Saturday, October 19, 2019
Follow Us on :

తెల్ల జెండాలు పట్టుకుని వచ్చి.. మీ వారి మృతదేహాలు తీసుకెళ్లండి…పాక్ కు భారత్ సూచన

By BhaaratToday | Published On Aug 4th, 2019

గత కొద్ది రోజులుగా కశ్మీర్‌ లోయలో హై టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. బ్యాట్‌ దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు సమాచారం. మృతులు పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. వారు చనిపోయి దాదాపు 36 గంటలు దాటినా.. అయినా వారి మృతదేహాలు పీఓకే వద్ద అలానే పడి ఉన్నాయి. దీంతో భారత సైన్యం పాకిస్థాన్‌కు వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చింది. తెల్ల జెండాలు పట్టుకుని వచ్చి.. మీ వారి మృతదేహాలు తీసుకెళ్లి.. అంతిమ సంస్కరణలు నిర్వహించుకోవాలని తెలిపింది. అయితే దీనిపై పాక్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

సైన్యం ధీటుగా బదులిచ్చింది:
కశ్మీర్‌ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్‌నాథ్‌ యాత్రను భగ్నం చేసేందుకు పాక్‌ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్‌ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్‌ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్‌ ఆర్మీకి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు.