Tuesday, September 24, 2019
Follow Us on :

ఆర్యులు-ద్రావిడ జాతులనేది ఒక కట్టు కథ - 4

By BhaaratToday | Published On Apr 4th, 2019

ఆర్యులెవరు? ద్రావిడులెవరు?

కల్పిత కట్టుకథ అయిన ఆర్యుల దండయాత్ర కథను...ఇప్పటికీ మనదేశంలోని పాఠశాల్లో బోధిస్తూనే ఉన్నారే. స్వామి వివేకానందుడు, మహర్షి అరవిందుడు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఈ కట్టుకథను బ్రిటీష్ వారి పాలనకాలంలోనే ఆధారాలతోసహా ఖండించారు. ఆర్యులు భారత్ కు వలస వచ్చినట్లుగా వేదాలలో ఎక్కడా చెప్పబడలేదు.  వేద పరిభాషలో ఆర్యుడు అంటే అదో గౌరవ వాచకం. గౌరవనీయుడని శబ్దకోశాలు అర్థం చెబుతున్నాయి. అలాగే వేదాలలో ఎక్కడా కూడా...ఆర్యులు అంటే  ఒక జాతి అని...అది కూడా తెల్లగా ఉండే జాతీయులు అని ఎక్కడ చెప్పబడలేదు. స్వామి వివేకానందుడు కూడా ఆర్యుల కట్టుకథను ఆనాడే ఖండించాడు. 

ఆర్యులు...ద్రావిడులు భిన్నజాతుల వారు కాదని...ఞక సనాతన శాశ్వతజాతిలో భాగమని అన్నారు. ఆర్యులు భారత దేశానికి విదేశాల నుంచి వచ్చారని.., ఏ వేదంలో..., ఏ సూక్తంలో మీరు చదివారని ప్రశ్నించాడు. భారత దేశంలోని ఇక్కడి స్థానిక ప్రచజలను వారు వధించినట్లు మీకు లభించిన ఆధారాలు ఏమిటి? ఇలాంటి మతిమాలిన మాటల వల్ల మీకు లభించే ప్రయోజనం ఏమిటని పాశ్చాత్య చరిత్రకారులను ఆయన నిలదీశారు. అలాగే ఐరోపా వాసులు అమెరికాలో, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజీలాండ్ , ఫసిఫిక్ ద్వీపాలలో యూరోప్ దేశాలు చేస్తున్న హత్యాకాండలను ప్రశ్నించాడు. ఆయా దేశాలలో ఆనాది కాలం నుంచి నివసిస్తూ వస్తున్న ప్రాచీన జాతులను యూరోపియన్ సామ్రాజ్యవాదులు నిర్మూలించారు. ఆయా ప్రజలను సామూహికంగా హత్యలు చేశారు. జంతువులను వేటాడినట్టుగా చంపచేశారు. మీకు చంపడానికి సాధ్యంకాని జాతులు...మాత్రమే ఈ ధరాతలంలో బతికి బట్టకడుతున్నవని స్వామీజీ నిలదీశారు. 

1946లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన WHO WERE THE SUDRAS అనే గ్రంథంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అధ్యాయమే రచించారు.ఆర్యులు బయటి నుంచి దేశాన్ని ఆక్రమించినట్లు నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవీ వేదాలలో లేవని అన్నారు. ఆర్యజాతి దాసులను, దస్యులను జయించినట్లుగా కూడా వేదాలలో చెప్పబడలేదని తెలిపారు. దాసులు, దస్యులు అన్న వారికంటే ఆర్యుల రంగు విభిన్నమైనదన్న వాదాన్ని సమర్థించే వేద వాక్యాలు  లేవని అన్నారు. దాస్యుడు అంటే నడవడిక లేనివాడనే అర్థం. వ్యసనాలకు లోనైన వాడు దాస్యుడు అనే అర్థాలు ఉన్నాయని శబ్దాకోశాలు చెబుతున్నాయి. 

ఇక ద్రవిడ పదం విషయానికి వస్తే... జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అద్వైత సంప్రదాయాన్ని ప్రతిపాదించడానికి దేశమంతా సంచరిస్తున్న సమయంలో మండన మిశ్రులవారిని కలిసినప్పుడు... మీరు ఎక్కడి నుంచి వచ్చారు..? అని శంకరాచార్యులవారిని అడిగితే... నేను ద్రవిడ నుంచి వచ్చాని అని చెప్పారు. ద్ర అంటే మూడు విడ అంటే సముద్రం..! మూడు సముద్రాలు కలిసియున్న  ప్రదేశం నుంచి వచ్చానని వారు తెలిపారు. ఆర్య శబ్దం జాతివాచకము కాదని...అదో వ్యక్తి  విశేషానికి సంబంధించిన గుణవాచకమని మన గ్రంథాలు చెబుతున్నాయి. రామాయణంలో ఆర్య శబ్దం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. రావణ వధ అనంతరం హన్మంతుడు...సీతమ్మవారి వద్దకు వెళ్లినప్పుడు..అక్కడి రాక్షస స్ర్తీలను చంపుతానన్నప్పుడు....సీతమ్మ తల్లి...

పాపానాంవా  శుభానాంవా వధారహానాం ప్లవంగమా! 
కార్యం కరుణం ఆర్యేన న కశ్చిన్ నపరాధ్యతి!!  

నీవు ఆర్యుడవు కావా? ఆ రాక్షస స్త్రీలందరినీ హింసిస్తానంటావు? అని అంటోంది..!  అంటే హన్మంతుడు సింధులోయ నుంచి వచ్చాడా? లేక దక్షిణపథంలోనే ఉన్నాడు. హనుమంతుడిని కూడా సీతమ్మ తల్లి ఆర్యుడని  సంబోధించిన విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్యడు అంటే మంచి నడవడి కలిగిన గుణవంతుడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.

మహాభారతం మనకు ఎవరు ఆర్యులో...ఎవరు అనార్యోలో చెబుతుంది. ఇంకా భగవద్గీతలో కూడా మనకు ఆర్య శబ్దం మనకు కనిపిస్తుంది. కురుక్షేత్ర సమరంలో సుతులను, బంధుమిత్రులను పోగొట్టుకొని ధృతరాష్ట్రుడు విలపిస్తున్నాడు. సంజయుడు అతణ్ని శాంతింపజేసేందుకు యత్నిస్తూ కొన్ని మాటలు చెప్పాడు. ఆర్యులైనవారు తగిన సమయంలో యోగ్యమైన కార్యాన్ని ఆచరిస్తారు. అలాకాకుండా అనార్యులు మొండితనంతో ఆ పనిని లాగిపట్టి, అది జారిపోయినప్పుడు ఆపద కలిగిందని దుఃఖిస్తారని వివరిస్తాడు.

చేసే ఏ పనైనా కర్తవ్య నిష్ఠతో చేయాలి. చేసే పనిపై దీక్ష ఉండాలి. దేశ కాల దైవాల అనుకూలత లభించాలి. అది ఉందో లేదో వివేకంతో నిర్ణయించుకోవాలి. ఆ విధంగా యోగ్యమైన పనులు ఆచరించేవారు ఆర్యులు. మంచి పనులు చేయాలనే వివేకంతో కూడిన విశేషమైన బుద్ధిబలం, ఆత్మబలం కలిగి కార్యాచరణ చేపడతారు. సమాజ హితానికి, సర్వజన కల్యాణానికి దోహదంచేసే మార్గాన్ని ఆర్యులు ఆచరిస్తారు. మానవులందరికీ అన్ని పనులూ విహితమైనవి కావు గనుక తమకు తగినవాటినే నిర్వహిస్తారు. అటువంటి ఉన్నతమైన మనోధర్మం కలిగినవారే ఆర్యులని సంజయుడి భావన. ధర్మరాజులో ఈ ఆర్యలక్షణం ఉంది. అతడు యుద్ధాన్ని తొందరపాటుగా నిర్ణయించలేదు. మొండిగానూ నిర్ణయం తీసుకోలేదు. యుద్ధం జరగకుండా ఉండటానికి వీలైన ప్రయత్నాలన్నీ గొప్ప కార్యదీక్షతో చేశాడు. దైవమైన వాసుదేవుడి సహాయం తీసుకొన్నాడు. అతడి అనుగ్రహంతో, తన ధర్మబలంతో చివరికి విజయం సాధించాడు.

అనార్యుల స్వభావం దీనికి విరుద్ధంగా ఉంటుంది. వారు మాత్సర్యం, మూర్ఖత్వం వంటి లక్షణాలతో దేశ కాల దైవాలను పట్టించుకోకుండా కార్యసూత్రాన్ని తమవైపు పట్టుకులాగాలని యత్నిస్తారు. పని నెరవేరదు. పట్టు జారిపోతుంది. ఇక్కట్లపాలవుతారు. దుర్యోధనుడు తనదికాని రాజ్యం కోసం మాత్సర్య బుద్ధితో మొండిగా ప్రయత్నించాడు. సామరస్యపూర్వకంగా పాండవులు సాగించిన సంధి యత్నాలను తిప్పికొట్టాడు. గురువులను, రుషులను, చివరకు కృష్ణుణ్నీ నిరసించి, అవమానించాడు. తండ్రి ధృతరాష్ట్రుడు వివేకవంతమైన నిర్ణయం చేయకుండా కొడుకు మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని పరమస్వార్థబుద్ధితో వ్యవహరించాడు. సర్వనాశనం జరుగుతుందని ఎందరు హెచ్చరించినా తండ్రీకొడుకులు వినలేదు. ధృతరాష్ట్రుడికి అంతిమంగా శాశ్వత దుఃఖం మిగిలింది.

ఇంకా భగవద్గీతలోని రెండవ అధ్యయం సాంఖ్య యోగము 2వ శ్లోకములో...

కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్! 
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్ణున!!

ఈ అనార్జజుష్టమ్ ను గురుంచి శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వామివారు చెబుతూ ప్రపంచంలో రెండు తెగల వారు మాత్రమే ఉన్నారని ...వారు ఆర్యులు-ఆనార్యులు అన్నారు. సన్మార్గమును అవలంబించేవారు, పవిత్ర పనులు చేబట్టేవారు, జ్ఞానాన్ని ఆర్జించేవారు, ధైర్యము, ఉత్సాహము కలిగియుండేవారు ఆర్యులు..! దుర్మార్గమును అవలంభించేవారు, అంధకారమును వాంఛించేవారు.., అధైర్యము, నిరుత్సాహము, నిరంతర భీతి కలిగియుండేవారు అనార్యులు అని అన్నారు. ఈ విషయాలు అన్ని పరిశీలిస్తే...ఆర్య శబ్దము గౌరవ వాచకమే కాని జాతి ని సూచించేది కాదని అర్థమవుతుంది.  పాఠశాల విద్యనభ్యశిస్తున్న రోజులలో.., ఏదైనా కారణం చేత పాఠశాలలకు వెళ్లలేని స్థితిలో..., తరగతి ఉపాధ్యాయుడిని సంబోధిస్తూ వ్రాసిన సెలవు పత్రముపై ఆర్యా అనే సంబోధనతోనే.., రాస్తారు. ఇది కూడా గౌరవ సూచకమే కాని జాతి వాచకము కాదు! 

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం...1920లో జరిపిన హరప్పా, మొహంజదారో లో తవ్వకాలతో పలుచబడింది. ఈ నాగరికత ఆనవాళ్ళు దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. అటువంటిది గుర్రాలపై దండెత్తి వచ్చి ద్రావిడులను తరిమివేశారని చెప్పడం అబ్దమని చాలా మంది ఆరోజుల్లోనే అన్నారు. ఇక 1980లో అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా సరస్వతీ నది పరీవాహక ప్రాంతాన్ని చిత్రాల  ద్వారా గుర్తించారు. రుగ్వేదంలో చెప్పినట్టు, ఈ నదీ ప్రవాహం మార్గం సరిపోతూ ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో  సుప్రసిద్ధ ఇండాలజిస్ట్ డేవిడ్ ఫ్రాలే...తర్వాత కాలంలో వీరే వామదేవ శాస్త్రిగా మారారు. యూరోప్ తోపాటు పలు ప్రపంచదేశాలు అన్ని కూడా భారతీయ సంస్కృతితోనే ప్రభావితం అయ్యాయని..., నాగరీకులైన భారతీయులే... యూరోప్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటారనీ..ఆయన రుజువులతో సహా నిరూపించారు. ఈ వివరాలన్ని పరిశీలిస్తే ఆర్యుల దండయాత్ర అనేది ఒక బూటకమని...ఇది ఆంగ్లేయులు కల్పించిన కట్టుకథ అని మనకు అర్థం అవుతుంది.