Tuesday, May 21, 2019
Follow Us on :

సినిమాల విడుద‌ల‌కు ఆటంకంగా మారిన ఎన్నిక‌ల కోడ్‌

By BhaaratToday | Published On Mar 13th, 2019

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా క‌ర్ణాట‌క‌లో శాండల్‌వుడ్‌కు ఎన్నికల కోడ్‌ సెగ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయదలచిన నటుల సినిమాల విడుదలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఉపేంద్ర, ప్రకాశ్‌రాజ్, సుమలతా, నిఖిల్‌ నటించిన సినిమాలు ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండ‌గా, ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సినిమాల విడుద‌ల‌కు ఆటంకంగా మారింది. అయితే ఎన్నిక‌ల కోడ్ సెగ త‌గ‌ల‌డంతో వీరు నటించిన చిత్రాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 

ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్‌ యూ’, సుమలతా అంబరీశ్‌ నటించిన ‘డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ’, నిఖిల్‌ కుమార, దర్శన్‌ కాంబినేషన్‌లో‘కురుక్షేత్ర’, ప్రకాశ్‌ రాజ్‌ నటిస్తున్న కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు మరికొద్ది రోజుల్లో విడుద‌ల కావాల్సి ఉంది.  ఉపేంద్ర చిత్ర ‘ఐ లవ్‌ యూ’ చిత్రాన్ని మార్చి చివరి వారం లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్మాత, దర్శకుడు ఆర్‌.చంద్రు సిద్ధమవుతున్నారు. కోడ్‌ నేపథ్యంలో విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తెలుగులో ఆలస్యమయినా ఫర్వాలేదు కానీ కన్నడలో విడుదల ఆసల్యమైతే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం నిర్మాత‌ల్లో నెల‌కొంది. ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీని నిలపబోతున్న సంగతి తెలిసిందే.

సీఎం తనయుడు నిఖిల్‌ మండ్య లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి నిలబడడం దాదాపు ఖాయమైంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అలాగే సుమలత నటించిన ‘డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ’ చిత్రం ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. ఆమె కూడా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా మారారు. పోటీపై సందిగ్ధం కొనసాగుతోంది. దీంతో చిత్ర విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్నారు. ఆయన నటించిన కొన్ని తెలుగు, తమిళ ప్రముఖ చిత్రాలు విడుదలపై జాప్యం నెలకొంది. చాలా చిత్రాల్లో ఆయా భాషల్లో స్టార్‌ హీరోలు నటించినవే కావడం విశేషం. ఆ చిత్రాలు కర్ణాటకలోనూ విడుదలయ్యేవే. ఎన్నికల కోడ్‌తో వీటికి కూడా బ్రేక్‌పడే అవకాశం క‌నిపిస్తోంది.