Thursday, April 25, 2019
Follow Us on :

నేడు మోదీ చివ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం

By BhaaratToday | Published On Mar 7th, 2019

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ గురువారం చివరిసారిగా సమావేశం కానుంది. ఈ కేబినెట్‌ భేటీలో భారీ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ప్రతీ శుక్రవారం ఎన్నికల సంఘం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం శుక్రవారం త్రిసభ్య ఎన్నికల సంఘం సమావేశమై లోక్‌సభతో పాటు ఏపీ, జమ్మూ కశ్మీర్‌, ఒరిస్సా, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అయితే, శుక్రవారమే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందా? శని, ఆదివారాల వరకు వేచిచూడాల్సి వస్తుందా? అనే విషయంలో క్లారిటీ రాలేదు. ప్రధాని మోదీ శనివారం యూపీ, బీహార్‌లలో పలు శంకుస్థాపనల్లో పాల్గొంటారని, ఆ సందర్భంగా తన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధాని కోసం ఈసీ ఆగితే షెడ్యూల్‌ ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది. 2014లో మార్చి 5న షెడ్యూల్‌ ప్రకటన వెలువడగా, 25 రోజుల తర్వాత తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 7న జరిగింది. ఇప్పటికే ఎన్నికల తేదీల ప్రకటన ఆలస్యం అయినందున పదో తేదీన ప్రకటన వెలువడితే తొలిదశ పోలింగ్‌కు 25 రోజుల వ్యవధి ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు.