Thursday, September 19, 2019
Follow Us on :

పరశురాముడి చరిత్ర - 3

By BhaaratToday | Published On May 10th, 2019

మన ప్రాచీన గ్రంథాలు....పరశురాముడిని భగవాన్ విష్ణువు యొక్క ఆరవ అవతారంగా కీర్తించాయి. పరశురాముడు శమంతపంచకం అనే ఐదు సరస్సులను నిర్మించాడని చెబుతారు. అలాగే అశ్వమేధం, వాజపేయ లాంటి యజ్ఞాలు కూడా నిర్వహించాడని అంటారు. 

పరశురామునికి సంబంధించి రామాయణం, మహాభారతంలోనూ కథలున్నాయి. విష్ణుమూర్తి దశరధుడి కుమారుడు రామునిగాను, లక్ష్మిమాత జనకుడి కూతురు సీతగాను భూమిపై అవతారమెత్తారు. సీత స్వయంవరం లో రాముడు శివధనస్సును విరిచి ఆమెను వివాహమాడాడు. శ్రీరాముడు శివధనస్సును విరిచేశాడని విన్న పరశురాముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. పరశురాముడు.. ధనుర్విద్యను పరమశివుడి నుంచి నేర్చుకున్నాడు. ఒక రాజకుమారుడు ధనస్సు విరిచాడనే విషయం అతనికి కోపాన్ని రగిల్చింది. జనకుడి సభకు వచ్చి... శ్రీరాముడిని యుద్ధానికి ఆహ్వానించాడు.  ఆ తర్వాత తామిద్దరం ఒకే శక్తిఅవతారాలమనే నిజం తెలుసుకున్నాడు.  మహాభారంతోని ఆధారాలను బట్టి చూస్తే...అంబ వృత్తాంతం తెలుసుకుని పరశురాముడు ఆమెను తీసుకుని భీష్ముడి దగ్గరకు వస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భీష్ముడిని కోరుతాడు. అయితే తాను చేసిన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని.. ఆమెను వివాహం చేసుకోనని చెబుతాడు. దాంతో పరశురాముడు, భీష్ముల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చాలా రోజులపాటు జరిగిందని చెబుతారు. ఇద్దరు వీరులే కాబట్టి ఎవరూ ఓటమి పొందలేదు. చివరికి ఇద్దరు కూడా యుద్ధం చాలించాల్సివచ్చింది. అలాగే పరశురాముడు...ధనుర్విద్యను శివుడి వద్ద నేర్చుకొని అందులో నిపుణత సాధించాడు. ఇది చూసిన పరమశివుడు ఆనందపడి, గండ్రగొడ్డలిని ఆయనకు ప్రసాదించాడు. అటు మాత పార్వతీదేవి కూడా ఆయనకు అనేక ఆయుధాలను ఇచ్చి ఆశీర్వదించింది. అనేకమంది పరశురాముడి వద్దకు వచ్చి విలువిద్యలో శిక్షణ పొందేవారు. అయితే పరశురాముడు రాజవంశీయులకు మాత్రం విలువిద్య నేర్పేవాడు కాదు. అంహకారం ప్రదర్శించే రాజుల చేతిలో ఆయుధం ఉంటే అది ప్రజలందరికీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని భావించేవాడు. కర్ణుడు కూడా పరశురాముడి వద్దనే విలువిద్యను అభ్యసించాడు. అయితే ఒక రోజు పరశురాముడు తన తలను కర్ణుడి తోడపై ఉంచి అలాగే నిద్రపోయాడు. అయితే రాబోయే రోజుల్లో కర్ణుడు...అర్జునుడికి పోటీ అవుతాడని భావించిన ఇంద్రుడు... ఒక కందిరీగలా మారి...కర్ణుడి తోడ భాగాన్ని కుట్టడం మొదలు పెట్టాడు. ఎవరైనా ఆ బాధను ఎక్కువ సేపు ఓర్చుకోలేరు...కానీ కర్ణుడు మాత్రం తన గురువుకు నిద్రాభంగమవుతుందని భావించి కదలకుండా అలాగే బాధను భరిస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి తోడ నుంచి రక్తం ధారగా కారుతూ నేలంతా తడిసిపోయింది. పరశురాముడికి నిద్రభంగమైంది. కర్ణుడు సామన్యుడు కాదని...క్షత్రియుడని గ్రహించాడు. క్షత్రియులైతే ఈ బాధను భరించగలరని...., తన నుంచి పొందిన విలువిద్య....కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అందుబాటులో ఉండదు గాక అని కర్ణుడిని శపించాడు.  పరశురాముడు అనేక సద్గుణాలతో భాసిల్లాడు. తండ్రి మాటల పట్ల ఎంతో భక్తిని కలిగి ఉండేవాడు. అదే సమయంలో తల్లిపైనా అమితగౌరవం భక్తి ఆయనకు ఉండేవి. 21 సార్లు భూమండలం ప్రదక్షిణ గావించడం వెనుక ఆయన ధృడదీక్ష, పట్టుదల, సంకల్ప బలం మనకు కనిపిస్తాయి. అదే సమయంలో సమాజ హితాన్ని కోరుకునే వారి రాజులకే తిరిగి భూమినంతటిని దానమివ్వడం ద్వారా తన ఔదార్యాన్ని, స్వచ్ఛ హృదయాన్ని చాటాడు. 

పరశురాముడు....తాను సంహరించిన రాజుల రక్తంతో ఐదు సరస్సులను నిర్మించాడని చెబుతారు. ఈ సరస్సులు "శమంతపంచకం" అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. తాను యజ్ఞాలు నిర్వహించడానికి సహకరించిన వారికి భూమినంతటిని దానం చేశాడు. చివరికి తాను నివసించడానికి అవసరమైన భూమి కోసం సముద్రుడిని అర్థించవలసి వచ్చింది. చివరిగా సరస్వతీ నదిలో స్నానం చేసి...మహేంద్రగిరి పర్వతాలపై ఆశ్రమం నిర్మించుకున్నాడని... ఇక్కడే తపస్సు చేయడం ప్రారంభించాడని అంటారు. ఇప్పటికి కూడా పరశురాముడు ఇక్కడే చిరంజీవిగా జీవిస్తున్నాడని భక్తుల నమ్మకం. 
'అశ్వత్థామో బలిర్వ్యాసో,
హనుమానశ్చ విభిషణ,
కృపా పరశురామశ్చ, 
సప్తైతే చిరంజీవిన'..! 

- వనకళ్ల బీరప్ప కురుమ