Monday, December 09, 2019
Follow Us on :

ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు.. 17 లక్షలా 60 వేలు పాడింది ఎవరంటే..!

By BhaaratToday | Published On Sep 12th, 2019

ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 17 లక్షలా 60 వేలు పలికింది బాలాపూర్ లడ్డు. కొలను రామి రెడ్డి మరోసారి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. 2018లో లడ్డూను రూ. 16.50 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే బాలాపూర్ వ్యాపారి దక్కించుకోగా.. ఈ ఏడాది 17 లక్షలా 60 వేలకు కొలను రామి రెడ్డి దక్కించుకున్నారు. 

1994లో తొలిసారిగా బాలాపూర్ లడ్డూను వేలం వేశారు. ఆ సంవత్సరం కోలన్ మోహన్ రెడ్డి రూ. 450కి లడ్డూను సొంతం చేసుకున్నారు. 1995లోనూ ఆయనే రూ. 4,500కు పాడారు. 1996లో ఆయన బంధువు కోలన్ కృష్ణారెడ్డి రూ. 18,000కు లడ్డూను అందుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరం కూడా ఆయనే రూ. 28 వేలకు లడ్డూను పాడారు. 1998లో తిరిగి కొలన్ మోహన్ రెడ్డి రూ. 51 వేలకు లడ్డూను పాడి దక్కించుకున్నారు. లడ్డూను కొన్న వాళ్లకు బాగా కలిసొస్తుందని తెలియడంతో  1999లో లడ్డూ కోసం పోటీ పెరిగింది. ఆ ఏడాది కళ్లెం ప్రతాపరెడ్డి రూ. 65 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ప్రతాప్ రెడ్డికి మంచి జరిగిందని ప్రచారం జరగడంతో, 2000 సంవత్సరంలో ప్రతాప్ రెడ్డి బంధువు కళ్లెం అంజిరెడ్డి పోటీకి దిగి రూ. 66 వేలకు  లడ్డూను సొంతం చేసుకున్నారు. 2001 సంవత్సరంలో జీ రఘునాధాచారి రూ. 85 వేలకు లడ్డూను వేలం పాడగా, 2002లో కందాడ మాధవరెడ్డి రూ. 1,05,000 వేలకు పాటను పెంచారు. 2003లో చిరిగింత బాల్ రెడ్డి రూ. 1,55,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2004లో కోలన్ మోహన్ రెడ్డి రూ. 2,01,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2005లో ఇబ్రం శేఖర్ రూ. 2.08 లక్షలకు, 2006లో చిరిగింత తిరుపతి రెడ్డి రూ. 3 లక్షలకు, 2007లో జీ రఘునాధాచారి రూ. 4.15 లక్షలకు, 2007లో కోలన్ మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు, 2009లో సరిత రూ. 5.10 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

అప్పటివరకూ లడ్డూ వేలం పాటలో బాలాపూర్ గ్రామవాసులే పాల్గొంటూ వస్తుండగా, ఈ లడ్డూకు డిమాండ్ పెరగడంతో, బయటివారిని కూడా పాట పాడేందుకు అనుమతించారు. దీంతో 2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ. 5.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకోగా, 2011లో కోలన్ బ్రదర్స్ రూ. 5.45 లక్షలకు, 2012లో పన్నాల గోవర్దన్ రెడ్డి రూ. 7.50 లక్షలకు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50 లక్షలకు, 2015లో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలకు, 2017లో నాగమ్ తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను అందుకున్నారు.