Saturday, August 24, 2019
Follow Us on :

పొల్యూషన్ కోరల్లో భారతీయ పట్టణాలు

By BhaaratToday | Published On Mar 7th, 2019

► గురుగ్రామ్‌కు కాలుష్య కిరీటం
► ఢిల్లీని కమ్మేసిన వాయు విషం
► పొల్యూషన్ కోరల్లో భారతీయ పట్టణాలు
► ఆయువిచ్చే వాయువే ఉసురు తీస్తోంది..!
► గాలి గరళం.. గ్లోబును కమ్మేస్తోంది..
► కాలుష్య కాసారంగా మారుతున్న భారత్
► టాప్ టెన్ కాలుష్య నగరాల్లో ఏడు మనవే

గురుగ్రామ్ కు కాలుష్య కిరీటం. ఢిల్లీని కమ్మేసిన వాయు విషం. పొల్యూషన్ కోరల్లో భారతీయ పట్టణాలు. ఊపరి సలపని ఉత్తరాది నగరాలు. ఆయువిచ్చే వాయువే ఉసురు తీస్తోంది..! తాను తీసిన గొయ్యిలోనే మనిషిని పూడ్చేస్తోంది..! గాలి గరళం గ్లోబును కమ్మేస్తోంది..! ‘ఎయిర్’ స్ట్రయిక్..!.. ఇదే భార‌త్ టుడే స్పెష‌ల్ స్టోరీ.

మ‌నిషి కంటికి క‌న‌బ‌డ‌ని శ‌త్రువుతో యుద్ధం చేస్తున్నాడు:
 కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు మనిషి. ఆ శత్రువు పేరే వాయుకాలుష్యం. తాను సృష్టించిన చేతిలో మనిషి ఓడిపోతూనేవున్నాడు. తాను పెంచి పోషించిన శత్రువు కోరల్లో విలవిలాడుతున్నాడు. తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలు, వందలు కాదు, ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్య కాసారాలుగా మారుతున్న నగరాల్లో 15 నగరాలు అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక‌ప్పుడు ప్రకృతి సంప‌ద‌తో తుల‌తూగిన భార‌త‌దేశం ఇప్పుడు కాలుష్యంతో ధ్వంస‌మ‌వుతోంది. గాలి, నీరు, నేల ఇలా ప్ర‌తీది కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణం ధ్వంసం అవుతున్న‌ది. మాన‌వుల‌తో స‌హా స‌మ‌స్త జీవ‌జాతులకు ముప్పు ఏర్ప‌డుతున్న‌ది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మనుషులకు వచ్చే 102 వ్యాధుల్లో  85 వ్యాధులు పర్యావరణ కాలుష్యం వ‌ల్లే వస్తున్నాయి. కాలుష్యం కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాల్లో భార‌త్‌దే తొలిస్థానం.

గాలి విషంగా మార‌డానికి కార‌ణ‌మిదే :
జీవం అస్థిత్వానికే మూలాధారమైన గాలి విషంగా మారడానికి కారణమేంటి..? వాయు కాలుష్య కారకాలను అరికట్టలేమా..? ప్రత్యేక చర్యల ద్వారా ఈ సమస్యను నియంత్రించగలమా..? సమస్యను అధిగిమించేందుకు సవాలక్ష మార్గాలున్నాయి. వాటని పకడ్బందీగా అమలుచేస్తే, వాయు కాలుష్యాన్ని తరిమికొట్టడం పెద్ద విషయమేమీ కాదు. ఎన్నో దేశాలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. కాలుష్యానికి భారత్ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల టాప్ టెన్ జాబితాలో ఏడు నగరాలు మనవే కావడం బెంబేలెత్తిస్తోంది. ఏ నగరంలో ఎంత మేర కాలుష్య ఉందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ఎయిర్ విజువల్, గ్రీన్ పీస్ అనే సంస్థలు అధ్యయనం చేయగా.. భారత్ లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వెల్లడైంది. 2018కి సంబంధించిన ఈ గణాంకాల్లో భారత నగరాలే అగ్రస్థానంలో ఉన్నాయి.

ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్‌ కాలుష్య కిరీటం దక్కింది. గాలి నాణ్యత ఘనపు మీటరుకు 135.8 మైక్రోగ్రాములతో గురుగ్రామ్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 135.2 మైక్రోగ్రాములతో ఘజియాబాద్ రెండోస్థానం దక్కించుకోగా.. పాకిస్థాన్‌ లోని ఫైసలాబాద్ 130.4 మైక్రోగ్రాములతో మూడోస్థానంలో నిలిచింది. ఇక ఫరీదాబాద్, బివాడి నగరాలు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. మొత్తానికి టాప్ - 5 లో నాలుగు భారతీయ నగరాలే ఉండటం.. భారత్ లో వాయుకాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది.

టాప్ టెన్ లోనూ భారతీయ నగరాలదే అగ్రస్థానం :
తాజా జాబితాలో నోయిడా ఆరో స్థానం, పాట్నా ఏడో స్థానంలో నిలవగా.. చైనాకు చెందిన హోతాన్ నగరం ఎనిమిదో స్థానంలో నిలించింది. మళ్లీ తొమ్మది స్థానంలో లక్నో నిలవగా.. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం పదో స్థానంలో నిలిచింది. టాప్ టెన్ లోనూ భారతీయ నగరాలదే అగ్రస్థానం. మొదటి పదిస్థానాల్లో ఏడు భారతీయ నగరాలేవున్నాయి. గ్రీన్ పీస్ జాబితాలో 113.5 పీఎం 2.5 స్థాయితో దేశ రాజధాని ఢిల్లీ 11వ స్థానంలో నిలవగా.. జోధ్ పూర్ 12, ముజఫర్ పూర్ 13 స్థానాల్లో నిలిచాయి. ఇక ఆధ్యాత్మిక నగరం వారణాసికి 14వ స్థానం దక్కగా.. మొరాదాబాద్ 15వ స్థానం దక్కించుకుంది. ఇలా టాప్ - 15 కాలుష్య నగరాల్లో కూడా 12 నగరాలు మనవే. ఇక జాబితాలో ఆగ్రా 16వ స్థానంలో నిలవగా, 17వ స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచింది. గయా 18వ స్థానంలో నిలవగా.. చైనాకు చెందిన కస్ఘర్ 19వ స్థానంలో నిలిచింది. 20 వ స్థానంలో మళ్లీ భారతీయ నగరం జింద్ చోటు దక్కింది. మొత్తాని టాప్ - 20 జాబితాలో 15 నగరాలు చోటు దక్కించుకున్నాయి. 2017కు గానూ టాప్ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ కూడా ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతేకాదు, టాప్ 30లో 22 మన నగరాలే ఉండటం.. భారత్ లో వాయు కాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పీఎం 2.5 కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాహన రాకపోకలు, పంట వ్యర్ధాల దగ్ధం వంటివి పరిస్థితి చేజారేందుకు దోహదపడుతున్నాయి. 

గతంలో కాలుష్య కాసారంగా మారిన చైనా రాజధాని బీజింగ్‌.. అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించింది. ప్రస్తుత జాబితాలో బీజింగ్ 122వ స్ధానానికే పరిమితమైంది. కొంతకాలంగా చైనా చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో చైనా నగరాల్లో కాలుష్యం చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా బీజింగ్‌లో కాలుష్యం ఐదురెట్లు అధికంగా ఉంది. మొత్తం మూడువేల నగరాల్లో సేకరించిన నమూనాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడైంది. నగరాలలో వ్యాపించి ఉన్న వాయు కాలుష్యానికి పరిశ్రమలు, నివాసాలు, కార్లు, ట్రక్కుల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు ప్రధాన కారణమని గ్రీన్ పీస్ నివేదిక గుర్తించింది. ఈ ఉద్గారాలలో అనేకం మానవ ఆరోగ్యానికి హాని కలుగచేస్తాయని స్పష్టం చేసింది. వాయు కాలుష్యం వల్ల వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం వల్ల సుమారు 70 లక్షల మంది మృత్యువాత పడే అవకాశలున్నట్లు అంచనా వేసింది.

ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ల ఆందోళ‌న :
అంతేకాదు, వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 225 బిలియన్ డాలర్టుల.. అంటే.. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందని పర్యావరణవేత్తలు అంచనావేస్తున్నారు. వాయు కాలుష్యం కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సకు కొన్ని లక్షల కోట్లు వ్యయమవుతుందనే అంచనాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను ఇప్పటికే పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండంలోని అన్ని నగరాలు దాటిపోయి కాలుష్య కాసారాలుగా మారాయి. భారత్‌లోని నగరాలలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేయాలని గ్రీన్‌ పీస్ ఇండియాతో కలిసి పనిచేస్తున్న పర్యావరణ కార్యకర్త పుజారిని సేన్ పిలుపునిచ్చారు. తాజా నివేదిక నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయ చిత్తశుద్ధి మన దేశంలో లేదని పర్యావరణవేత్త రవీనాకోహ్లీ విమర్శించారు. ఆరోగ్య సమస్యలు ఓట్లు కురిపించడంపై ప్రభావం చూపవు గనుక రాజకీయ నాయకులు ప్రజారోగ్యాన్ని విస్మరించి, పౌరుల ప్రాణాలను పణంగా పెడుతూ బడ్జెట్‌లకు కోత పెడుతూ వస్తున్నారని విమర్శించారు.

మాన‌వుల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం:
పరిశ్రమలు, ఇళ్లు, వాహనాల నుంచి విడుదలవుతున్న కలుషిత ఉద్గారాలు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కలుషిత ఉద్గారాలలోని అత్యంత సూక్ష్మ పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశంలోని కాలుష్య నియంత్రణ బోర్డులు అధికారాలు, సరైన పరికరాలు లేకుండా నిర్వీర్యంగా ఉండటంతో వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. బొగ్గు, పెట్రోల్-డీజిల్ తదితర శిలాజ ఇంధనాల వినియోగం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, అపరిమిత విద్యుత్ వినియోగం, నిలువయ్యే మురుగు, చెత్త తగులబెట్టడం వంటివి కూడా గాలిని బాగా కలుషితం చేస్తాయి. ఎటువంటి శుద్ది చర్యలు చేపట్టకుండా వాటినలా వాతావరణంలోకి వదిలేయడం వల్ల గాలి కాలుష్యం పెరిగిపోతోంది. కల్తీ ఇంధనాల వాడకం, కాలం చెల్లిన వాహనాలను తిరగనివ్వడం వల్ల పరిస్థితి మరింత ఉదృతమవుతోంది. ప్లాస్టిక్, పాత టైర్లను, పారిశ్రామిక వ్యర్థాలను, ఇతర చెత్తా చెదారాన్ని జనావాసాల మధ్యే కాల్చడం వల్ల కూడా గాలి కలుషితమవుతోంది. పరిమితిని మించి వెలువడే ఉద్గారాల స్థాయిని గుర్తించే పక్కా వ్యవస్థ మనకు లేదు. ఇక నియంత్రించే వ్యవస్థ అసలే లేదు. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ తదితర నైట్రోజన్ సంబంధ వాయువులు, ముఖ్యంగా బెంజిన్ వంటి ప్రమాదకరమైన ఉద్గారాలు నిత్యం మన నగరాలు, పట్టణాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే, గ్రేటర్ పరిధిలో 50 లక్షలకు పైగా వాహనాలున్నాయి. ఏటా సగటున 2 లక్షలకు పైగా వాహనాలు పెరుగుతున్నాయి. ఏటా దాదాపు 130 కోట్ల లీటర్ల పెట్రోల్, 150 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగమవుతున్నట్టు అంచనాలున్నాయి. ఇందులో అత్యధిక వాహనాలు, ఏ సమయంలో చూసినా కేవలం 7 వేల కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న రోడ్లపై తిరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీంతో ట్రాఫిక్ పెరిగి, వాహనాల సగటు వేగం గంటకు 12 కిలోమీటర్లకు పడిపోయింది. ఫలితంగా, అవి ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తూ, మరింతగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

పారిశ్రామిక వ్య‌ర్థాలు..మురుగునీరు వ‌చ్చి చేరే హుస్సేన్‌సాగ‌ర్ నీరు :
ఇక పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు వచ్చి చేరే హుస్సేన్‌ సాగర్, మూసీ కూడా వాయు కాలుష్య కారకాలే. విలాసాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డ నగరజీవి జీవనశైలికి తోడు అవసరానికి మించిన ఏసీల వాడకం, సొంత వాహనాల్ని విరివిగా వాడటం వల్ల కూడా సమస్య జటిలమవుతోంది. వాయు కాలుష్యం వల్ల దేశంలో దాదాపు 70 కోట్ల మంది ఆయుష్షు సగటున మూడున్నర సంవత్సరాలు తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో పట్టణవాసులే అధికంగా ఉన్నారు. వాయుకాలుష్యం వల్ల ఆయుర్దాయం తగ్గడమే కాదు, పనిలో సామర్థ్యం, ఉత్పాదకత తగ్గిపోతున్నాయి. అనారోగ్యం, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. వాయు కాలుష్యం పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, విద్య-వైద్య సదుపాయాలు కొరవడటం వంటి కారణాలతో పట్టణాలు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. గత ఒకటి, రెండు దశాబ్దాలుగా దేశంలో పట్టణ జనాభా అపరిమితంగా పెరుగుతోంది. జనాభాతో పాటు వాయుకాలుష్యం కూడా అంతకంతకూ పెరుగుతోంది. 2015లో వాయుకాలుష్యంపై యూకేకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ అనే సంస్థ చేసిన సర్వేలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపట్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2010లో 19వేల 700 చనిపోతే, 2025లో ఆ సంఖ్య 31వేల 100కు చేరుకోవచ్చని తేలింది. 2050 నాటికి ఢిల్లీలో ఏడాదికి 52 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోతారంటూ రిపోర్టు తేల్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో కూడా ఇదే పరిస్థితి. 2010లో 10వేల 200 మంది వాయు కాలుష్యం కారణంగా అకాల మృతి చెందారు. ఈ సంఖ్య 2025 నాటికి 17వేల 400, 2050 నాటికి 33వేల 100కు చేరొచ్చని అంచనా. ఇక కోల్ కతా కథ కూడా అంతే. 2010లో 13వేల 500 మంది చనిపోయారు. 2025 నాటికి 26 వేల 600, 2050 నాటికి 54 వేల 800కు చేరొచ్చని అంచనా. అంటే, 2025 నాటికి వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కవగా చనిపోయేవారు ఢిల్లీ ప్రజలైతే 2050 నాటికి ఢిల్లీని బీట్ చేస్తోంది కోల్ కతా.

హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి దారుణం :
ఇక మన మహానగరం హైదరాబాద్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. నగరంలో ప్రతి పది మందిలో ఒక్కరు మాత్రమే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. మిగిలిన 9 మంది విపరీ తమైన కలుషితగాలిని ఊపిరితిత్తుల్లోకి నింపేస్తూ పలు రకాల రోగాల బారిన పడుతున్నారు. అసలు నగరాల్లో గాలి పీల్చుకోడానికి ఏమాత్రం ఉపయోగపడేలా లేదు. చిన్న చిన్న దుమ్ము కణాలు, పెట్రోలియం వ్యర్థాలతో పాటు, అత్యంత ప్రమాదకరమైన బెంజీన్‌ కూడా క్యూ బిక్‌ మీటరుకు 8.4 మిల్లీగ్రాముల చొప్పున ఉంటోంది. దీనివల్ల కేన్సర్‌ సులభంగా వస్తుంది. వాస్తవానికి బెంజీన్‌ ప్రతి క్యూబిక్‌ మీటరుకు 5 మిల్లీగ్రాములు మాత్రమే ఉండాలి. 2011 నాటికి ఇది కేవలం 1.8 ఉండగా, ఇప్పుడు అది పరిమితికి మించి వెలువడుతోంది. ఇది చాలదన్నట్లు పర్టిక్యులేట్‌ మేటర్‌ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. గరిష్ఠంగా 60 ఉండాల్సిన పీఎం-10, ఇప్పుడు 135 దాటి పరుగులు తీస్తోంది. అలాగే 40 ఉండాల్సిన పీఎం-2.5, ప్రస్తుతం 60 కు చేరుకుంది. ఈ సగటు లెక్కలు నగరవాసులు బెంబెలెత్తిస్తున్నాయి. 

ఢిల్లీలో స‌రి-బేసి విధానం :
వాయు కాలుష్యం సమస్య జటిలమైందే అయినా పరిష్కారం లేనిది మాత్రం కాదు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి విధానం సత్ఫలితాలనిచ్చింది. దీనిని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. ఇలాంటి విధానాన్ని ఇతర భారతీయ నగరాలన్నీ అనుసరించాలి. ఇలాంటి కొన్ని నిర్దిష్టమైన ఉపశమన చర్యలు తీసుకుంటే, దాదాపు 70 కోట్ల భారతీయుల ఆయుర్దాయాన్ని సగటున మూడున్నరేళ్ల చొప్పున పెంచొచ్చంటున్నారు నిపుణులు. అంటే, కొరగాకుండా పోతాయనుకుంటున్న 200 కోట్ల జీవన వసంతాల్ని పౌరులకుమిగిల్చవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇందుకు శ్రద్ధ తీసుకోవాలి. భారతీయులు స్వచ్ఛమైన గాలిని పీల్చాలి అని అనుకుంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్‌ప్లాన్, క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వంటి పథకాలను మరింత పటిష్ఠంగా, ఉద్ధృతంగా, చట్టబద్ధంగా, క్షేత్రస్థాయి నుంచి అమలు చేయాలి. పర్యావరణ సన్నిహిత పరిశ్రమలను, నిర్మాణాలను ప్రోత్సహించాలి. ద్విచక్రవాహనాలు, ఇతర ఆటోమొబైల్స్‌లో కాలుష్యరహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలి. కాలుష్య ఉద్గారాల తగ్గింపుపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. బొగ్గు, డీజిల్ వంటి కాలుష్య కారక ఇంధన వినియోగంపై పరిమితులు విధించాలి. అత్యల్ప స్థాయిలో అంచెలంచెలుగా ఈ సమస్యను పరిష్కరించలేము. యుద్ధ ప్రాతిపదికన, పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి. చైనా, స్వీడన్‌ వంటి దేశాలు కాలుష్య నివారణకు తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. 2010-2015 మధ్యకాలంలో గాలిలో ప్రమాదకర కాలుష్య రేణువుల శాతం భారత్‌లో 13 శాతం పెరగ్గా, చైనాలో 17 శాతం తగ్గింది. దీనినిబట్టి అక్కడ ఎంతటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌ నిర్వహించే సమయంలో కాలుష్యం ప్రమాదకర పరిస్థితిలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా చైనాపై విమర్శలు వచ్చాయి. దిల్లీ మాదిరిగా బీజింగ్‌లో చలికాలంలో కాలుష్య తీవ్రత ఎక్కువ ఉండటంవల్ల పరిస్థితి ప్రాణాంతకంగా ఉండేది. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విషపూరిత రసాయనాలను, వాయువులను వెదజల్లే పరిశ్రమల మీద పన్నులు విధించింది. కాలుష్య కారకాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులకూ ప్రధాన కారణమైన బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించింది. బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వంద పరిశ్రమలను మూసేశారు. ప్రధాన నగరాల్లో బొగ్గు ఆధారిత కర్మాగారాలకు పూర్తిగా తెరదించేలా చర్యలు తీసుకుంది. ప్రత్యామ్నాయంగా పవనశక్తి, సౌరశక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేసింది. వాహనాల కోసం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే ఇంధనం ఉత్పత్తి చెయ్యడంతో పాటు, కార్ల కొనుగోళ్లపై నిబంధనలు విధించింది.

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు:
పెట్రోలు, డీజిలు వాహనాలను తొలగించడానికి డెన్మార్క్ వంటి దేశాలు పకడ్బందీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2018 తరవాత తయారైన డీజిల్ వాహనాలను రాజధాని కోపెన్‌హెగన్‌లోకి ప్రవేశించకుండా ఆ దేశంలో నిషేధం విధించారు. ఇక 2019 నాటికి మొత్తం వాహనాలను తొలగించాలని నార్వే లక్ష్యంగా పెట్టుకుంది. అలు 2025నాటికి అన్ని వాహనాల తొలగించాలని.. దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలే తిరిగేలా నెదర్లాండ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2030 నాటికి పూర్తిగా పెట్రో వాహనాల తొలగించేలా స్కాట్లాండ్‌ చర్యలు తీసుకుంటోంది. 2032 నాటికి పెట్రో వాహనాల అమ్మకాలను నిషేధించేలా ఫ్రాన్స్ కూడా చర్యలు ప్రారంభించింది. భారత్ కూడా 2030నాటికి విద్యుత్‌ వాహనాల అమ్మకాలకు ప్రోత్సాహించాలని నిర్దేశించుకున్నా.. ఆ పనిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం వుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం వుంది. తాజాగా హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ కొన్ని రూట్లలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడం శుభపరిణామం.