Thursday, April 25, 2019
Follow Us on :

సైనికుల ప‌రాక్ర‌మానికి ప్ర‌తీక‌గా వ‌స్తున్న 'కేస‌రి'

By BhaaratToday | Published On Mar 21st, 2019

బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘కేసరి’తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 1897లో జరిగిన సారాగఢి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చారిత్రక నేపథ్య చిత్రమిది. పరిణీతి చోప్రా నాయికగా నటించింది. అనురాగ్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రమిది. కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఇషార్‌ సింగ్ పాత్ర‌లో అక్షయ్‌ నటించారు. నేడు విడుదలవుతున్న‌ ఈ సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

మన దేశం బ్రిటిష్‌ పాలనలో ఉండగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సుమారు పది వేల మంది సైనికులు దండెత్తి వచ్చారు. వారిని భారత సైన్యంలోని సిక్కు విభాగానికి చెందిన 21మంది సైనికులు నిలువరించారు. రెండు సేనల మధ్య భీకర పోరు జరిగింది. అటు పది వేల మంది... ఇటు 21 మంది! అంత పెద్ద బలగాన్ని చూసి భారత సైనికులు బెదిరిపోలేదు. వెనకడుగు వేసి పారిపోలేదు. తమ గుండె బలాన్నే ఆయుధంగా చేసుకుని ముందుకు క‌దిలారు. చొరబాటుదారుల కుత్తుకలు నరకడం మొదలుపెట్టారు. శత్రువులను చీల్చి చెండాడుతూనే వీరమరణం పొందారు. 1897 సెప్టెంబరు 12న జరిగిన ఈ సంగ్రామం హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ నేతృత్వంలోని సిక్కు సైనికుల దళం చూపిన పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది. ఏటా సెప్టెంబరు 12న భారత సైన్యం సిక్కు వీరులను స్మరించుకుంటోంది. ఈ యుద్ధం ఆధారంగానే ‘కేసరి’ తెరకెక్కింది.