Monday, August 19, 2019
Follow Us on :

వరల్డ్ కప్ రాకుండా చేసినోడికి అత్యున్నత పురస్కారం..!

By BhaaratToday | Published On Jul 19th, 2019

2019 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా న్యూజిలాండ్ కు నిరాశనే ఎదురయ్యింది. బెన్ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వరుసగా రెండో సారి ఫైనల్ కు చేరినా కివీస్ కు వరల్డ్ కప్ దక్కకుండా చేశాడు. ఫైనల్స్ లో 84 పరుగులు చేసిన స్టోక్స్... ప్రపంచకప్ లో 465 పరుగులు సాధించాడు. అయితే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కు ఆడుతున్నా.. అతడి స్వస్థలం మాత్రం న్యూజిలాండ్ అన్నది క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టులో చాలా మంది వేరే దేశాలకు చెందిన వారు ఉన్నారనుకోండి. అయితే  బెన్‌స్టోక్స్‌ న్యూజిలాండర్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు నామినేట్‌ అయ్యాడు. స్టోక్స్‌తో పాటు కివీస్‌  కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ కూడా నామినేట్‌ అయ్యాడు. 

ఈ అవార్డుకు నామినేట్‌ చేసిన చీఫ్‌ జడ్జి కామెరున్‌ బెన్నెట్‌ స్పందించాడు. స్టోక్స్‌ న్యూజిలాండ్‌  తరపున ఆడకపోయినా అతని తల్లిదండ్రులు ఇక్కడి వారవడంతో ఈ అవార్డ్‌కు నామినేట్‌ చేశామని తెలిపాడు. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం మొత్తం ప‌ది మందిని ఫైన‌ల్ లిస్టుకు నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు. ఆ అవార్డును 2020 ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేస్తారు. స్టోక్స్‌ 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. స్టోక్స్‌ తండ్రి గెరార్డ్‌ న్యూజిలాండ్‌ తరపున రగ్బీ లీగ్‌ ఆడాడు. ఇంగ్లండ్‌లో రగ్బీ కోచ్‌గా పనిచేసిన గెరార్డ్‌ కుటుంబంతో సహా తిరిగి న్యూజిలాండ్ కు తిరిగివచ్చినా, స్టోక్స్‌ మాత్రం తన క్రికెట్ కెరీర్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉండిపోయాడు. అనుకున్నట్లుగానే ఇంగ్లాండ్ కు వరల్డ్ కప్ అందించాడు.