Tuesday, June 18, 2019
Follow Us on :

లగడపాటిపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

By BhaaratToday | Published On May 21st, 2019

లగడపాటి రాజగోపాల్ సర్వే.. ఒకప్పుడు ఈయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అనేవాళ్ళు. కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఇచ్చిన సర్వే రిపోర్టులు తారుమారవ్వడంతో ఆయనను నమ్మే వాళ్ళు బాగానే తగ్గారు. ఇక ఆంధ్రప్రదేశ్ భవితవ్యం గురించి కూడా ఆయన ఎగ్జిట్ పోల్స్ ను ఆదివారం నాడు విడుదల చేశారు. అందులో తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కట్టారంటూ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సర్వేను చూసి తెలుగుదేశం అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేపై సంచలన వ్యాఖ్యలు చేశారు.    


ప్రజల నాడి తెలిసినవాళ్లు ఎగ్జిట్‌ పోల్‌ చేయాలి. ప్రజల నాడి తెలియనివాళ్లు.. పనికిమాలినవాళ్లు ఎగ్జిట్ పోల్స్ చేస్తే ప్రమాదం అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు లగడపాటిపై మండిపడ్డారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో.. బెజవాడాయన లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌కు కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టుకున్నారని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లు పందేలు కాశారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌తో సర్వనాశనమయ్యారు అని ఉదాహరణ చెప్పారు. హైదరాబాద్‌ ఓ పెళ్లికి వెళితే ఆయన మాట నమ్మి నాశనమయ్యాం సార్ అంటూ బాధను చెప్పుకున్నారని అయ్యన్న పాత్రుడు వివరించారు. రెండు రోజుల్లో ఎలాగూ ఫలితాలు వస్తాయి.. అంతా తెలిసిపోతుంది.. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదని ఆయన అన్నారు. 

రెండు రోజుల క్రితం లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 100-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశముంద‌ని లగడపాటి తెలిపారు. ఈ లెక్కన చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు లగడపాటి సర్వే అంచనా వేసింది. లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీకే మొగ్గు ఉందని లగడపాటి సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది. మహిళా ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుచూపారని.. పురుష ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేశారని ఈ సర్వేలో తేలింది.