Thursday, November 14, 2019
Follow Us on :

కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాంగ్లాదేశ్

By BhaaratToday | Published On Aug 21st, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసాక పాకిస్థాన్ చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. భారత్ ను చిక్కుల్లో పెట్టాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ వీలుపడలేదు..! భారత్ లో ఉగ్రమూకలతో దాడి చేయించాలని కూడా భావిస్తోంది.. ఆ కుటిల యత్నాలను భారత్ ధీటుగా అడ్డుకుంటోంది. ఇప్పటికే పలుదేశాల మద్దతు కోసం ప్రయత్నించిన పాక్ కు ఒక్క చైనా తప్ప మిగిలిన ఏ దేశం కూడా వత్తాసు పలకడం లేదు. ఇప్పుడు బాంగ్లాదేశ్ కూడా భారత్ కే తమ మద్దతు అని తేల్చి చెప్పింది.  
'ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. ఉపఖండంలో శాంతి, స్థిరత్వం ఉండాలనేదే బాంగ్లాదేశ్ సిద్ధాంతం. అంతేకాదు, ప్రతి దేశం అభివృద్ధి చెందాలనేదే మా ప్రధాన లక్ష్యం' అని ఓ ప్రకటనలో బాంగ్లాదేశ్ తెలిపింది.

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై ఐక్య రాజ్య సమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. పాకిస్థాన్ ను ఎక్కడైనా సరే, ఏ వేదిక మీద అయినా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. ఇండియాకు కూడా వివిధ రకాల మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు.