Tuesday, June 18, 2019
Follow Us on :

ఆయ‌న మైండ్ బ్లాక్ అయ్యింది.. ఇక శాశ్వతంగా ప్రతిపక్షనాయకుడిగా...

By BhaaratToday | Published On Jun 12th, 2019

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద‌ ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మామూలుగానే ఓ గజినీ అని, అధికారం కోల్పోయాక ఆయనకేమీ అర్థం కాక ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 

చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను తాము ఆపేస్తున్నామని.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నింటినీ తన హయాంలో కొనసాగించానని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోతే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు.

ప్రాజెక్టులను ఆపేస్తున్నామని ఎవరు చెప్పారు? మేము కొనసాగించట్లేదని ఎవరైనా చెప్పారా? అని  అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పారదర్శక విధానాన్ని, టెండర్లలో జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకొస్తున్నామని తద్వారా అవినీతిని అరికట్టే అవకాశముంటుందని తమ నాయకుడు జగన్ స్పష్టంగా చెప్పారని అన్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తామని, ప్రజాధనం వృధా కాకుండా చూడాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి సంబంధించి చాలా అవినీతి జరిగిందని పేపర్లు, మీడియాలో వచ్చిందని, దీనిపై ఓ కమిటీ వేస్తున్నామని, నలభై ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని అన్నారు. నిజంగా, చంద్రబాబు మంచి చేసుంటే ‘క్లీన్’గా బయటపడతారని, ఒకవేళ తప్పు చేసుంటే కనుక దోపిడీ బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఇది మొద‌లేన‌ని.. జగన్మోహన్ రెడ్డి పని తీరు ప్రారంభమయ్యి పదిరోజులేనని, దీనికే, చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింద‌ని.. ఇక‌ శాశ్వతంగా ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు ఉండిపోవచ్చని వ్యాఖ్యానించారు.