Tuesday, May 21, 2019
Follow Us on :

వివేకా హ‌త్య కేసులో హైకోర్టు కీల‌క ఆదేశాలు

By BhaaratToday | Published On Mar 30th, 2019

మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి విలేకరుల సమావేశాలు నిర్వహించరాదని ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌), పోలీసులను ఆదేశించింది. కేసు దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయరాదని, అలాగే లీకులు ఇవ్వడం చేయరాదని ఆదేశించింది. అదే సమయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాలపై మాట్లాడరాదని సూచించింది. ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైసీపీ నేత‌ జగన్, వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్య హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో తుది నివేదిక దాఖలు చేయకుండా సిట్‌ను ఆదేశించాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి, సౌభాగ్య తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తమ తమ వాదనలను వినిపించారు.