Thursday, October 17, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 8

By BhaaratToday | Published On Apr 30th, 2019

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత...జన్మించిన కొత్తతరాలకు దేశ విభజన గురించి తేలిసింది చాలా తక్కువనే భావన ఉంది..! ఏ విధంగా మన భూభాగాలను మనం కోల్పోయామో...చెప్పేవారు కూడా తక్కువే! విభజన సమయంలో కోట్లాది మంది హిందూ సోదరులు ఎన్నెన్ని అగచాట్లకు గురైనారో...ఎన్నెన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారో ఈ ఇవాళ చాలా మందికి తెలియదు..! మన చరిత్ర పుస్తకాల్లో దేశ విభజన దురగాతాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. వీటిలో బెంగాల్ లో ముస్లింలీగ్ జరిపించిన హత్యాకాండకు సంబంధించిన వివరాలే ఉండవు..! కాళరాత్రి..! 

1947 మార్చి 22న  మౌంట్ బాటన్...ఒక నిర్దిష్ఠమైన లక్ష్యంతో భారత భూమిపై అడుగుపెట్టాడు. ఆయన భారత్ లో అడుగుపెట్టేనాటికి కాంగ్రెస్ లో నైతిక స్థైర్యం అట్టడుగుస్థాయికి చేరింది. ముస్లింలీగ్ ప్రత్యక్షచర్య పేరుతో సాగిస్తున్న దురాగతాలను చూసి కాంగ్రెస్ నేతలు కంపించి పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా హిందువులకు తాము ప్రవచిస్తూ వచ్చిన శాంతి, అహింసలకు....ఈ ముస్లింలీగ్ అత్యాచారాలకు మధ్య ఎలా సంతులనం సాధించాలో తెలియక కాంగ్రెస్ నాయకులు అంతా బెంబేలెత్తారు. దేశ విభజన లేకుండా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించుకోగల దృఢత్వాన్ని అటు బ్రిటీష్ వారి ముందు, ఇటు ముస్లింలీగ్ ముందు ప్రదర్శించలేకపోయారు. 

గాంధీజీ చివరి క్షణం వరకు విభజనను నివారించేందుకే ప్రయత్నించారు. విభజన ప్రతిపాదనతో మౌంట్ బాటన్ గాంధీజీ వద్దకు వచ్చినప్పుడు తాను విభజనకు వ్యతిరేకినని ఆయన చెప్పారు. విభజనకు అంగీకరించపోతే...దేశంలో అంతర్యుద్ధం చెలరేగుతుందని మౌంట్  బాటన్ హెచ్చరించినప్పుడు గాంధీజీ...మొత్తం భారత దేశ పరిపాలనను మహమ్మదాలీ జిన్నా చేతుల్లో పెడతామని సైతం మౌంట్ బాటన్ తో చెప్పినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం గాంధీజీ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇదే సమయంలో గాంధీజీ కూడా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  నా జీవన స్వప్నం చెల్లాచెదరైపోయింది. అని ఆయన ఎంతో వ్యధ చెందారు. గాంధీజీ రాజకీయంగా మరణించారని... సరోజినీనాయడు  ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారని అంటారు.  అటు 1948 జూన్ లోపుననే అంతిమ అధికార బదిలీ జరుగుతుందని...అట్లీ స్పష్టం చేశాడు..! మౌంట్ బాటన్ కూడా అదే పని మీద భారత్ కు వైస్రాయిగా వచ్చాడు. అటు జిన్నా తన మొండి వైఖరిని వీడలేదు. పాకిస్తాన్ డిమాండ్ నుంచి ఒక్క అంగుళం కూడా కదలేది లేదు అనటం తప్ప వేరే వ్యాఖ్యలే చేయలేదు. 1948 మార్చి  8న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగు కమిటీ బ్రిటీష్ ప్రభుత్వ ప్రకటనను స్వాగతించి, పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను మతప్రాతిపాదికన విభజించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు అందరికీ ప్రయోజనకరంగా ఉండేవిధంగా శాంతియుతంగాను, వేగంగాను అధికారబదిలీ జరిగే మార్గాలను యోజన చేసేందుకు ముస్లింలీగ్ ను సైతం ఆహ్వానించింది. ఈ  రెండు ప్రాంతాలను మతప్రాతిపాదికన విభజించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో...పాకిస్థాన్ డిమాండ్ ను కాంగ్రెస్ నేతలు సూత్రపాయంగా అంగీకరించినట్లు అయ్యింది.  ఆ తర్వాత కూడా ఎన్నో సంఘటనలు చాలా వేగంగా జరిగాయి. విభజనకు సంబంధించి వి.పి మీనన్ సరికొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చాడు.  బెంగాల్, పంజాబ్ అసెంబ్లీలు హిందూ, ముస్లిం ప్రాంతాలుగా విడిగా సమావేశమై భారత్ దేశంలో ఉండాలా ? వద్దా అని నిర్ణయిస్తాయని..., అలాగే భారత్ నుంచి విడిపోవడానికి సింధ్ కు స్వాతంత్ర్యం ఉంటుందని, ఇక వాయువ్వ సరిహద్దు రాష్ట్రాలు, బెలూచిస్తాన్, అస్సాంలోని సిల్హెట్ జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుందని  తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. మౌంట్ బాటెన్ ఈ ప్రతిపాదనలు గాంధీజీ ముందు పెట్టినప్పుడు కూడా ఆయన...తనకు ఎటువంటి వ్యతిరేకత చెప్పలేదని మౌంట్ బాటన్ అన్నాడని చెబుతారు.  ఇక ఈ ప్రతిపాదనలను మౌంట్ బాటెన్ జిన్నావద్దకు తీసుకెళ్లాడు. మొదట ఈ ప్రతిపాదనను జిన్నా వ్యతిరేకించాడు. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ లను విభజించడాన్ని జిన్నా వ్యతిరేకించాడు. ఈ రెండు రాష్ట్రాలు పూర్తిగా పాకిస్థాన్ కే దక్కాలని వాదించాడు. అయితే కాలహరణం ఏమాత్రం మంచిదికాదని ఒక్కవారం ఆలస్యం జరిగినా పరిస్థితులు మారిపోవచ్చని మౌంట్ బాటన్ జిన్నాను హెచ్చరించాడు. చివరకు జిన్నా ఈ ప్రతిపాదనలను అంగీకరించాడు..!  జూన్ 3వ తేదీన ఈ విభజన పతకంపై సంతకాలు జరిగాయి. దేశ విభజనకు అధికారిక ఆమోదముద్ర వేయబడింది. దీనినే చరిత్రకారులు జూన్ 3 పథకంగా పేర్కొన్నారు. 

జూన్ 3 ప్లాన్ ను అంగీకరించేందకు కాంగ్రెస్...వర్కింగ్ కమిటీ సమావేశానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ లోని సోషలిస్టులు తొలి నుంచి దేశవిభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తు వచ్చారు. కానీ ఈ సమావేశంలో వారు తమ నిరసనను సైతం వ్యక్తం చేయలేదు. అయితే కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైనా బాబూ పురుషోత్తమదాస్ టండన్ మాత్రం కడదాక ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూనే మాట్లాడడారని చరిత్రకారులు చెబుతారు! 

జూన్ 3 పథకాన్ని అంగీకరిస్తూ తీర్మానాన్ని ఆమోదించటానికై 1947 జూన్ 14, 15 తేదీలలో అఖిల  భారత కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలో సమావేశం అయ్యింది. దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సాధించటానికి గల ఒకే ఒక మార్గాన్ని ఈ పథకం తెరిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత గోవిందవల్లభ్ పంత్  తీర్మానాన్ని ప్రతిపాదించారు. జూన్ 3 పథకానికి...ఆత్మకు మధ్య మొదటి దానినే ఎంచుకున్నామని ఆయన చెప్పాడు. అయితే ఆజాద్ మాత్రం ప్రస్తుత పరిస్థితులలో క్యాబినెట్ మిషన్ పథకమే అత్యుత్తమమని అన్నారు. ఇక ఈ తీర్మానం ముస్లింలీగ్ హింసాత్మక కుయుక్తులకు తలవొగ్గటమేనని ఛోత్రామ్ గిద్వానీ విమర్శించారు.  అటు కాంగ్రెస్ లోని సోషలిస్టులు తొలి నుంచి దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. కాని, ఈ సమావేశంలో వారు నిరసన స్వరాన్ని వినిపించలేదు. ఇక దేశ విభజన తీర్మానాన్ని కడదాక వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ పురుషోత్తమదాస్ టండన్...ఈ తీర్మానం బలహీనతతోను, నిప్పృహతోను కూడుకొన్న సలహా అన్నాడు. ముస్లింలీగ్ ఉగ్రవాద వ్యూహాలకు నెహ్రూ ప్రభుత్వం ధైర్యం కోల్పోయిందని...దేశ విభజనను అంగీకరించటమంటే ప్రజలపట్ల నమ్మకద్రోహమని...శత్రువులకు తలవంచటమేనని అన్నాడు. అంతేకాదు సమైక్యభారతమనే మన ప్రియతమ లక్ష్యాన్ని త్యాగం చేసే బదులు...మరికొంతకాలం మనం బ్రిటీష్ పాలనలో బాధను  అనుభవిద్దాం. అవసరమైతే బ్రిటిష్ వారితో, ముస్లింలీగ్ వారితో- ఇద్దరితోనూ పోరాడటానికి నడుం  బిగిద్దాం. మన దేశ సమగ్రతను పరిరక్షించుకుందాం అని పురుషోత్తమదాస్ టండన్ ఆవేశపూరితంగా..కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వాదించాడు. ఆయనకు మరికొంతమంది నేతలు తోడుగా నిలిచారు. పోరాటం సాగించాల్సిందేనని పట్టుబట్టారు.  మరి కొంతకాలం ఆగుదామని...బ్రిటీష్ వారితోపాటు, ముస్లింలీగ్ తో పోరాటాన్ని ముమ్మరం చేద్దామన్న టండన్ కు మద్దతుగా నిలిచారు. దాంతో  విభజన తీర్మానం పరిస్థితి డోలాయమానం అయ్యింది.  పురుషోత్తమదాస్ టండన్ వ్యతిరేకతతో జూన్ 3 పథకాన్ని అంగీకరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేద్దాం అనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యాయి. ఈ కీలక తరుణంలో గాంధీజీ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ కార్యకారిణీ చేసిన తీర్మానాన్ని సమర్థించమని ఆయన సభ్యులను కోరారు. చివరికి అనేక వాదనలు-నిరసనల మధ్య 157-29 ఓట్లతో జూన్ 3 పథకాన్ని కాంగ్రెస్ కమిటీ సమర్థించింది.  అయితే విభజన కోసం రూపొందించిన పథకం భారత్ కు ముఖ్యంగా హిందువులకు ఎంతో అన్యాయం చేసింది. ముస్లింలీగ్ ప్రభుత్వ పాలనలో ఉన్న సింధ్ అసెంబ్లీకి పాకిస్థాన్ లో చేరేందుకు స్వేచ్ఛ ఇవ్వడింది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న వాయువ్య సరిహద్దు ప్రాంతం మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టబడింది. అస్సాంలోని ముస్లిం మెజారిటీ జిల్లా అయిన సిల్హెట్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్నారు. ఇక సింధ్ లో...రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హిందూ బహుళ జిల్లా అయిన తార్ పార్కర్ కు ఆ అవకాశం కల్పించలేదు. ఇటు పాకిస్థాన్ లో భాగంగా మారిన పశ్చిమ పంజాబ్  జనాభా 55 శాతం ఉండగా... దానికి 62 శాతం భూభాగం లభించింది. హిందూ మెజారిటీ అయిన నగరమైన లాహోర్... పాకిస్థాన్ వెళ్లిపోయింది. అలాగే తూర్పు బెంగాల్ లో కేవలం మూడు శాతం మాత్రమే ముస్లిం జనాభా ఉన్న చిట్టగాంగ్ పర్వత శ్రేణులు తూర్పు పాకిస్థాన్ కు ఇవ్వబడ్డాయి. ఈ కొండలలో నివసించే అధిక సంఖ్యాకులైన చక్మా బౌద్దుల ప్రతినిధివర్గం, హిందువులు... కాంగ్రెస్ నాయకులను కలిసి, తమను ముస్లింల దాయదాక్షిణ్యాలకు బలిచేయవద్దని, భారతదేశంలోనే భాగంగా ఉండనివ్వమని అనేక విధాలుగా ప్రార్థించింది. అయితే అధికారం లభిస్తున్న సందడిలో ఉన్న కాంగ్రెస్ నేతలకు...ఈ అభాగ్యుల ఆక్రందనను వినే ఓపిక లేకపోయింది. ఇప్పుడు ఇదే చిట్టగాంగ్ భారత్ లో అంతర్భాగం అయితే...ఈశాన్య భారతానికి నౌక కేంద్రంగా ఉపయోగపడేది. ప్రస్తుతం మనం ఈశాన్య భారతం వెళ్లాలంటే చికెన్ నెక్ రోడ్డు మార్గమే శరణ్యం..! అంతేకాదు దేశ భద్రత దృష్ట్యా కూడా ఇది కీలకమైన స్థావరం. కానీ కాంగ్రెస్ నేతల ఉదాసీన వైఖరి కారణంగా ఈ హిందువుల ప్రాంతం నేడు మనకు కాకుండా పోయింది..! 

అఖండ భారత విభజనను బ్రిటీష్ ప్రభుత్వం మేలోనే ప్రకటించింది. కానీ అదే సమయంలో కొత్తగా ఏర్పడే రెండు దేశాల సరిహద్దులను నిర్ణయించే కమిషన్ ను మాత్రం జూన్ చివరలోగాని నియమించలేదు. స్వాతంత్ర్యం మాత్రం ఆగస్టులో ప్రకటించారు..! అలాగే విభజన శాంతియుతంగా జరిగిందా..? అంటే అది లేదు..! తక్కువ తయారీతో విభజన తేదీని ప్రకటించాడు మౌంట్ బాటన్..! నిజానికి ఆగస్టు 17 వరకు చాలా ప్రాంతాలలో ప్రజలకు తాము విభజన రేఖకు ఎటువైపు ఉన్నామో తెలియదు..! మరో వైపు ముస్లింలీగ్ మతోన్మాదులదాడులతో హిందువులు ఊచకోతలకు గురయ్యారు! 

దేశ విభజన సమయంలో మౌంట్ బాటన్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని ఆనాటి చరిత్రకారులే చెబుతారు. అఖండ భారత దేశానికి 1948 జూన్ నాటికి స్వాతంత్ర్యం ఇస్తామని లేబర్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. కానీ మౌంట్ బాటన్ దానిని పది నెలల ముందుకు జరిపాడు.! తన ఈ చర్యలతో ఆయన దేశంలో అయోమయపరిస్థితిని గందరగోళాన్ని సృష్టించాడు. సరైనా ప్రణాళిక లేకుండానే దేశ విభజనకు బాటలు వేశాడు. విభజనకు మౌంట్ బాటన్ పెట్టుకున్న డెడ్ లైన్ 1947 ఆగస్టు 15. ఆయన ఈ నిర్ణయంతో ఎంతోమంది ప్రజానీకం మరణించారు. మరేందరో తరతరాలుగా నివసిస్తున్న తమ భూభాగాలను వదిలి వలసబాట పడ్డారు. దాదాపు 3లక్షల మందికి పైగా ప్రజలు ఈ విభజన కారణంగా మరణించారని చెబుతారు. దీనికితోడు హిందువులను టార్గెట్ చేస్తూ ముస్లింలీగ్ దాడులు..దేశం మొత్తాన్ని భయానక వాతారణంలోకి నెట్టివేశాయి.  తీవ్రమైన మత ఉద్రిక్తతల మధ్య విభజన జరిగింది. హింసా కాండ చెలరేగుతుందని ప్రభుత్వానికి తెలుసు. అయినా కేవలం 50 వేల మంది సరిహద్దు దళాల సహాయంతో విభజన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మౌంట్ బాటన్ నిర్ణయించాడు. ఊహించినట్లుగానే సరిహద్దు వెంబడి పెద్దఎత్తున చెలరేగిన మతకలహాలు 3 లక్షల మంది ప్రజల ప్రాణాలను హరించాయి.  అటు విభజన అనివార్యమని...తెలిసిన తర్వాత ఆచరణాత్మక దకృపథాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క నాయకుడు డాక్టర్. బిఆర్. అంబేద్కర్. భారత్- పాకిస్థాన్ ల మధ్య జనాభా మార్పిడి జరగాలని సూచించారు. పాకిస్థాన్ భూభాగంలో మిగిలిపోయిన హిందువులను భారత భూభాగంలోకి...భారత భూభాగంలో ఉండిపోయిన ముస్లింలను పాకిస్థాన్ లోకి మార్పు చేయాలని డాక్టర్ అంబేద్కర్ చేసిన సూచనను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు.  పాకిస్థాన్ భూభాగంలోని హిందువులను...తమ స్వస్థలాలోనే ఉండిపోవాలని గాంధీజీ కోరారు. అయితే గాంధీజీ అక్కడి వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అసలే  ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ తో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలు...విభజనానంతరం మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. గాంధీజీ మాట ప్రకారం...పాకిస్థాన్ గా మారిన భూభాగంలోని తమ తమ స్వస్థలాలలోనే ఉండిపోయిన వేలాది మంది హిందువులు..ముస్లింలీగ్ గుండాల దుర్మార్గాలకు బలైపోయారు. ప్రాణాలరచేత పట్టుకుని లక్షల సంఖ్యలో హిందువులు శరణార్థులై భారత భూభాగంలోకి వచ్చిపడసాగారు.  దేశ విభజన సమయంలో ఒక్కొక్క శరణార్థిది ఒక్కొక్క విషాదగాథ...! లూటీలు, గృహదహనాలు, భయానకమైన అత్యాచారాలకు పాకిస్థాన్ లోని హిందువులు గురిచేయబడ్డారు. హిందూ శరణార్థులు వెల్లువలా పంజాబ్ గుండా ఢిల్లీలో ప్రవేశించారు. వచ్చిన శరణార్థులు అందరూ తమను కాంగ్రెస్ నాయకులు...ముఖ్యంగా గాంధీ, నెహ్రూలే మోసం చేశారని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించసాగారు. దాంతో శరణార్థుల ఆగ్రహ జ్వాలలకు భయపడి నెహ్రూ ప్రభుత్వం గాంధీజీ తలపెట్టిన పంజాబ్ యాత్రకు అనుమతి కూడా ఇవ్వలేదు.  దేశ విభజన తర్వాత హిందువుల రక్షణకు పటేల్ తీసుకున్న చర్యల కారణంగా ఆయన ప్రతిష్ఠ పెరగసాగింది. ఇది కాంగ్రెస్ లోని ఇద్దరు గొప్ప నాయకులు సహించలేకపోయారని అంటారు. అటు దేశ విభజన సమయంలో ఢిల్లీ వదిలి పాకిస్తాన్  వెళ్లిపోయిన ముస్లింలను తిరిగి వెనకకు పిలవాలని, వారి ఆస్తులను వారికి అప్పగించాలని గాంధీజీ 1948  జూన్ 12 నిరాహారదీక్షకు దిగారు.  అలాగే హిందూ శరణార్థుల కోసం ఢిల్లీలోని పాడుపడ్డ మసీదులలో, మద్రసాలలో ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించాలన్నది గాంధీజీ కోరాడు. దాంతో హిందూ శరణార్థులను ప్రభుత్వం ఆ శీతాకాలపు చలిలో వీధుల్లోకి గెంటించవలసి వచ్చింది.  పాకిస్థాన్ కు వెళ్లిపోయిన ముస్లింల ఆస్తుల రక్షణకు అంతా ఆసక్తి ప్రదర్శించినా గాంధీజీ....అదే పాకిస్థాన్ నుంచి తరమిగొట్టబడిన హిందువుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై కొందరు చరిత్రకారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాంధీజీ అంతటితో ఆగిపోలేదు.!  నూతనంగా ఏర్పడ్డ పాకిస్థాన్ కు... భారత ప్రభుత్వం 55 కోట్ల  రూపాయల ధనాన్ని ఇవ్వాలని....అప్పుడే తాను దీక్ష విరమిస్తానని గాంధీజీ పట్టుబడ్డారు. భారత దేశం...హిందూ ప్రజానీకంపై ద్వేషంతో..., మతోన్మాదంతో ఊగిపోతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక్కసారి అంత ధనం ఇవ్వడం శ్రేయస్కరం కాదని పటేల్ గాంధీజీకి ఎంతగానో వివరించి చెప్పాడు. అంతేకాదు ఈ ధనంతో ఆయుధాలు కొనుగోలు చేసి మళ్లీ మనపైకే ముఖ్యంగా కశ్మీర్ పైకి యుద్ధానికి దిగుతుందని కూడా సర్దార్ పటేల్ గాంధీజీకి వివరించాడు. పటేల్ ఎన్ని సూచనలు చేసినా గాంధీజీ వినిపించుకోలేదు. దాంతో చివరకు గత్యంతరం లేని పరిస్థితులలో నెహ్రూ ప్రభుత్వం 55 కోట్ల రూపాయలను పాకిస్థాన్ కు చెల్లించింది. సరిగ్గా హోంమంత్రి సర్దార్ పటేల్ ఊహించినట్లుగానే...పాకిస్థాన్ ఆ ధనంతో ఆయుధాలు సమకూర్చుని కాశ్మీర్ పై దురాక్రమణకు దిగింది.  అంతేకాదు కాశ్మీర్ విషయంలోనూ గాంధీజీ విచిత్రమైన ధోరణినే ప్రదర్శించారు. కాశ్మీర్ లో  ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్నారని... మహారాజా హరిసింగ్ తన సంస్థానాన్ని షేక్ అబ్దుల్లాకు అప్పజెప్పి..., మహారాజాను వారణాసికి వచ్చి స్థిరపడాలని గాంధీజీ సూచించారు. కానీ అదే సమయంలో హైదరాబాద్ సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు..., మరి ముస్లిం నవాబుకు కూడా మీరు ఇదే సలహా ఇవ్వగలరా అన్న ప్రశ్నకు గాంధీజీ మౌనం వహించారని అంటారు.

దేశ విభజన జరిగే సమయంలో ముస్లింలీగ్ ను బలంగా సమర్థించిన ముస్లింలు...నిజానికి పాకిస్థాన్ కు వెళ్లిన భూభాగంలో నివసించినవారు కాదని కొందరి చరిత్రకారుల మాట. ముఖ్యంగా భారత్ లోని హైదరాబాద్, జునాగఢ్, యునైడెడ్ ప్రావిన్సెస్, మద్రాసు వంటి రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలలోని ముస్లింలీగ్ నాయకులే  దేశవిభజనను సమర్థించారు.దేశ విభజన తదుపరి ముస్లింలీగ్ కు చెందిన సమర్థకులు... నాయకులు అందరూ భారత్ లోనే ఉండిపోయారని అంటారు. ఈ పరిస్థితులను దూరదృష్టితో గ్రహించి...కాంగ్రెస్ నేతలు దృఢంగా నిలబడి ఉంటే అసలు దేశం ముక్కలయ్యేదికాదన్నది చరిత్రకారుల అభిప్రాయం. దృఢంగా నిలబడాల్సిన సమయంలో కాంగ్రెస్ నేతలు..నాయకత్వం WE BECAME OLD అని పేర్కొంది. 

-వనకళ్ల బీరప్ప కురుమ