Sunday, August 25, 2019
Follow Us on :

రూ.3 వ‌సూలు చేసినందుకు రూ.9 వేల జ‌రిమానా

By BhaaratToday | Published On Apr 15th, 2019

క్యారీ బ్యాగ్‌లకు అదనంగా డబ్బు వసూలు చేయడంతోపాటు ఆ క్యారీ బ్యాగ్‌ల‌పై తమ సంస్థ పేర్లు ముద్రించుకొనే దుకాణదారులకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది. సాధారణంగా చాలా దుకాణాల్లో చేతి సంచులకు డబ్బు వసూలు చేయరు. కొన్ని షాపింగ్‌ మాల్స్‌, పెద్ద పెద్ద దుకాణాల్లో మాత్రం బిల్లు వేసే సమయంలో ‘క్యారీ బ్యాగ్‌ కావాలా?’ అని అడుగుతారు. కావాలంటే రూ.3, 5, 10.. ఇలా షాపు స్థాయిని బట్టి బిల్లులో క్యారీ బ్యాగ్‌ మొత్తం ‘క్యారీ’ అయిపోతుంది. ఈ విషయంలో చాలా మంది వినియోగదారులు ‘డబ్బు వసూలు చేసేటప్పుడు మీ దుకాణం పేరుతో ఉన్న బ్యాగులెందుకు ఇస్తున్నారు? మీకు మేమెందుకు ప్రచారం చేయాలి?’ అని దుకాణదారులతో గొడవ పడుతుంటారు కూడా! అచ్చంగా ఇలాంటి ఘటనే చండీగఢ్‌లో చోటు చేసుకుంది. దినేష్‌ ప్రసాద్‌ ఫిబ్రవరి 5న స్థానికంగా ఉన్న బాటా దుకాణంలో చెప్పులు కొనుగోలు చేశాడు. బిల్లులో చెప్పుల ధరతో పాటు క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేశారు. దీంతోపాటు ఆ బ్యాగ్‌పై బాటా ఉత్పత్తులను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఇదేంటని దినేశ్ అడ‌గ‌గా, దుకాణదారులు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో దినేష్‌ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేసినా ఇబ్బంది లేదు కానీ, దానిపై ఆ సంస్థ ఉత్పత్తులను ముద్రించారని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ఆయన ఫిర్యాదు పేర్కొన్నాడు. ఇంకేముంది కేసును విచారించిన ఫోరం.. దినేష్‌కు రూ.9 వేల పరిహారంతో పాటు క్యారీ బ్యాగ్‌ చార్జీ కూడా వెనక్కి ఇచ్చేయాలని బాటా దుకాణదారులను ఆదేశించింది.