Thursday, September 19, 2019
Follow Us on :

పరశురాముడి చరిత్ర - 2

By BhaaratToday | Published On May 9th, 2019

ఒకటి కాదు రెండు కాదు అనేక సంఘటనలు...! అధర్మపరులైన రాజులను శిక్షించేందుకు....ఈ సంఘటనలే ప్రేరేపించాయి. 

పరశురాముడి తల్లి రేణుక. ఆమె ప్రసేనజిత్తు అనే రాజుకు దత్తపుత్రిక. ఆమె జమదగ్నిని పెళ్ళాడింది. ఆమెకు జన్మించినవారిలో మొదటి వాడు పరశురాముడు. ఆయన తర్వాత రుమన్వంత, సుశేన, వసు, విశ్వవసు అనే నలుగురు జన్మించారు.  ఆ రోజుల్లో... చంద్రవంశానికి చెందిన కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. అతనికి కుమారుడే కార్తవీర్యార్జునుడు. అతడు గొప్పవీరుడు. దత్తాత్రేయుని పూజించి తనను ఎవరూ ఓడించకుండా ఉండేట్లు వరం పొందాడు. ఇతడు యుద్ధభూమిలో తన వేయి చేతుల బలంతో పోరాడేవాడు. రావణుని కూడా ఓడించాడు. మహిష్మతిని రాజధానిగా చేసుకొని అట్టహాసంగా రాజ్యమేలేవాడు. ఒక రోజుకు వేటకు వచ్చిన కార్తవీర్యార్జునుడు...తన దప్పిక తీర్చుకునేందుకు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వయంగా రాజు రావడంతో ...తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరాడు. జమదగ్ని కూడా రాజుకు ఏ లోటు రాకుండా చూశాడు.  కామధేనువు సహాయంతో జమదగ్ని మహర్షి తమకు సకల సౌకర్యాలు కల్పించాడని తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు...ఆ గోవును తనకు ఇవ్వమని...ప్రతిగా వేలాది గోవులను ఇస్తానని తెలిపాడు. అయితే జమదగ్ని మాత్రం తన దగ్గర ఉన్న ఈ పవిత్ర గోవును ఇతరులకు అప్పగించలేనని తెలిపాడు. దాంతో ఆగ్రహించిన మహారాజు... బలవంతంగా గోవును తన రాజధాని మహిష్మతికి తీసుకురండని సైనికులను ఆదేశించాడు. దాంతో జమదగ్ని కృంగిపోయాడు. రాజుగా వచ్చిన అతిథికి అత్యున్నత సత్కారాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపే పద్ధతి ఇదేనా..! అయితే రాజు వచ్చిన సమయంలో పరశురాముడు కట్టెల కోసం అడవికి వెళ్లాడు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న పరశురాముడు కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునిడి దగ్గరకు వెళ్లాడు. అయితే మునిపుత్రులంటే మాకు లెక్కేమిటని రాజు భావించాడు. పరశురాముడి మీదకు తన సైన్యాన్ని పంపించాడు. వచ్చిన వారందరిని పరశురాముడు దయా దాక్షిణ్యం లేకుండా నరికిపారేశాడు. చివరికి కార్తవీర్యార్జునుడే వచ్చాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధమే జరిగింది. ఈ పోరులో పరశురాముడు కార్తవీర్యుని వేయి చేతుల్ని ఖండించి...చిరికి అతన్ని చంపివేశాడు. ఇది చూసిన మిగిలిన సైనికులు...కార్తవీర్యుని పుత్రులు భయంతో కామధేనువును వదిలి పారిపోయారు. పరశురాముడు కామధేనువును ఆశ్రమానికి తీసుకువచ్చి తండ్రికి అప్పగించాడు.  అలాగే పరశురాముడి అవతారానికి సంబంధించి మరోక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీమహావిష్ణువు ప్రధాన ఆయుధం సుదర్శన చక్రం..! దాన్ని ఎదిరించి..దాని నుంచి ఎవరు తప్పించుకున్నవారు ఎవరూ లేరు. నా సహకారంతోనే విష్ణువు రాక్షసులను చంపగలుగుతున్నాడు. నా తోడ్పాటు లేకుండా ఇది సాధ్యం కాదనే అహంకారానికి లోనయ్యాడు చక్రాధిపతి అయిన సుదర్శనుడు. ఇది గమనించిన భగవాన్ విష్ణువు... ప్రియమైన సుదర్శనా రాక్షసులను సంహరించటంలో నీ సహకారం తీసుకోవడం నిజమే. నువ్వు భూమిపై వేయి చేతులు కలిగిన వీరుడిగా జన్మించు. నేను ఒక రుషి కుమారుడిగా జన్మిస్తాను. అక్కడ మన బలాబలాలు చూసుకుందాం అన్నాడు. ఈ సుదర్శన చక్రమే...వైకుంఠాన్ని వీడి భూమిపైకి వచ్చిందని చెబుతారు. ఇతడే జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడిని యుద్ధంలో ఎదుర్కొని మరణించాడని అంటారు. ఒకసారి... నీటి కోసం గంగానదికి వెళ్లిన రేణుక అమ్మవారు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన జమదగ్ని...తన కుమారులను పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించాడు. స్వంత తల్లినే తామెట్ల చంపగలుగుతాం అంటూ...కదలక మెదలక నిల్చున్నారు. ఇది జమదగ్నిలో మరింత ఆవేశం కల్గించింది. కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన పరశురాముడిని జమదగ్ని పిలిచాడు. తల్లిని సోదరులను చంపమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా... తన గండ్రగొడ్డలినెత్తి తల్లిని, సోదరులను నరికివేశాడు. తండ్రి మాటపై పరశురాముడు చూపిన గౌరవం జమదగ్నిని ముగ్ధుణ్ణి చేసింది. నువ్వు  ఏదైనా వరం కోరుకో...దాన్ని తీరుస్తానని జమదగ్ని చెప్పాడంతో....పరశురాముడు నా తల్లిని, సోదరులను మళ్లీ బ్రతికించండి..దయచేసి వారి తప్పిదాలను క్షమించండి అని వేడుకున్నాడు. కుమారుడి మాతృభక్తికి, సోదర ప్రేమకు సంతోషించిన మహర్షి వారిని మళ్లీ బ్రతికించాడు.  అదే సమయంలో...కార్తవీర్యార్జునుడి పుత్రులు ప్రతీకారంతో రగిలిపోయారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయాన్ని చూసి....జమదగ్ని ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. ధ్యానంలో ఉన్న జమదగ్ని తలను ఖండించారు. ఆయన తలను మహిష్మతికి తీసుకుపోయారు. ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. ఆశ్రమంలోనే ఉన్న రేణుకా మాత రక్షణ కోసం...ఓ రామా. ఓ రామా అంటూ బిగ్గరగా అరించింది.  తన తల్లి ఆర్తనాదం విన్న పరశురాముడు ఆశ్రమానికి వచ్చిన రక్తం మడుగులో నిర్జీవంగా పడి వున్న తన తండ్రి దేహాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు.  ఎర్రబారిన ముఖంతో వెంటనే తన గొడ్డలిని భుజాన వేసుకున్నాడు. మహిష్మతి రాజధానికి వెళ్లాడు. సింహద్వారం వద్ద రక్షక భటులను సంహరించాడు. ఆతర్వాత రాజభనంలోకి దెబ్బతిన్న సింహంలాగా ప్రవేశించాడు. తనకి వచ్చిన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. రాజకుమారులందరిని కత్తికో కండగా నరికివేశాడు. తన తండ్రి శిరస్సును తీసుకుని ఆశ్రమానికి వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు.  ఇంతా జరిగిన పరశురాముడి మనస్సు శాంతించలేదు. దుఃఖంతో బాధపడే తల్లిని చూసినప్పుడల్లా అతడు ఎంతగానో బాధపడేవాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. అధర్మపరులైన రాజవంశాలనన్నిటిని నాశనం చేయాలని...అంత వరకు ప్రజలకు శాంతిలేదని భావించాడు. 21 సార్లు భూప్రదక్షిణలు చేసి అధర్మపరులైన అనేక మంది రాజులను సంహరించాడు.

-వనకళ్ల బీరప్ప కురుమ