Sunday, August 18, 2019
Follow Us on :

ఎన్నిక‌ల సంఘం ఏ రాజ‌కీయ పార్టీకి కొమ్ముకాయ‌దు

By BhaaratToday | Published On Mar 14th, 2019

ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్ప‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘానికి రాజకీయాలు ఆపాదించవ‌ద్ధ‌ని అన్నారు. ఎన్నిక‌ల సంఘం ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయ‌ద‌ని.. ఎన్నికల ప్రక్రియలో సంఘానిది రిఫరీ పాత్ర మాత్రమే, ఎవరి పక్షాన పని చేయదని, ఎవరికి నచ్చిన అన్వయం వారు ఇచ్చుకోవద్దని హెచ్చ‌రించారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని, ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించవద్దని ఆయ‌న‌ హితువు ప‌లికారు. 

20వ తేదీలోపు ఫారం-7 దరఖాస్తులను క్లియర్ చేస్తామ‌ని.. 165 నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలన పూర్తైంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,44,825 ఫారం-7 మొత్తం దరఖాస్తులు రాగా.. 6,10,143 దరఖాస్తుల తిరస్కరణ కాగా.. 2,58,852 దరఖాస్తుల అమోదం పొందాయ‌న్నారు. ఇప్పటి వరకు 1,42,408 డూప్లికేట్ ఓట్లను తొలగించామ‌ని చెప్పారు. జిల్లా యంత్రాంగాల నుంచి క్షేత్ర స్థాయి నివేదికలు రాకుండా ఓట్ల తొలగింపు సాధ్యపడదని స్ప‌ష్టం చేశారు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసుల నమోదయ్యాయ‌ని ద్వివేది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30కోట్ల నగదు, 16కేజీల బంగారాన్ని సీజ్ చేశామ‌ని వివ‌రించారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత  కొత్త ఓట్ల కోసం 3,57,539  ఫారం -6 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని, మార్చి 15నాటికి పది లక్షల వ‌ర‌కూ దరఖాస్తులు రావొచ్చని అంచనా వేశామ‌న్నారు. 2015-17 మధ్య వేర్వేరు సర్వేలలో.. వేర్వేరు కారణాలతో 25లక్షల ఓట్ల తొలగింపు జ‌రిగిందని అన్నారు. 2014 ఓటర్లతో పోలిస్తే 2019లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గింద‌న్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భారీగా ఓట్ల తగ్గుదల జ‌రిగింద‌న్నారు.