Tuesday, September 24, 2019
Follow Us on :

భారతీయ విద్యా విధానంపై ఆంగ్లేయుల కుట్రలు

By BhaaratToday | Published On Apr 5th, 2019

ఒక దేశం...సంపన్నతకి, బుద్ధి శ్రేష్ఠతకి, సంస్కార సంపదకి, మానవతా స్థాయికి, సద్గుణాలకు , సదాచారాలకు, జీవన మూల్యాలకు ఆ దేశ విద్యా విధానమే మూలాధారం అవుతుంది. భారత దేశానికి కూడా తనదైన ఒక బోధనా శాస్ర్తం ఉంది.  అది వేల సంవత్సరాల నుంచి వికసిస్తూ వచ్చింది. మన విద్యా కేంద్రాల ప్రఖ్యాతి ఒకనాడు విశ్వమంతా వ్యాపించింది. మన ఈ విద్యా బోధనా పరంపర..., ఈ జగతిలోనే శ్రేష్ఠమైందని పేరు పొందింది. మన ప్రాచీన రుషులు ఈ బోధన శాస్ర్తాన్ని శిక్షా దర్శనం అన్నారు. అయితే మన బోధన రంగం ఇప్పుడు అవ్యవస్థకు లోనైంది. వ్యక్తిగత స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడా మంచి ఫలితాలు రావడం లేదు. మన ఆలోచనా విధానమే పెడదారి పట్టింది. భారతీయ విద్యా వ్యవస్థకు ఏం అయ్యింది...? విద్య- భారతీయ దృష్టి...!

నేను.., దేహం.., ఇంద్రియాలు.., మనస్సు..., బుద్ధి..., అహంకారం, ఇవేవీ కాను...!  నేను ఆత్మను...! అని గ్రహించడమే మన అందరి జీవిత లక్ష్యం...! ఈ దృష్టితో వ్యవహారించడమే భారతీయ జీవన పద్ధతి..! దీనినే మన మహర్షులు..., రుషులు..., మోక్షం అన్నారు. ఈ మోక్ష సాధన కోసం మనం విద్యను లక్ష్యంగా చేసుకొన్నాం..! సా విద్యాయా విముక్త యే...! అని మన మన పెద్దలు ఒక్క వాక్యంలో విద్య లక్ష్యాన్ని స్పష్టం చేశారు. 

భారత దేశానికే మూలభూతమైన తత్త్వం ఆధ్యాత్మికత..! విద్యా బోధన అనగానే సర్వాంగీణ వ్యక్తిత్వ వికాసం మని అందరు చెబుతుంటారు. అంతేకాదు ఈ వాక్యం అందరికి ఇష్టమైంది కూడా..! వికాస ప్రక్రియలో శరీర వికాసం మొదటి అంశం. రెండోది ప్రాణ వికాసం..! మూడోది మానసిక వికాసం. నాలుగోది బుద్ధి వికాసం. ఇక ఐదోది ఆత్మ వికాసం..! ప్రాచీన కాలం నుంచే మన దేశంలో సమాజ రచన యావత్తూ వ్యక్తిగత గుణాలు, అవగుణాలు, సామాజిక శిష్టాచారాలు, వ్యాపారాలు, కళలు, వృత్తులు, పరిపాలన, తత్త్వ చింతన, మనోవిజ్ఞానం, రాజనీతి శాస్త్రాలు, విజ్ఞానం, తంత్రజ్ఞానం, వ్యవసాయం, వ్రతాలు, పండుగలు మొదలైనా చిన్నా పెద్ద విషయాలన్నీ కూడా ఈ జీవన దర్శనంపైనే ఆధారపడి ఉన్నాయి. విద్యా రంగంలో కూడా అన్ని శాస్ర్తాల మూల సిద్ధాంతాలలోను ఈ జీవన దర్శనం పూసలలో దారంవలె ఉంటూ వచ్చింది. జీవన దర్శనం, జీవన శాస్ర్తం, జీవన వ్యవహారం, జీవన వికాసం, విద్యా బోధన వీటిని మధ్య సామరస్యం ఉన్న కారణంగా భారత దేశం చిరంజీవి అయ్యింది. బ్రిటీషు వాళ్లు  తమ బోధన మాధ్యమం ద్వారా మన దేశానికి తీరని నష్టం కలిగించారు. వాళ్లు మొఘల్ లు లాగా విద్యాలయాలను ధ్వంసం చేయలేదు. విద్యాంసులను వధించలేదు. గ్రంథాలయాలను తగులబెట్టలేదు. పైగా విశ్వ విద్యాలయాలను స్థాపించారు. గ్రంథాలను రచింప చేశారు. విస్తృతమైన బోధన వ్యూహాలను తయారు చేశారు. కానీ విశ్వవిద్యాలయాలలోను, పాఠశాలలోనూ బోధించబడే పాఠ్యాంశాల ద్వారా, పాఠ్య ప్రణాళికల ద్వారా మన జీవన దర్శనాన్నే తారుమారు చేశారు. ఏ విషయాన్నైనా మూలంలోకి వెళ్ళి కొద్ది మార్పులు చేస్తే దాని సమగ్ర స్వరూపమే మారిపోతుంది. భారత్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రిటీష్ వారు. వారి తర్వాత మెకాలే, మార్క్స్ వాదులు ఇదే చేశారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. అటు ఐరోపా విధానం.., ఇటు భారతీయ ప్రాచీన విధానం రెండు కలగా పులగమైపోతున్నాయి. ఫలితంగా దేశంలో అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టే భారతీయ జీవన దర్శనం ఆధారంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి. 

ఇంతకీ17వ శతాబ్దంలో ఇంగ్లండులో విద్యావిధానం ఎలా ఉండేది..? బ్రిటన్ లో సండే స్కూళ్లను ఎందుకు ప్రారంభించారు...? మన దేశంలో కంటే ఇంగ్లండులోనే ఆనాడు పాఠశాలలు తక్కువగా ఉండేవా...? ఇంగ్లండులో విద్యను కేవలం ధనవంతులకు మాత్రమే బోధించేవారా...? 

భారతీయ సనాతన విద్యా విధానంపై బ్రిటీష్ వారు ఎన్నో కుట్రలు చేశారు. కట్టు కథల ప్రచారం చేశారు. ఆ అసత్య కథనాలకు తప్పుడు ప్రమాణాలను జోడించారు. అదే పనిగా రాతలు రాశారు. అబద్దాలనే నిజాలుగా నమ్మించారు. స్వాతంత్ర్య సిద్ధించి 60 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కూడా ఈ తప్పుడు కథనాలనే మనం నిజమని నమ్ముతున్నాం...! ఇంతకీ అసలు నిజం ఏమిటీ? 

భారతీయ విద్యావ్యస్థకు గురించి ఇంగ్లీషు కళ్లతో ఇండియాను చూసే మేధావులు, కుహనా సెక్యులర్ వాదులు, జాతీయ చింతన లేని జాతీయ నాయకులు, మార్క్స్ వాదులు అదేపనిగా అబ్దాలను ప్రచారం చేశారు. మన దేశంలో ఆధునిక విద్య అనేది ఇంగ్లీషువాడు మనకు పెట్టిన భిక్ష...! బ్రిటీష్ వాళ్లు  దేశంలో అడుగు పెట్టక ముందు....ఇక్కడ విద్య ఉన్నా...అది ప్రధానంగా బ్రాహ్మణుల చేతిలో వుండేదని.., ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థను సుస్థాపితం చేసేందుకే ఈ విద్యను వాడుకున్నారని కట్టుకథలు అల్లారు. ఇతర కులాల వారిని విద్యకు , విజ్ఞానికి దూరం పెట్టారని అభియోగాలు మోపారు. అంతేకాదు తెల్లవాళ్లు ఈ దేశంలో అడుగు పెట్టి యావద్భారతాన్నీ ఏకచ్ఛత్రం కిందకి తెచ్చి ఇంగ్లీషు బడులు తెరిచారని ఇది మన అదృష్టమని మార్క్స్ , మెకాలే మానసపుత్రులు చెబుతుంటారు. మనకు ఇంగ్లీషు నేర్పించి మన జాతిని ఉద్ధరించారని అంటారు. ఇంకా కొంతమంది అయితే మన దేశంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు బ్రిటీష్ వారు ఎన్ని పాపిష్టి పనులు చేసినా... స్వరాజ్యం కావాలన్నా వారిపై దమన నీతికి పాల్పడ్డా కూడా ఆంగ్లేయుల పాలనతో దేశానికి కొంత మేలు జరిగిందని అంటారు. తమ పరిపాలన నడపటానికి కావలసిన గుమాస్తాలను తయారు చేసుకోవాలన్న స్వార్థంతోనే అయినా మన జనసామాన్యానికి ఆధునిక విద్యబుద్ధులు నేర్పించారని..., ఆంగ్ల భాషతో, ఆంగ్ల సారస్వతంతో పరిచయం ఏర్పడిందని..., అభ్యుదయ భావాలను అలవరచుకున్నాక విద్య ఎలా ఉండాలో, దాని పరమార్థమేమిటో మనకు తెలిసిందని...విద్య అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిందని ఈ మేధావి గణం లెక్చర్లు దంచేస్తారు.  ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కాలేజీ వరకు ఈ అసత్యాలనే మనకు బోధిస్తున్నారు.  క్రీ.శ.1822వ సంవత్సరం...! అప్పటికి ఇంకా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం..! అదే మన వామపక్ష మేధావులు పేర్కొనే సిపాయిల తిరుగుబాటు ఇంకా జరగలేదు. పెత్తనం అంతా ఇంకా ఈస్టింయా కంపెనీ చేతుల్లోనే ఉంది. నైజాం మినహా ఆంధ్ర ప్రాంతం అంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. దీనికి సర్వాధికారి గవర్నర్ , ఈ పదవిల సర్ థామస్ మన్రో ఉన్నారు. మనది పాములు పట్టి ఆడించే దేశమని...ఈ దేశ ప్రజలు అజ్ఞానులని అప్పటికే ఈస్టిండియా కంపెనీ ఇంగ్లండులో ప్రచారం చేసింది. తమ ప్రచారానికి అనుగుణంగా మన విద్యా విధానంపై సమగ్ర సర్వే చేయాలని ఈస్టిండియా కంపెనీ అధికారులకు ఆయన  జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన బ్రిటీష్ అధికారులు ఉత్తరాన గంజాం నుంచి దక్షిణాన తిన్నెవెల్లి వరకు..అటు పశ్చిమాన మలబారు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా పాఠశాలల, ఉన్నత విద్యా సంస్థల వివరాలను వాటి వివరాలను సేకరించారు. ఈ వివరాల నివేదికలను చూసిన తర్వాత బ్రిటిష్ అధికారుల మతి పోయింది. ఇంతకాలం తాము అనాగరికులు, మూర్ఖులు , విద్యాగంధం లేని అజ్ఞానలని పాశ్చాత్య మేధావులు ప్రచారం చేస్తున్న భారతీయులు విద్యాలో ఇంగ్లీషు వారి కంటే ఎంతో ముందున్నారని రుడీ అయ్యింది. అసలు నిజం ఏమిటంటే నవనాగరికమని...బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటున్నట్లుగా, ఇంగ్లండులో ఆనాడు విద్య అందరికీ దొరికే వస్తువు కాదు. కులీనులు, సంపన్నులు, అయిన పెద్ద మననుషుల పిల్లలకు మాత్రమే విద్యను బోధించేవారు.  రైతు కొడుకు పొలం పనిచేయాలి. చేతి పని కుమారుడు తండ్రి వృత్తినే కొనసాగించాలి. పెద్ద మనుషుల పిల్లలు విద్య నేర్చి పరిపాలనా బాధ్యతలు నిర్తర్తించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. ఎవరికి పడితే వారు స్కూళ్లకు పోవడం కుదరని ఇంగ్లీషు రాజులు 16వ శతాబ్దంలో ఏ శాసనమే చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి  ఇంగ్లండ్ పరిస్థితిలో మార్పు వచ్చింది. కనీసం బైబిల్ చదవగలిగే  మేరకైనా అన్ని వర్గాలవారి చదువు నేర్పించాలని చారిటీ స్కూళ్ల ఉద్యమం కొన్నాళ్లు నడిచింది. క్రైస్తవ మిషనరీల చొరవతో ప్రతి బిడ్డా బైబిలును చదవగలగాలన్న ధ్యేయంతో పాప్యులర్ ఎడ్యుకేషన్ పేర సన్ డే స్కూల్ ఉద్యమం 1780 ప్రాంతాల్లో మొదలైంది. ఆ తర్వాత కాల క్రమంల ఒక్క ఆదివారమే గాక మిగతా రోజుల్లోనూ చదువు చెప్పే పద్ధతి ప్రారంభమైంది. ఇక మన్రో మన దేశంలో సర్వే చేయించే నాటికి....1834లో ఇంగ్లండులో ఉన్న స్కూళ్ల సంఖ్య భారత్ కంటే చాలా తక్కువ...! వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచు. అది కూడా ఆయా పాఠశాలలో క్రైస్తవ మత బోధన...కొంచెం కొంచెంగా గణితం బోధించేవారు. ఇంకా కొన్ని స్కూళ్లలో అయితే చదవడమే తప్ప రాయడం నేర్పేవారు కాదు. రాయడం నేర్పితే ఇంగ్లీష్ పిల్లలు చెడిపోతారని భయపడేవాట..! 

క్రీ.శ.1822-26 మధ్యకాలంలో బ్రిటిష్ వారు మన దేశంలో చేసిన సర్వేలు...వాటికి సంబంధించిన రికార్డుల ప్రకారం...మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉన్నది. ఆయా పాఠశాల్లో  విద్యను నేర్చుకునేది కేవలం బ్రాహ్మణ విద్యార్థులే కాదు...మిగిలిన అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాదు సంస్కృతంతో పాటు ప్రాంతీయ భాషల్లోను విద్యా బోధన జరిగేది.

19వ శతాబ్దంలో మన దేశంలోని దేశీయ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల కులాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నేడు ప్రచారంలో ఉన్న చదువులపై అగ్రకులాల గుత్తాధిపత్యం మొదలైన అనేక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆధారాలు 1822లో బ్రిటీష్ వారు జరిపిన సర్వే రికార్డుల్లో కనిపిస్తాయి. మన దేశీయ విద్యావిధానంలో నిమ్నకులాలకు విద్య పూర్తిగా అందుబాటులో ఉండేది. అగ్రకులాల విద్యార్థుల కంటే నిమ్న కులాల విద్యార్థులే ఎక్కువ. ఉపాధ్యాయులు కూడా అన్ని కులాలకు చెందినవారు ఉండేవారు. పైగా మన విద్యా విధానం బ్రిటీష్ విద్యా విధానం మాదిరిగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు...! ఆనాడు మన దేశంలోని విద్యాలయాల ఖర్చును , విద్యార్థుల పోషణను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలే స్వచ్చందంగా భరించేవారు. అంతేకాదు కులాల పేరుతో ప్రత్యేక పాఠశాలు లేవు. బ్రాహ్మణులు, ఇతర వర్గాల ప్రజలు అందరూ ఒకే పాఠశాలలో చదివేవారు. ఐతే ఆధ్యాత్మికతకు సంబంధించిన కొన్ని శాస్త్రాలను మాత్రం తమ కుల ఆచారంలో భాగంగా బ్రాహ్ముణులు ఎక్కువగా నేర్చుకునే వారు. ఈ శాస్త్రాల లో మిగిలిన వర్గాల విద్యార్థులు సంఖ్య కాసింత తక్కువగా ఉండేది.  మిగిలిన వృత్తి విద్యలకు సంబంధించిన శాస్ర్తలలో బ్రాహ్మణ విద్యార్థుల కంటే ఇతరు కులాల విద్యార్థులే ఎక్కువగా ఉండేవారు. ఈ విషయాలను దాచి మన దేశంలో బ్రాహ్మణులదే విద్యపైనా గుత్తాధిపత్యం ఉండేదనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  బ్రాహ్ముణులపై ద్వేషం కలిగిలా ఇతర కులాలవారిలో విష బీజాలు నాటారు.  బ్రిటీష్ వారు రాక ముందు మన దేశీయ విద్యావిధానంలో ప్రాంతీయ భాషకు ప్రాముఖ్యం ఉండేది. ఆయా ప్రాంతాల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరిగేది. ఇంగ్లీష్ భాష రాకతో మన దేశంలో ప్రాంతీయ భాషలు మూలన పడ్డాయి. కానీ మన దేశంలో క్రైస్తవ మిషనరీలు వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రచురించిన పదకోశాలు, వ్యాకరణం మొదలైన గ్రంథాలను చూసి వాళ్ళు మన ప్రాంతీయ భాషలకు చాలా సేవ చేశారని కొందరు భావిస్తారు. కానీ ఈ రచనలు మత ప్రచారానికి, తమ పాలన సౌలభ్యం కోసం చేశారు. ఈ రచనలతో ప్రాంతీయ భాషలకు మేలు కంటే కీడు ఎక్కువగా జరిగింది. ఇప్పుడైతే మాతృభాషలో విద్యా అనేది అందని ద్రాక్ష..! ఇంగ్లీషులో చదవకపోతే వెనుకబడిపోతామనే ఒక భ్రమను వ్యాపింప చేశారు. మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించాలన్న విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.  

జాతీయతా నిర్మాణానికి విద్యా బోధన శక్తిమంతమైన సాధనం. విద్యా బోధన జాతీయ జీవన దర్శనం ఆధారంగా ఉన్నప్పుడే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మన దేశంలో విద్యా బోధన ఇంకా ఫలప్రదం కావాలంటే... భారతీయ జీవన దర్శనం ఆధారంగా ఉండడం ఎంతైన అవసరం. పాఠశాలలో ఆచార్యాలు శిష్యులకు బోధన చేసినా, ఇంట్లో పిల్లవాడికి తల్లిదండ్రులే పాఠాలు చెప్పినా, సమాజానికి సాధసంతులు మార్గదర్శనం చేసినా, భారతీయ జీవన దర్శనమే వీటన్నిటి సారంగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆ దిశగా మన ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజలు కూడా అందుకోసం ఉద్యమించాలి. మనదైన దేశీయ విద్యను సాధించాలి. 

-వనకళ్ల బీరప్ప కురుమ