ప్రభుత్వంపై సూటి విమర్శలు గుప్పించడం ఆమె ప్రత్యేకత. పోలండ్‌లో స్వేచ్ఛ, సహనం భ్రమలా మారిపోయాయని 2015లో వ్యాఖ్యానించారు. దీంతో ‘చంపేస్తాం’ అంటూ ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ఆమె రచనలు నాటకాలుగా, సినిమాలుగా మారి ప్రేక్షకులను కూడా అలరించాయి. డజనుకుపైగా పుస్తకాలు రచించిన ఆమె... మన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌, నైకీ లిటరరీ అవార్డు (పోలండ్‌) కూడా అందుకున్నారు.

విచిత్రం ఏమిటంటే.. ఐదేళ్ల క్రితం ఈయన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  నోబెల్ వల్ల ఒరిగేదేమీ వుండదని.. ఒక్కసారిగా అందరి దృష్టి పడటం తప్ప.. మరేం లాభం వుండదని 2014లో పీటర్ హాన్డ్కే వాదించాడు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆయననే నోబెల్ వరించింది. 

1942 డిసెంబరు 6న పీటర్‌ హాన్‌డ్కే జన్కించారు. తండ్రి జర్మన్‌ సైనికుడుకాగా.. తల్లి ఆస్ట్రియా సంతతికి చెందిన స్లొవేనియన్‌. హాన్‌డ్కే ఆస్ట్రియాలోనే పెరిగారు. ప్రస్తుతం జర్మన్‌ మూలాలున్న అతికొద్ది రచయితల్లో హాన్‌డ్కే ఒకరు. ది గోల్‌ కీపర్స్‌ ఫియర్‌ ఆఫ్‌ పెనాల్టీ, వింగ్స్‌ ఆఫ్‌ డిజైర్‌, ఎ జర్నీ టు ది రివర్స్‌: జస్టిస్‌ ఫర్‌ సెర్బియా వంటి రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చి పెట్టాయి. బెల్‌గ్రేడ్‌పై నాటో దాడులను నిరసిస్తూ.. తనకు దక్కిన ‘బుష్నర్‌ ప్రైజ్‌’ను 1999లో ఆయన తిరిగి ఇచ్చేశారు.

ఇక 2018 సంవత్సరానికి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న వోల్గా టొకార్జక్ ది మరో చరిత్ర. రంగురంగుల ప్రపంచం.. రంగులు మార్చే మనుషులు.. రకరకాల బంధాలను సులభ పదాలతో కవితాత్మకంగా వివరించే పోలండ్‌ నవలా రచయిత్రిగా వోల్గా టొకార్జక్ కు మంచి పేరుంది.  సరిహద్దులు దాటడం జీవితంలో ఓ భాగం అని చెబుతూ ఓ చక్కటి కల్పిత కథనం రాసినందుకు ఓల్గాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. నోబెల్ పురస్కారాలు అందుకున్న మహిళల్లో ఓల్గా 15వ మహిళ. ఓల్గా 1962లో పోలాండ్‌లో జన్మించారు. 1993లో ఆమె నవలలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 11 నోబెల్ పురస్కారాల విజేతలను అకాడెమీ ప్రకటించింది. ఇందులో విజేతలంతా పురుషులే.

2018లో నోబెల్ ఫౌండేషన్ సాహిత్య రంగంలో పురస్కారాన్ని ప్రకటించకపోవడంతో.. ఈ ఏడాది ఆ అవార్డును ప్రకటించారు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన నోబెల్ ఫౌండేషన్.. సాహిత్య విభాగంలో విజేతను ప్రకటించలేదు. అంతేకాదు, ఆర్థిక పరమైన అంశాల్లో అవకతవకలు, అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఈ అవార్డును గతేడాది నిలిపివేశారు.

2017లో ఉద్యమంలా సాగిన మీ టూ క్యాంపెయిన్‌లో ఫ్రెంచ్ స్వీడిష్ ఫోటోగ్రాఫర్ జీన్ - క్లాడ్అర్నాల్ట్ తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ 18 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. ఇలా 20 ఏళ్లకుపైగా తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని మహిళలు ఫిర్యాదు చేశారు. జీన్ క్లాడ్ స్వీడిష్ అకాడెమీ సభ్యురాలైన ప్రముఖ కవియిత్రి క్యాతరీనా ఫ్రోస్టెన్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే 1786లో ఏర్పాటు అయిన స్వీడిష్ అకాడెమీ పురస్కారాలు ఇవ్వకుండా ఏడు పర్యాయాలు నిలిపివేసింది. 1915, 1919, 1925, 1926, 1927వ సంవత్సరాల్లో నోబెల్ అందుకునేంత స్థాయిలో ఎవరి రచనలు లేకపోవడంతో నిలిపివేసింది. గతేడాది కూడా అవార్డు నిలిపివేయడంతో.. ఆ పురస్కారాన్ని ఈసారి ప్రకటించారు.