Tuesday, October 15, 2019
Follow Us on :

ఈడీ అదుపులో ఇద్ద‌రు కీల‌క నిందితులు

By BhaaratToday | Published On Feb 1st, 2019

అగస్టా వెస్ట్‌లాండ్ కుభకోణంలో ఇద్ద‌రు కీలక నిందితులు బ‌య‌ట‌ప‌డ్డారు. నిందితులైన‌ రాజీవ్ సక్సేనా, దీపక్ తల్వార్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. వీరిని దుబాయ్ నుంచి భారతదేశానికి రప్పించారు. రాజీవ్ సక్సేనా దుబాయ్‌లో వ్యాపారవేత్త, తల్వార్ కార్పొరేట్ ఏవియేషన్ లాబీయిస్ట్, వీరిద్దరినీ దుబాయ్ అధికారులు నిర్బంధించారు. వీరిపై మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.


అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను భారతదేశానికి రప్పించి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. మిషెల్‌కు రాజీవ్ సక్సేనా అత్యంత సన్నిహిత సహచరుడని తెలుస్తోంది. సక్సేనా, తల్వార్‌లపై విచారణ జరిపేందుకు సహకరించాలని భారత దేశ అధికారులు దుబాయ్ అధికారులను కోరడంతో బుధవారం వీరిని దుబాయ్ అధికారులు నిర్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ఇది కీల‌క‌మ‌ని చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వీరిద్దరిని ఈడీ కోర్టులో హాజరుపరిచింది. ఎనిమిది రోజులపాటు కస్టడీకి ఆదేశించాలని కోరింది.