Saturday, August 24, 2019
Follow Us on :

సభలో 'బంట్రోతు' వివాదం

By BhaaratToday | Published On Jun 13th, 2019

ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో 'బంట్రోతు' వివాదం నెలకొంది.  ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా, విపక్ష నేత చంద్రబాబు రాలేదు. దీంతో చంద్రబాబు బదులు అచ్చెన్నాయుడు వచ్చారు.  

 చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కోడెలను స్పీకర్ గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఓ బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు కూడా టీడీపీ నేతలకు మనసు రాలేదని చెవిరెడ్డి అన్నారు. వీళ్లా సభాసంప్రదాయాల గురించి మాట్లాడేది? స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే మీ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదు అధ్యక్షా. అదే స్థానంలో తమ సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉండే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్పీకర్ ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతును పంపారు అని చెవిరెడ్డి అచ్చెన్నాయుడిని పరోక్షంగా అన్నారు. 


తనను చంద్రబాబు బంట్రోతుగా చెవిరెడ్డి అభివర్ణించడంపై అచ్చెన్నాయుడు సభలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అధ్యక్షా.. చంద్రబాబు తన బంట్రోతును పంపారు అన్న మాట మీకు తీపిగా ఉంటే దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మేము ఎమ్మెల్యేలమా? లేక బంట్రోతులమా? అన్నది మీరే తేల్చాలి. ఒకే... మేము చంద్రబాబు బంట్రోతులం అయితే మీరు 150 మంది జగన్ మోహన్ రెడ్డి బంట్రోతులు అని ఒప్పుకోండి. శాసనసభ్యులం కాదని ఒప్పుకోండి. మీకు దండం పెడతాం. మేం శాసనసభ్యులుగా, ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా సభకు వచ్చాం. తోటి శానససభ్యుడికి మరో శానససభ్యుడు గౌరవం ఇవ్వాలని అచ్చెన్నాయుడు అన్నారు. 

చెవిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. టీడీపీ నేతలు సాధారణంగా తమను తాము ప్రజా సైనికులు అనీ, సేవకులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బంట్రోతులాగా అని చెవిరెడ్డి అని ఉండొచ్చు అధ్యక్షా. కాకపోతే గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు వినాలి అధ్యక్షా.
ఒకరేమో పూడ్చిపెడతాం అంటాడు. ఇంకొకరు ఏమో పాతిపెడతాం అంటారు. చివరికి అచ్చెన్నాయుడు అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను పట్టుకుని ‘నువ్వు మగాడివైతే’ అని దుర్భాషలాడారు. మరి ఈ మాటలకు సమాధానం లేదా అధ్యక్షా? ఈరోజు చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు.  సేవకులు, సైనికులు అని చెప్పుకుని టీడీపీ నేతలు తిరుగుతుంటారు కాబట్టి చెవిరెడ్డి ఓ మాట అని ఉండొచ్చు. దానికే ఈ చిన్న మాటను పట్టుకుని గొడవ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.