
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటికే 359 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎక్కడెక్కడ.. ఉన్నాయో అని జల్లెడ వేస్తున్నారు. గురువారం రోజున కూడా మరో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రాజధాని కొలంబోకు సమీపంలో తూర్పు వైపున ఉన్న పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మాట్లాడుతూ, పుగోడాలోని మేజిస్ట్రేట్ కోర్టు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని చెప్పారు.
అయితే ఈ బాంబ్ బ్లాస్ట్స్ వెనుక శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి అయిన మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్ అహ్మద్ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్ ఇబ్రహీం (31) ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్సాత్ అహ్మద్ ఇబ్రహీం, ఇల్హాం అహ్మద్ ఇబ్రహీం ఇద్దరూ బ్యాగుల్లో బాంబులు నింపుకుని కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీ లా హోటళ్లలో దాడులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వీరి పేర్లు బయటకు రాగానే యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్ అహ్మద్ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.