Sunday, December 15, 2019
Follow Us on :

అక్బరుద్దీన్ ను వెంటాడుతున్న కేసు.. బెయిల్ రద్దు చేయాల్సిందే

By BhaaratToday | Published On Aug 15th, 2019

మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ 2013లో నిజామాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి  తెలిసిందే. విద్వేషపూరితంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. అక్బరుద్దీన్ కు తాజాగా  స్పెషల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. 2013లో నిజామాబాద్ లో చేసిన ఓ ప్రసంగం విద్వేషపూరితంగా ఉందని గతంలో దాఖలైన కేసులో ఒవైసీ బెయిల్ పై ఉన్నారు.

 ఈ బెయిల్ ను రద్దుచేయాలని న్యాయవాది కాషిమ్ శెట్టి కరుణసాగర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అక్బరుద్దీన్ కు నోటీసులు జారీచేసింది. తమ స్పందనను తెలియజేయాలని ఒవైసీని కోరింది.

ఇప్పటికే గతంలో చేసిన విద్వేషవ్యాఖ్యల వివాదం చల్లారకుండానే అక్బరుద్దీన్ లో మార్పు రాలేదు. ఇటీవల కరీంనగర్ లో కూడా ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. జులై నెలలో  కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ బలపడడం తనను చాలా బాధకు గురిచేసిందని అన్నారు. నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు చెప్పారు.. ఎంతకాలం బతుకుతానో తెలియదు.. ఆ విషయంలో నాకు బాధ లేదు. నా బాధంతా కరీంనగర్ లో బీజేపీ బలపడటం. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం నాకు చాలా బాధ కలిగించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీకి అడ్రసు కూడా లేదని, ఇప్పుడు ఎంపీ స్థానాన్నే కైవసం చేసుకుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ పై కూడా అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తమ వెంట్రుక కూడా పీకలేరని అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌ మనల్ని ముట్టుకోవడానికి కూడా సాహసించదు. ఎందుకంటే నేను ఆరోజు చేసిన వ్యాఖ్యలకు అది ఇంకా భయపడుతోంది. మనం భయపెడితే ఎదుటి వారు భయపడతారు. ఆరోజు నేను అలా అన్నందుకే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగింది అని అన్నారు.

మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒవైసీ బెయిల్ పిటిషన్ లోని నిబంధనలను ఉల్లంఘించారని పిటీషనర్ స్పష్టం చేశారు.  వెంటనే అతడి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు.