Tuesday, October 15, 2019
Follow Us on :

బుల్లితెర నటి బలవన్మరణం..

By BhaaratToday | Published On Feb 6th, 2019

బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ పంజాగుట్టలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆమె బ్యూటీ పార్లర్‌ కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అనే కుటుంబ స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు సోదరుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌.. ఝాన్సీ ఇంటికి వచ్చాక తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఝాన్సీ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమె సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సూర్యతో ఝాన్సీ ఛాటింగ్‌ చేసినట్లు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య వల్లే తన కుమార్తె చనిపోయిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ ఆరోపించారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని సూర్య తరచూ తనతో చెప్పేవాడని ఆమె తెలిపారు. తన కుమార్తె మృతికి కారణమైన సూర్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు.