Friday, July 19, 2019
Follow Us on :

పాక్ ను మ‌రోసారి హెచ్చ‌రించిన అమెరికా..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పాకిస్థాన్ ను అగ్ర‌రాజ్యం అమెరికా హెచ్చరించింది. ‘‘ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప‌టిష్ట‌మైన‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని... ముఖ్యంగా జేషే మహ్మద్‌, లష్కరే తోయిబా సంస్థల కార్యకలాపాలపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది’’ అని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ఉగ్ర సంస్థలపై సరైన చర్యలు తీసుకోకుండా ఉండి, భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగితే అది పాకిస్థాన్‌కు చాలా ప్రమాదం అని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాల నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశంపై అమెరికా అధికారులు స్పందించారు. ఇటీవల పాక్‌ ఉగ్రవాదంపై చర్యలు ప్రారంభించినట్లు అర్థమవుతోందని వారు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు కాస్త చల్లబడ్డప్పటికీ.. సైనిక దళాలు మాత్రం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాయన్నారు. మరో దాడి జరిగిన పక్షంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందన్నారు. పుల్వామా దాడి అనంతరం  రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాల ప్రతినిధులతో నిరంతర చర్చలు జరిపింది. పరిస్థితులు చేజారిపోకుండా చూడాలని పదే పదే సూచించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.