Wednesday, October 16, 2019
Follow Us on :

జమ్ముకశ్మీర్ మళ్ళీ రాష్ట్రం అవుతుందా.. కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

By BhaaratToday | Published On Aug 6th, 2019

రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది. అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముందస్తు ప్రణాళిక ప్రకారం, బీజేపీ ఆలోచనలను పక్కాగా అమలు చేశారు. ఈ ఉదయం 11.15 గంటల సమయంలో నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దుకు సిఫార్సు చేయడం, ఆపై వెంటనే మూజువాణీ ఓటింగ్ తో సభ బిల్లు ఆమోదించగా, 11. 25 గంటల సమయంలోనే రాష్రపతి రామ్ నాథ్ కోవింగ్ కార్యాలయం నుంచి ఆ బిల్లుపై సంతకం చేస్తున్నట్టుగా గజిట్ ను వెలువరించింది.

జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడనున్నాయి.

ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, పరిస్థితులు అనుకూలిస్తే జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం హోదాను సంతరించుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.జమ్ముకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలను ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచాలని అనుకోవడం లేదు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని అమిత్ షా అన్నారు.