Friday, July 19, 2019
Follow Us on :

మోదీ పై పోటీకి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మ‌రోసారి ఆయ‌నే..!

By BhaaratToday | Published On Apr 25th, 2019

ఉత్తరప్ర‌దేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారన్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ నుంచి మరోసారి అజయ్ రాయ్‌కే అవకాశం దక్కింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్  ఒక ప్రకటన విడుదల చేశారు. విపక్షాల కూటమి అభ్యర్థిగా ప్రియాంకను బరిలోకి దింపుతారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే పార్టీ అధిష్ఠానం చెప్పిన చోటు నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రియాంక కూడా వెల్లడించారు. 

చివరకు స్థానికంగా పట్టున్న అజయ్‌ రాయ్‌వైపే పార్టీ మరోసారి మొగ్గు చూపింది. 2014లో వారణాసిలో ప్రధాని మీద అజయ్ రాయ్‌తో పాటు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ చేశారు. కానీ విజయం మోదీనే వరించింది. మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని రెండోసారి కూడా వారణాసినుంచే పోటీ చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వార‌ణాసిలో గురువారం రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు.