Saturday, October 19, 2019
Follow Us on :

గేర్ లివర్ లేకుండానే డ్రైవింగ్..! ప్రమాదకరంగా వెదురుబొంగు..!!

By BhaaratToday | Published On Feb 7th, 2019

స్కూల్‌ బస్సు గేర్ లివర్‌గా వెదురుబొంగును ఉపయోగిస్తున్న ఓ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు నడుపుతున్న బస్సు అదుపుతప్పి ఓ కారును ఢీకొట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఖార్ ప్రాంతంలోని పొద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజ్‌ కుమార్ (22) బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం విద్యార్ధులను తీసుకుని పాఠశాలకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి ఓ వ్యాపారవేత్తకు చెందిన ఖరీదైన కారును ఢీకొట్టింది. సదరు వ్యాపారవేత్త బస్సు డ్రైవర్‌ కుమార్‌తో తీవ్ర వాగ్యుద్ధానికి దిగడంతో... ఇద్దరు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆరాతీశారు. అయితే స్టీరింగ్ వీల్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు కుమార్ చెప్పాడు. తీరా బస్సులోకి వెళ్లి పరిశీలించిన పోలీసులు, కారు యజమాని... గేర్ లీవర్ స్థానంలో వెదురుబొంగు ఉండడం చూసి షాక్ అయ్యారు. గేర్ నాబ్ విరిగిపోయినా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కొద్ది రోజుల క్రితమే బస్సు గేర్ నాబ్ విరిగిపోయిందనీ... అప్పటి నుంచి వెదురుబొంగునే గేర్ లివర్‌గా ఉపయోగిస్తున్నానని కుమార్ పోలీసు విచారణలో పేర్కొన్నాడు.