Saturday, August 24, 2019
Follow Us on :

పర్యావరణం- భారతీయ ఆవు - 4

By BhaaratToday | Published On Jun 7th, 2019

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోవధను నిషేధించాలంటూ భారత ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో 1948లో నెహ్రూ ప్రభుత్వం పశు సంరక్షణ సంవర్ధన కమిటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగ సభలోను సంపూర్ణ గోవధ నిషేధం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. 

స్వాతంత్ర భారతంలో గోవధను సంపూర్ణంగా నిషేధించాలని ప్రజలు బలంగా కోరారు. దీంతో దిగివచ్చిన  అప్పటి ప్రధాని నెహ్రూ...గో సంరక్షణ పేరుతో కాకుండా పశు సంరక్షణ సంవర్ధన సమితి పేరుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మన దేశంలో ప్రజలందరూ సంపూర్ణ గోవధ నిషేధాన్ని కోరకుంటారని...వెంటనే ఇందుకు అవసరమైన చట్టాన్ని రూపొందించాలని ప్రత్యేక కమిటి సిఫార్సు చేసింది. పశు సంవర్ధన సమితి సిఫార్సును దృష్టిలో  పెట్టుకుని 24 నవంబర్ 1948న రాజ్యాంగసభ సంపూర్ణ గోవధ నిషేధాన్ని విధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించింది. ఈ చర్చలో సంపూర్ణ గోవధ నిషేధానికి మద్దతుగా రాకూర్ దాస్ భార్గవ్, సేఠ్ గోవిందదాస్, మహావీర్ త్యాగి, డాక్టర్ రఘువీర్, సయ్యద్ మహ్మద్ తదితరులు గట్టిగా వాదించారు.  రాజ్యాంగ అధికరణం 38 కె... ప్రకారం గోవధ నిషేధానికి చట్టాన్ని ఏర్పాటు చేయాలంటూ ఠాకూర్ దాస్ భార్గవ్ పట్టుబట్టారు. భారత దేశంలో వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు గోరక్షణ ఏకైక మార్గాం. వ్యవసాయాధార దేశంలో ఆవు కామధేనువు వంటిది. అందుకే  గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలని.. ఆవు మూత్రం, పేడల విలువ ఆవు పెంపకం ఖర్చుకంటే చాలా ఎక్కువగా ఉంటుందని తాను నిరూపిస్తానని ఆయన అన్నారు.  అటు గో సంతతి అంటే అందులో ఆవు, ఎద్దు, ఆంబోతులు అన్నీ కలిసే ఉంటాయని సేఠ్ గోవిందదాస్ రాజ్యాంగ సభలో స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకోవడం అవివేకం..! ధర్మానికి నాశనం లేదు. ఆవు ధార్మిక చిహ్నమే కాదు ఆర్థిక, సాంస్కృతిక మూలకేంద్రం కూడా.! అని గోవిందదాస్ అన్నారు.  గోవధను పూర్తిగా నిషేధించాలని..గో హత్య బ్రహ్మహత్యతో సమానం..ఇది రుషి హత్య...విజ్ఞానపు హత్య...! ఆవు మనకు తల్లివంటిది అని డాక్టర్ రఘువీర్ అన్నారు. ఇలా రాజ్యాంగ సభలో ఎక్కువమంది సభ్యులు గోవధను వ్యతిరేకించారు. మతాలకు అతీతంగా నిషేధం విధించాలని వాదించారు. కానీ జవహర్ లాల్ నెహ్రూతోపాటు మరికొంతమంది మెకాలే మానసపుత్రులు  మాత్రం గోవధ నిషేధంపై చట్టాన్ని చేసేందుకు అంగీకరించలేదు. ఈ అంశాన్ని రాజ్యాంగం ప్రాథమిక సూత్రాల్లో చేర్చడానికి బదులు మార్గదర్శక సూత్రాల్లో పేర్కొంటే చాలని అభిప్రాయపడ్డారు. దీంతో నెహ్రూ పట్టుదల వల్ల గోవధ నిషేధానికి చట్టబద్ధత లేకుండా పోయింది. గోవధ నిషేధాన్ని కోరినందుకు పురుషోత్తమదాస్ టాండన్ ను నెహ్రూతోపాటు...మార్క్స్ ,మెకాలే వాదులు మతతత్వవాదిగా ముద్రవేశారు.

గో రక్ష దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థకు సంబంధించిన అంశం. ఇప్పటికైన మన పాలకులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అప్పుడే గో సంరక్షణ పూర్తిగా సాధ్యపడుతుంది.  సురభీ నకటే...! అనాజ్ న ఘటే..! దేశ్ మే సుఖ్ భోగ్ డటే..! డపటే డర్ కో...! దిన్ ఫేర్ పితా వర్ దే..! సవితా హమ్ ఆర్యకరే భూమండల్ కో...! ఈ దేశంలో సురభి కోతకు గురికారాదు.. పంటలు తగ్గకూడదు..! సుఖసంతోషాలు తొలగకూడదు..! ఓ సూర్యదేవుడా వరం ఇయ్యి. మేం సర్వ భూమండలాన్ని ఆర్యమయం చేయాలి..!  

-వనకళ్ల బీరప్ప కురుమ