Wednesday, October 16, 2019
Follow Us on :

కేటీఆర్‌కు స‌వాల్ విసిరిన చంద్ర‌బాబు

By BhaaratToday | Published On Feb 24th, 2019

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ క‌మిటీ అధ్య‌క్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు ముఖ్యనేతలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్య‌మంత్రి అవుతాడని కేటీఆర్‌ అంటున్నారని, కేసీఆర్‌, జగన్‌ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని చంద్ర‌బాబు ప్రశ్నించారు. రాజధానిలో అభివృద్ధి ఏమీ లేదు.. అంతా గ్రాఫిక్స్‌ అంటున్నారని, ముందు గ్రాఫిక్స్‌ వచ్చిన తర్వాతే భవనాలు వస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కుప్పిగంతులు తన దగ్గర పనిచేయవని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని, అలాగే ఏపీకి కాబోయే సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తనకు నమ్మకం ఉందని, జగన్‌కు మద్దతిచ్చేందుకు తాము ఏపీకి వెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్న మాట‌ల‌కు చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు.