Wednesday, October 16, 2019
Follow Us on :

ఏపీ రైతులకు తీపి కబురు..! కేబినెట్ లో కీలక నిర్ణయం..!!

By BhaaratToday | Published On Feb 13th, 2019

అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కౌలు రైతులూ ఇందుకు అర్హులుగా పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు మాత్రమే కేంద్రం ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తుందని, తాము ప్రతి రైతు కుటుంబానికీ, కౌలు రైతులకు రూ.10 వేలు చొప్పున ఇవ్వనున్నామని సోమిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా కేంద్రం వేసే రూ.2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3వేలు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లా ఆస్పత్రుల స్థాయి పెంపునకు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. పంచాయతీ కంటిజెన్సీ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సోమిరెడ్డి వెల్లడించారు.