Monday, December 09, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 12

By BhaaratToday | Published On May 6th, 2019

ఈ దేశానికి బ్రిటీష్ వారు రాకపోతే...ఏమయ్యేదో...? విదేశీ భావద్యాసానికి బానిసలైన కొంతమంది మేధావులు పదే పదే వళ్లవేసే మాటలు..! ముక్కలు ముక్కలుగా ఉన్న రాజ్యాలన్నిటిని కలిపి భారత దేశాన్ని ఒక్కటిగా చేసిన ఘనత తమదేనని ప్రగల్భాలు పలుకుతుంటారు. అంతేకాదు మార్క్స్...మెకాలే వాద చరిత్రకారులు ప్రజలలో దేశభక్తి, జాతీయభావనలు  జనించటానికి కారణం బ్రిటీష్ వారేనని తర్కిస్తారు..! ఈ దేశంలో బ్రిటీష్ వారు రాక ముందు దేశభక్తి జాతీయభావనలు లేవా..? దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉన్న...ఈ దేశమంతటా ఒక్కటే అనే భావన తరతరాల నుంచి భారతీయుల్లో ఉంది. దీనికి హిందూ జీవన విధానం...వారు జరిపిన తీర్థయాత్రలే నిదర్శనం..!  ఇక బెంగాల్ ను ఆక్రమించుకున్న తర్వాత తమదైన కుట్రలకు తెరలేపారు. ఈ కుట్రలను వమ్ముచేసేందుకు మొత్తం భారతీయ సమాజం ఏకమై 1857లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. ఈ పోరాటాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక దామోదర సావర్కర్ ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు...! సోనార్ బంగ్లా-1857 స్వరాజ్య సంగ్రామం..! 

బెంగాల్ ను ఆక్రమించుకున్న తర్వాత...తమను చూడగానే భారతీయులు తమతమ ధర్మాలను వదిలి క్రైస్తవం స్వీకరిస్తారని భావించారు. 1836లో బెంగాల్ లో ఆంగ్లభాషా పాఠశాలలు ప్రారంభించినప్పుడు మెకాలే....ముప్పై ఏళ్ళలో  బెంగాలులో  విగ్రహారాధకుడనేవాడూ కనిపించడని గట్టిగా వాధించాడు. 

బ్రిటీష్ వారు....విద్యావంతులు అయిన బెంగాల్ భారతీయులను సైతం తమతో సమానులుగా భావించేవారు కాదు..!  వారికి ఉన్నతోద్యోగాలు ఇచ్చేవారు కారు. రాజకీయంగా కూడా భారతీయులకు ఎటువంటి హక్కులు లేవు. తమ గోడు వినిపించే అవకాశం బెంగాల్ ప్రజలకు లేకుండా పోయింది. దాంతో బ్రిటీష్ వారి పట్ల ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది.  అటు బెంగాల్ లో....కంపెనీ అధికారులు  ప్రజలను మతమ మార్చేందుకు కుట్రలు మొదలు పెట్టారు. క్రైస్తవ మిషనరీలు.... చేసే మతప్రచారం...హిందూ, ముస్లింలో తీవ్రమైన ఆందోళన, నిరసనను రగిల్చింది. హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయడం, పురాణాలకు వికృత వ్యాఖ్యానం చేయడం, హిందూ దేవుళ్లను వేళాకోళం చేయటం హిందువులలో ఆవేశాన్ని రగిల్చింది. మసీదులు, మందిరాల వద్ద మిషనరీలు పనికట్టుకుని మత ప్రచారం చేసేవారు. వారినెవరూ ఏమీ అనకుండా, మిషనరీలకు పోలీసులు, సైనికులు ఉండేవారు. తిరుగుబాట్లు  అణిచివేసేందుకు..సైన్యాన్ని వేగంగా తరలించేందుకు రవాణా సౌకర్యాలపై దృష్టి పెట్టారు. రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్లాన్లు వేశారు. టెలిగ్రాపులు...కూడా ప్రవేశపెట్టారు. బెంగాల్ లో ఈస్టిండియా కంపెనీ పాలన మొదలయ్యే నాటికే ఎన్నో పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉన్నాయి. వ్యవసాయం ఉత్తమ స్థాయిలో ఉండేది. కానీ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక పరిశ్రమలను దెబ్బతీశారు. భారతీయ ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు విధించేవారు. ఇంకా పెద్ద ఎత్తున సంకాలు వసూలు చేసేవారు. ఈ రకమైన పాలసీని కంపెనీ డైరెక్టర్లు 1769లోనే నిర్ణయించారు.  భారతీయ వ్యాపారులపై వస్తువులపై పన్నులు విధించి,సుంకాలు వసూలు చేస్తున్నా....వారి పోటీని తట్టుకోవటం బ్రిటీస్ వారికి కష్టమైంది. దాంతో భారత్ నుంచి వస్తువుల దిగుమతులపై నిషేధం విధించారు. అదే సమయంలో ఇంగ్లాండ్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు తొలగించారు. ఫలితంగా 19వ శతాబ్దం వచ్చేసరికి ఒక్క బెంగాల్ లోనే కాదు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ భారతీయ పరిశ్రమలు మూతపడ్డాయి. భారతీయులు ఇంగ్లండ్ లో తయారైన వస్తువులపై ఆధారపడాల్సిన పరిస్థితులను కల్పించారు.  1840లో బ్రిటన్ పార్లమెంట్ లో భారతీయ ఆర్థిక దుస్థితి గురించి తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మాంట్ గోమరీ అనే సభ్యుడు మాట్లాడుతూ... భారత దేశంలోని పరిశ్రమలను నాశనం చేసి కేవలం వ్యవసాయక దేశంగా మిగల్చటం...ఆ దేశానికి మనం చేస్తున్న తీరని అన్యాయం అంటూ వాపోయాడు. మాంట్ గోమరీ ప్రశ్నకు...సమాధానంగా మిస్టర్ కోప్ అనే వ్యాపారి మాట్లాడుతూ... భారతీయ పనివారి దుస్థితి చూస్తూ నాకు జాలిగానే ఉంది. కానీ నాకు వాళ్ళకన్నా నా కుటుంబం...గురించి ఎక్కువ చింత ఉంది. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉన్నదని నా కుటుంబ సౌఖ్యాన్ని త్యాగం చేయమనటం మరింత అన్యాయం అన్నాడు. ఇది భారతీయుల దుస్థితి పట్ల, దేశాన్ని ఉద్దరించి, నాగరికం నేర్పామని ప్రచారం చేసుకున్న ఆంగ్లేయుల దృష్టికోణం.  పరిశ్రమలు మూతపడటంతో...ప్రజలు అందరూ  వ్యవసాయం వైపు మల్లారు. కానీ అదే సమయంలో భూమి పన్నును విపరీతంగా పెంచారు ఆంగ్లేయులు..! 1852లో ఈస్టిండియా కంపెనీ... ఇనామ్ కమీషన్ ను ఏర్పాటు చేసింది. గతంలో రాజులు...నవాబులు నోటిమాట ద్వారా దానం చేసిన భూములను పరిశీలించి...నిర్ణయించడం ఈ కమీషన్ పని. ఐదేళ్లలో ఈ కమిషన్ 20 వేల ఎస్టేట్లను అక్రమంగా తమ పరం చేసుకుంది.  ఇలా బెంగాల్ లో ప్రజలు అందరూ ఏదో ఒక రకంగా బ్రిటీష్ వారి విధానాల వల్ల దెబ్బతిన్నవారే..! కేవలం రాజ్యాలు, కోల్పోయిన రాజులు, భూములు, కోల్పోయిన జమీందారులే కాదు, రాజు, పేద, సైనికుడు, శ్రామికుడు, పండితుడు, పామరుడు, అగ్రవర్ణాలవారు, అన్నతేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ వారి బానిసత్వ సంకెళ్ళ ఉచ్చులో చిక్కుక్కున్నవారే. వ్యవస్థీకృతమైన భారతీయ జీవన వ్యవస్థను కోల్పోవడంతో...ఆంగ్లేయులను దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. 

1857 నాటికి దేశం మొత్తం బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. అదే సమయంలోతూటాలకు ఆవుకొవ్వు, పందికొవ్వు పూస్తున్నారన్న వార్త కార్చిచ్చులా దేశ వ్యాప్తంగా వ్యాపించింది. తమను మతభ్రష్ఠులను చేసేందుకు అన్న అనుమానంతో ఉన్న భారతీయులు.... ధర్మాగ్రహంతో యుద్ధానికి సిద్ధం అయ్యారు. 

సర్వత్రా కోపోద్రిక్తతలు ప్రజ్వరిల్లుతున్న సమయంలో  డల్హౌసీ స్వయంగా హిందూ ధర్మంపై మరొక దౌర్జన్యం చేశాడు. యావద్భారతం లోనూ యుగయుగాలుగా ఆదరింపబడుతూ హిందూధర్మ శాస్త్రానుగుణమైన దత్తస్వీకార సాంప్రదాయాన్ని గుర్తించేందుకు నిరాకరించాడు.  డల్హౌసీ నిర్ణయంపై దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. అదే సమయంలో..., అగ్నిలో ఆజ్యంపోసినట్లుగా ఈస్టిండియా కంపెనీలో పనిచేసే సైనికులు అందరూ...కొత్తరకం తూటాలు వాడాలని ఆజ్ఞలు జారీ అయ్యాయి. వెంటనే కొత్త రకాల తుపాకులకు ఈ కొత్తరకం తూటాలను తయారు చేసేందుకు అనేక ప్రదేశాలలో కర్మాగారాలు నెలకోల్పబడ్డాయి. అవి సన్నగా ఉండేందుకు ఒక రకమైన క్రొవ్వుతో పూతపూయబడి ఉండేవి. అంతకు పూర్వం వలే గాక...వీటిని పండ్లతోకొరికి వాడవలిసి వచ్చింది. కలకత్తా నగరం సమీపంలోని డండం గ్రామానికి చెందిన ఓ బ్రాహ్మణ సిపాయికి...రోడ్లు ఊడ్చేవాడు అసలు విషయం చెప్పాడు. నీ ఆచారం తగలడ్డట్లేఉంది. కొద్ది రోజులలో పందికొవ్వు, ఆవునెత్తురు పూసిన తూటాలను కొరకపోతున్నావంటూ దెప్పి పొడిచాడు. ఈ విషయం మిగిలిన అన్ని సైనిక రెజిమెంట్లకు పాకింది. తుటాలకు పూసేందుకు ఏర్పాటు చేసిన జంతు వధశాలలను కూడా వీరు తనిఖి చేశారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను అడిగిన తర్వాతనే బారట్ పూర్ సిపాయిలు ఈ వార్తను బెంగాల్ నుంచి భారత దేశమంతటా తెలియజేశారు.  ఈ ఆందోళనలు 1857 జనవరి మొదటి వారంలో ప్రారంభం అయ్యాయి.  నెలాఖరుకు వచ్చేసరికి ఈస్టిండియా కంపెనీ కొంత లొంగిక తప్పలేదు. సిపాయిలు తాము తయారుచేసుకున్న క్రొవ్వునే తూటాలకు వాడుకోవచ్చునని ఆజ్ఞ జారీ చేసింది. పైగా అదే సమయంలో మరొక ప్రభుత్వ పత్రం ద్వారా అభ్యంతరకరమైన ఒక్క తూటా కూడా సైన్యాలలోకి పంపబడలేదని ఆంగ్లేయ అధికారులు హామీలు ఇచ్చిన సైనికులు నమ్మలేదు. కానీ ఒక అంబాలా డిపో నుంచే 22 వేల తూటాలు, సమాల్ కోట డిపో నుంచి 14 వేల తూటాలు సైన్యాలలోకి వెళ్లిపోయాయి. గుర్ఖా దళాలలో వీటిని బహాటంగానే ఉపయోగించేవారు. ఆ తూటాలను వాడపోతే బలవంతం చేయవలసి వస్తుందని సైన్యాధికారులు హెచ్చరించేవారు. కొన్నిచోట్ల సిపాయిలు ఎవరైనా తూటాను ఉపయోగించడానికి నిరాకరిస్తే...ఆ దళం మొత్తాన్ని శిక్షించేవారు.  అయితే కట్టలు దాటేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ ఆవేశాగ్నిని కట్టలు దాటింది...! విప్లవంవైపు మార్గదర్శనం చేసిన సంఘటన మార్చ్ 29, 1857న జరిగింది. భారతీయ విప్లవానికి నాందీ ప్రస్తావన చేస్తూ మంగళపాండే తూటా నిప్పులు గక్కింది. రాజుకుంటూ ఉన్న అసంతృప్తి బ్రద్ధలైంది. 

1857 లో స్వాతంత్ర్య పోరాటం...వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు సమయాల్లో ఆరంభమంది. అయితే సరైనా దూరదృష్టి కలిగిన సైనిక నాయకుడు లేకపోవడాన్ని బ్రిటీష్ సైన్యం అనుకూలంగా మార్చుకుంది. బెంగాల్ కలకత్తా కేంద్రంగా 1857 ఉద్యమాన్ని అణిచివేసేందుకు...క్యానింగ్ సిద్ధమయ్యాడు.  

1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం ఆరంభమయిన సమయంలో...దేశంలో  మొత్తం రెండు లక్షల 32 వేల మంది భారతీయ సైనికులు ఉండేవారు. వీరితో పోలిస్తే... 6170 ఆఫీసర్లతో కలిసి యూరోపియన్ సేనలు కేవలం 45 వేలు మాత్రమే ఉన్నాయి. ఈ విదేశీ సైనికులు కూడా అధిక సంఖ్యలో  ఆగ్రా, దానాపూర్ ల వద్ద ఉండేవారు....! భారతీయ సైనికులు కనుక సరైన ప్రణాళిక ప్రకారం విప్లవం ఆరంభించి ఉంటే...అందరూ మూకుమ్మడిగా ఒకేసారి దేశంలోని పలు ప్రాంతాలలో తిరగబడి ఉంటే ఎటు వెళ్ళాలో..ఏం చేయాలో తెలియక బ్రిటిష్ వారు ఉక్కిరిబిక్కిరి అయి ఉండేవారు. వారికి ఆకస్మికంగా తగిలిన దెబ్బం నుంచి తేరుకుని ఉండేవారు కారు..!  సైనిక విప్లవం వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు సమయాల్లో  ఆరంభమయినా ఎవరో ఒకరు సైన్యంపై అధికారం హస్తగతం చేసుకొని సైనికలను సరైన రీతిలో మార్గదర్శనం చేసి ఉంటే కూడా ఫలితం మరో రకంగా ఉండేది. అవధ్, రోహిల్ ఖండ్ లపై ఆధిపత్యం సాధించిన విప్లవ సేనలు...పంజాబ్  నుంచి ఇంగ్లీష్ సేనలు ఢిల్లీ చేరకుండా దారిని అడ్డగించి ఉండాల్సింది.  ఢిల్లీలో బ్రిటీష్ వారిని తరిమివేసిన సైనికులు...విప్లవ సైనికులు తమలో తమ కలహించుకోవటంలో మునిగి తేలారు. అలహాబాద్ , వారణాసి, పాట్నా వంటి ప్రాంతాలపై దాడులు చేసి ఉంటే...అప్రమత్తంగా ఉన్న బ్రిటీష్ వారిపై గెలుపు సులభతరమయ్యేది. బ్రిటీష్ వారిని ఒకరొకరిని దేశం విడిచి తరిమికొట్టగలిగేవారు. అదే సమయంలో బెంగాల్ లో లార్డ్ క్యానింగ్...తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఢిల్లీని తిరిగి సాధించాలని నిర్ణయించుకున్నాడు. మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలోని సైన్యాన్ని కలకత్తాలో కేంద్రీకృతం చేశాడు. అలాగో సిలోన్  గవర్నర్ ను సహాయంగా సైన్యాన్ని పంపమని కోరాడు. అటు చైనాకు వెళ్తున్న బ్రిటీష్ సేనను కలకత్తాకు రమ్మని కోరాడు.  మరో వైపు పంజాబ్ లో బ్రిటీష్ వారి ఆధీనంలోని సిక్కు సైన్యాలను ఢిల్లీకి పంపించమని ఆదేశించాడు.  ఢిల్లీని అదుపులోకి తెచ్చుకోటానికి క్యానింగ్ అత్యంత ప్రాధాన్యాత ఇచ్చాడు. పలుప్రాంతాల నుంచి మీరట్ వచ్చి చేరిన బ్రిటీష్ సేనలు మూడు రోజులలో ఢిల్లీ చేరాయి. నది తీరం వద్ద బ్రిటీష్ సేనలతో స్వతంత్ర సేనలు తలపడ్డాయి. భీకరమైన పోరు జరిగింది. ఆతర్వాత మరుసటి రోజు బద్లి కా సరాయ్ వద్ద బ్రిటీష్ వారికి స్వతంత్ర సేనలకు సంకుల సమరం జరిగింది. ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక్కో అడుగు వెనుక్కు వెళ్ళక తప్పలేదు విప్లవ సేనలకు. కానీ ఢిల్లీ పై విజయం సాధించడం అంత సులభం కాదని క్యానింగ్ కు అర్థమయ్యంది. దాంతో మరిన్ని సైనిక దళాల కోసం కబురు పంపి , దీర్ఘకాలిక యుద్ధం కోంస సిద్ధమయ్యాడు క్యానింగ్.  సైనికులకు ఆఫీసర్ల మాట వినటం అలవాటు. ఢిల్లీ చేరిన అధిక సంఖ్యాకులు ఆజ్ఞలను పాటించడానికి అలవాటుపడ్డవారే. దాంతో యుద్ధం తీరుని ఆజ్ఞాపించే వారెవరూ లేకపోవడంతో సైనికులు అయోమయాల్లో  పడ్డారు. పైగా వారిలో వారికి అనేక చిల్లర తగాదాలున్నాయి. దీనికితోడు సరైన వ్యూహం లేకపోవడంతో, కీలకమైన ప్రాంతాలను అతి సులభంగా శత్రువుకి వదిలేశారు. పంజాబ్ నుంచి వచ్చి చేరే బ్రిటీష్ సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా వారు చేయలేదు. దాంతో అసలు గెలిచే అవకాశం లేని బ్రిటీష్ వారు...ఈ యుద్ధంలో గెలిచే వీలును స్వయంగా విప్లవ సేనలే కల్పించారు.  నెమ్మదిగా బ్రిటీష్ వారు ఢిల్లీని గెలుచుకోగలిగారు. చివరికి సెప్టెంబర్ 20న ఇంగ్లీష్ సేనలు ఎర్రకోటలోకి ప్రవేశించాయి. ఢిల్లీ  బ్రిటీష్ వారి వశం కావడం తథ్యం అని గ్రహించగానే సిపాయిల నేత బఖ్త్ భాఖన్ ఢిల్లీ వదిలి పారిపోయాడు. అతడితో వేళ్ళేందుకు ఇష్టపడని బహదూర్ షా జఫర్ ముమాయూన్ సమాధిలో  తలదాచుకున్నాడు. బ్రిటీష్ వారు అతడికి ప్రాణభిక్ష పెట్టారు. అనంతరం బ్రిటీష్ సేనలు ఢిల్లీలో జరిపిన ఘోరకృత్యాలకు దయ్యాలు, భూతాలు కూడా భయంతో వణుకుతాయి. మొగల్ రాజకుటుంబీకులను కాల్చి చంపారు. ప్రజలను నిర్దాక్షిణ్యంగా హింసించి చంపారు. ఉరితీయబడ్డవారితో చెట్లు నిండిపోయేవి. ఢిల్లీ మొత్తం రక్తసిక్తం అయ్యింది. తెగిన మానవ అంగాలు, కలేభరాలతో ఢిల్లీ నిండిపోయింది. అయినా సరే బ్రిటీష్ వారి కసి తీరలేదు. బానిసలు...అనాగరికులు అనుకున్నవారు...తమ సార్వభౌమత్వాన్ని ధిక్కరించి దాదాపుగా ఓడించినంత పనిచేయటాన్ని బ్రిటీష్ వారు జీర్ణించుకోలేకపోయారు.  1857 తిరుగుబాటుకు నిప్పు బెంగాల్ లో రాచుకున్నా...ఆ తర్వాత ప్రజల్లో ఆసించినంత తిరుగుబాటు కాని మద్దతుగా లభించలేదని చరిత్రకారులు చెబుతారు. బెంగాల్ దాదాపు 700 ఏళ్ళు ముస్లిం నవాబులో పాలనలో ఆ తర్వాత... బ్రిటీష్ వారి పాలనలో మ్రగ్గిపోయింది. ప్లాసీ యుద్ధంలో ఓటమికి బదులు తీర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చినా...దూరదృష్టి...నాయకత్వ లోపం కారణంగా బెంగాల్ బ్రిటీష్ వారి ఎలుబడిలోనే ఉండిపోయింది. 1857  తిరుగుబాటును కూడా కలకత్తా ప్రెసిడెన్సీ కేంద్రంగా అణిచివేయడం జరిగింది. ఈ క్రమంలోనే బెంగాల్ లోనే అనేక మార్పులు సంభవించాయి.

1857 విప్లవ సమయంలో బెంగాల్ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ప్రశాంతంగానే ఉంది.  బెంగాల్ ప్రజలు  కూడా తరతరలుగా ఆచరిస్తూ వస్తున్న తమ సాంస్కృతిక మూల్యాలను తిరస్కారంగా చూస్తూ.... క్రమంగా పాశ్చాత్యమైన వాటిని అనుకరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తమను తాము కించపరుచుకొనేందుకు అలవాటు పడి ప్రతి విషయంలోనూ తాము బ్రిటీష్ వారి తర్వాతి వాళ్ళమనే భావనకు వచ్చేశారు. ఈ పరిస్థితులు బంకించంద్రచటోపాధ్యాయ...1875లో వందేమాతర గీతం రచనతో జాతిలో సరికొత్త చేతను నింపారు. ఆంగ్లేయుల దమననీతికి వ్యతిరేకంగా భారత జాతిని మరోపోరాటానికి సిద్ధం చేశారు.

-వనకళ్ల బీరప్ప కురుమ