Thursday, October 17, 2019
Follow Us on :

పర్యావరణం- భారతీయ ఆవు - 2

By BhaaratToday | Published On May 29th, 2019

ఆయుర్వేద వైద్యశాస్ర్తంలో పంచకర్మలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహా వ్యాధులకు ముందు పంచకర్మల ద్వారా వ్యాధిని కలిగించిన దోషములను శోధించేవారు. ఆ తర్వాతే వ్యాధి నివారించు చికిత్సను ప్రారంభించేవారు. 

పంచకర్మలనగా వమనము, విరేచనము, వస్తి, నస్యకర్మ..శిరోవిరేచనము, రక్తమోక్షణము...శరీరంలో ఏర్పడిన చెడు రక్తమును వెలికి తీయుట అనేవి పంచకర్మలుగా పిలుస్తారు. పంచకర్మలు చేయటు అత్యంత వ్యయప్రయాసలతో కూడిన పని. సంపన్నులు మాత్రమే చేయించుకోగలిగిన వైద్యము. అంతేగాక  స్వర్ణము రజతము, ముత్యము, నవరత్నములు మొదలైన వాటి భస్మములు కలిసియున్న ఔషధాలను కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తే సామన్యమానవుడు ఈ వైద్యం చేయించుకోలేడు అన్న భావన కలుగుతుంది. అయితే ఇవాళ ఆధునిక వైద్యము కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదే..! ముఖ్యంగా పెద్ద వ్యాధులకు  పెద్ద పెద్ద హాస్పిటల్స్ సామాన్యుడు అందుకోలేనంత దూరంలో ఉన్నాయి. సామాన్యుల జీవిత సంపాదను సైతం అమాతం కరిగించే ఆసుపత్రులు నేడు దేశంలో చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు... సంపన్నుడు అనే తేడా లేకుండా అందరిని సమదృష్టితో చూసి ఆదుకొనే అమ్మ రూపంలో గోమాత మన ముందు ఉంది.  పంచకర్మలతో చేయు చికిత్సలు పంచగవ్యములతో సైతం సునాయాసంగా చేయవచ్చును. ఇది ఆయుదర్వేద వైద్యుల అభిప్రాయం. పంచకర్మలు, చేయుట వలన లభించు ప్రయోజనముతో సమానంగా పంచగవ్యములు ఉపయోగపడతాయి. అంతగా వ్యయప్రయాసలు అవసరం లేదు. స్వర్ణము మొదలైన ఔషదముల విషయానికి వస్తే గోవులకు మాత్రమే స్వంతమైన సూర్యకేతు నాడి వలన ప్రసవించు స్వర్ణవర్ణము గల పదార్ధము...స్వర్ణ ప్రయోజనాలు సాధించి పెడుతుంది. అంతేకాదు విషమును సైతం కొట్టిపారవేయగలిగినవి.  శరీరమంతట చర్మము మొదలు అస్థుల వరకు వ్యాపించియున్న దోషాలు, పంచగవ్యాలు అగ్ని ఇంధనమును దహించినట్లుగా ఈ దోషాలను దహించి వేస్తాయి.  పంచగవ్యాలతో శరీరంలో ఎట్టి ప్రతిక్రియ..రియాక్షన్ ఉండుదు. ఇవే స్వయంగా విషాన్ని హరించివేస్తాయి. వీటిపై టాక్సిక్ ఎఫెక్ట్...విష ప్రభావం ఉండదు. పంచగవ్యాలకు గొప్ప నిరోధక శక్తి ఉంటుంది.  అందుకే వీటిని ఉపయోగించినది మొదలు శరీరమందు ఉన్న వ్యాధుల నివారణతోపాటు ఇతర రోగకారకాలను సైతం తొలగిస్తాయి. అంతేకాదు శరీర పోషణ, బలం,ఆయుర్యృద్ధి, మేధస్సు జ్ఞాపకశక్తి, సాధు స్వభావం కలిగించే గొప్ప ప్రభావం పంచగవ్యాలకు కలదు.  ప్రస్తుతం మన దేశంలో దాదాపు వందకు పైగా గోశాలల్లో పంచగవ్య ఔషధాల తయారీ జరుగుతోంది. అనేకచోట్ల పంచగవ్యాలపైన ఆధునిక వైద్యశాస్ర్తానుసారం మరియు గో ఆధారిత వ్యవసాయమునకు సంబంధించిన ఆధునిక అధ్యయనము, పరిశోధనలు జరుగుచున్నవి. నాగపూర్ లో గోవిజ్ఞాన్ ఆనుసంధాన్ కేంద్రం వారు గోమూత్రానికి రెండు పేటెంట్లను సాధించారు కూడా. US.PATENT NO.6410059\6896907 - దీనిలో సూక్ష్మక్రిమి సంహారము క్యాన్సరు వ్యాధి నిరోధకము, వ్యాధి నిరోధకము అనే గుణములు పంచగవ్య ఔషధాలకు కలవని ప్రమాణపత్రము ఇవ్వబడింది.  మన దేశీయ ఆవులకు సరియైన మేత, పాలను వృద్ధి చేసే విధానమను శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో...అవి 25 నుంచి 50 లీటర్ల వరకు ప్రతి రోజు పాలు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా నేడు మన దేశ రైతులు తెలుసుకోవాల్సింది... జెర్సీ ఆవుల పోషణ ఎంతో ఖర్చుతో కూడిన పని. వ్యసాయానికి వాటి దూడలు పనికిరావు. వీటి వైద్యం కూడా రాజవైద్యమే.! అయినా వాటి పట్ల మన వాళ్లకు...ముఖ్యంగా మన పాలకులకు ఎక్కడలేని వ్యామోహం పట్టుకుంది. అచ్చమైన బంగారాన్ని వదిలేసి విదేశీ ఇనుపముక్కలపై మోజు పడడం అంటే ఇదే..! అందుకే అన్నారు మన పెద్దలు గంగిగోవు పాలు గరిటైడనను చాలు...! ఈ వాస్తావాన్ని దేశ ప్రజలు...పాలకులు...అన్నదాతలు ఇప్పటికైనా గుర్తించాలి. పశుగ్రాసం కరువు వచ్చిందని కబేళాలకు అమ్మకుండా....వాటి కోసం కాలమయ్యే వరకు సామూహిక గోశాలలు ఏర్పాటు చేసి పోషించాలి. 

-వనకళ్ల బీరప్ప కురుమ