Thursday, September 19, 2019
Follow Us on :

జగత్ జననీ..

By BhaaratToday | Published On May 11th, 2019

అమ్మ లేకపోతే ఈ సృష్టికి అస్తిత్వమే లేదు. సృజనకూ ఆస్కారమే లేదు. ఆకలికి ఉపశమనమే లేదు. అనురాగానికి ఉనికే లేదు. ఆమె లేకపోతే...ప్రేమ కూడా ఒక భ్రాంతి మాత్రమే అవుతుంది. బీటలు వారిన మరుభూమి లాంటి పురుష ప్రపంచంలో ఓ అమృత బిందువు అమ్మ...! ప్రతి తల్లీ తన బిడ్డల్ని దయార్ద్ర దృష్టితో చూస్తుంది. అందుకే మన హిందూ ధర్మం ఆమెను జగజ్జనని అంశంగా పేర్కొని పూజిస్తుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే...! 

‘స్త్రీ’ అంటే ‘శ్రీ’ వంటిదనీ, ఆమె సకల వైభవాలకు మూలమనీ వేదాలు మొదలుకొని, ఆధునిక గ్రంథాల వరకు అన్ని వాఙ్మయాలూ ఘోషిస్తున్నాయి. ఈ సృష్టిలో స్త్రీ మహిమ వర్ణనలకు అందనిది. ‘ఎక్కడ నారీమణుల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషంతో, సంతృప్తితో సంచరిస్తారు...! ఎక్కడ మహిళామణులకు అవమానం జరుగుతుందో అక్కడ అన్ని పనులూ నిష్ఫలమై పోతాయి...! ఏ ఫలితమూ దక్కదు’ అని హిందూ ధర్మ శాస్ర్తాలు చెబుతున్నాయి. 

మానవ సృష్టికి బ్రహ్మ సంకల్పం మూలం అయితే మాతృగర్భం కారణం అవుతుంది. ముత్యం ఆవిర్భవించడానికి శుక్తి..., ముత్యపుచిప్ప ఎలా కారణం అవుతుందో అలాగే మానవసృష్టికీ తల్లికడుపు అనే శుక్తి మూలం.  స్త్రీ లేకుంటే నేడు మానవజాతి ఉండేదేకాదు. ఆమె ఈ సృష్టిలో ఎంతటి విశిష్టురాలో అర్థం చేసుకోవచ్చు. అందుకే మన వేదాలు..... మొదటి నమస్కారాన్నితల్లికే చేయాలని చెబుతున్నాయి. బాల్యంలో కూతురిగా, కౌమారంలో చదువుల తల్లిగా, యౌవనంలో ధర్మపత్నిగా, వార్ధక్యంలో తోడునీడగా ఉండే స్త్రీ జన్మ సార్థకమే కాదు విశ్వకల్యాణకారకం కూడా. లోకంలో జరిగే  పెళ్ళిళ్లకు అన్నింటికీ, స్త్రీ మాత్రమే మూలం అంటే అతిశయోక్తి కాదు.  వివాహం అయిన తరవాత గృహలక్ష్మిగా భర్త ఇంటిలోకి అడుగుపెట్టిన వనిత జీవితాంతం వరకు ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. సేవకురాలై ఇంటిపనులన్నీ చేస్తుంది. ఇంటిబాగోగుల గురించి ఒక మంత్రిలా ఆలోచిస్తుంది. లక్ష్మీదేవిలా ఆభరణాలు ధరించి గృహిణిగా కన్నుల పండుగ చేస్తుంది. భూదేవిలా సహనంతో అన్నీ ఓర్చుకొంటుంది. కుటుంబసభ్యులకు, అతిథులకు అన్నంపెట్టే సమయంలో తల్లిలా కారుణ్యం ప్రదర్శిస్తుంది. భర్తతో సాంసారిక సౌఖ్యంలో అనురాగవతిగా అల్లుకొనిపోతుంది. కనుక స్త్రీ మహిమ వర్ణనలకు అందనిదని విష్ణుశర్మ పంచతంత్రంలో అంటాడు. ఏ ఇంటిలో భర్త.... భార్యను సంతోషంగా చూసుకుంటాడో... ఆ ఇంటిలో సకలకల్యాణ గుణపరంపరలు తాండవిస్తాయనీ, ఆమెను దుఃఖానికి గురిచేస్తే అన్ని సంపదలూ నశించిపోతాయని మను ధర్మ శాస్ర్తం చెబుతోంది. స్త్రీ అంటే బంగారు ముద్దవలె సంపన్నురాలనీ, చంద్రుడు ఆమెకు పవిత్రతను కలిగిస్తే, గంధర్వులు వినసొంపైన పలుకులను ప్రసాదిస్తారనీ, అగ్నిదేవుడు తళతళ మెరిసే కాంతిని ఆమెకు అందిస్తాడనీ నీతికోవిదులు పేర్కొన్నారు. ఈ లోకంలో మహాత్ములు, మహాపురుషులు చిన్నతనంలో తల్లివల్ల శిక్షణ పొందినవాళ్లే. తల్లి ప్రమేయం లేకుండా సౌజన్యం, సౌశీల్యం, సాత్వికత లభించడం కష్టం. అసలు స్త్రీ అంటేనే కారుణ్యానికి ప్రతీక. ఆమె కరుణతోనే ఈ ప్రపంచం చల్లగా వర్ధిల్లుతోంది. చరిత్రలన్నీ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. విశ్వసంక్షేమం స్త్రీ మూర్తి కారణంగానే సంభవం. ఆమె లేని ప్రపంచం ఎడారి వంటిదే. ఆమె ఉన్న జగత్తు నందనవనం. ఆమె కరతలమే అక్షయపాత్ర. ఆమె చూపే సంజీవని. ఆమె పలుకే అమృతం. ఆమె చరితం ధన్యం. అందరినీ ఆదరించి, అన్నం పెట్టే గృహిణి లేని ఇల్లు ఎన్ని సంపదలున్నా అడవితో సమానమే అని పెద్దలు అంటారు. సహధర్మచారిణి అయిన స్త్రీ లేకుండా ఏ ఇంటిలోనూ శుభకార్యాలు చేసే అధికారం పురుషుడికి లేదని వేదం చెబుతోంది. దీనివల్ల మన హిందూ ధర్మం....ప్రాచీన రుషులు...గ్రంథాలు  స్త్రీకి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చాయో గ్రహించవచ్చు. 

విదేశాల్లో పర్యటిస్తున్న స్వామి వివేకానందను అక్కడి....ఓ మహిళా తనదైన శైలీలో ప్రశ్నించింది. మహిళల విషయంలో మీ దేశానికి...ఇక్కడి పాశ్చాత్య ప్రపంచంలోని ధోరణుల్లో ఉన్న భేదం ఎలాంటిదని అడిగింది. దాంతో వివేకానందుడు....‘తల్లీ! మీ దేశాల్లో స్త్రీని భార్యగా గౌరవిస్తారు. మా దేశంలో స్త్రీని మాతృమూర్తిగా ఆరాధిస్తారు!’ అని వినయంగా జవాబిచ్చాడు. స్త్రీశక్తిని దేవతగా ఆరాధించడం సనాతన హిందూ సంప్రదాయం. అయితే ఇప్పుడు... ఆధునిక నాగరికతా ప్రవాహంలోని వికృతుల మూలంగా ఈ ప్రాచీన సంప్రదాయం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

స్త్రీశక్తిని దేవతగా ఆరాధించడం సనాతన సంప్రదాయం. ప్రపంచాన్ని కాంతిమంతంగా, శాంతిమంతంగా నేత్రపర్వం గావించేది స్త్రీమూర్తి. శక్తిరూపంలో ఉండే పరబ్రహ్మను షోడశి- ‘శ్రీవిద్యా, పంచదశాక్షరీ, మహాత్రిపురసుందరీ, బాలా, అంబికా, బగళా, మాతంగీ, స్వయంవరా, కల్యాణీ, భువనేశ్వరీ, చాముండీ, వారాహీ, శ్యామలా, అశ్వారూఢా, సావిత్రీ, గాయత్రీ, సరస్వతీ, బ్రహ్మకళికా’ మూర్తులుగా ఉపనిషత్తులు అభివర్ణించాయి. ఈ ప్రాథమిక సత్యంపై ఆధారపడి శాక్తేయులు వేదాధ్యయనం గావిస్తారు. శ్రీ, దుర్గా, దేవీ, రాత్రీ సూక్తాలతో శాక్తేయులు దేవ్యారాధన గావిస్తారు.  శ్రీ సూక్తం మహాలక్ష్మిని శక్తి స్వరూపిణిగా చెబుతుంది. లక్ష్మిని మనకు ప్రసన్నం అయ్యేట్లు చేయమని అగ్నిదేవుణ్ని శ్రీ సూక్తం అర్థిస్తుంది. నారాయణి విశ్వమాత. సంపదకు, సంతోషానికి, దివ్యజ్ఞానానికి, సకల శుభాలకు ఈ తల్లినే ఆరాధిస్తారు. దుర్గాసూక్తం దేవిని అగ్ని స్వరూపిణిగా భావిస్తుంది. అశుభాలను హరించి, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని దుర్గాసూక్తం ద్వారా ప్రార్థిస్తారు. సంసార సముద్రాన్ని తరించడానికి తోడ్పడే తల్లి దుర్గ. పరబ్రహ్మతో అద్వైతానుభూతిని ప్రసాదించేది దేవీసూక్తం. ఈ శక్తి దేవిని వేదాల్లోని మహావాక్యాలకు ప్రత్యక్ష రూపంగా భావించి ఆరాధిస్తారు. ఉషాదేవిని గురించి చెప్పింది రాత్రీ సూక్తం. రాత్రిని శక్తి స్వరూపిణిగా భావించి, అజ్ఞానాన్ని తొలగించమని, సత్యార్థ ప్రకాశాన్ని ప్రసాదించమని ఉషాదేవిని చేసే ప్రార్థన ఇది. రాత్రి ఎప్పుడూ ఉదయం వైపే పరుగిడుతుంది. చీకటిలోంచే వెలుగు పుడుతుంది. ఇతిహాసాల్లో సీత, సావిత్రి, ద్రౌపది ఇత్యాది పాత్రలు విశిష్టమైనవి. నారీలోకానికి ఈ పాత్రలు ఆదర్శం. రావణుడి చెర ఒక అగ్ని పరీక్ష. ఆ కఠిన పరీక్షలో ఉత్తీర్ణురాలైన సీతాదేవిని దేవతగా ఆరాధిస్తాం. యముడితో వాదించి, భర్త ప్రాణాలు తిరిగి పొందింది సతీ సావిత్రి. స్త్రీశక్తికి సతీసావిత్రి చక్కని ఉదాహరణ. ఇంకా పట్టుదలకు, ప్రతాపానికి పురుషులకు దీటైన మహిళామణులెందరో ఉన్నారు. రాణి రుద్రమదేవి, కేలడి చెన్నమ్మ, జీజియామాత, 
సమ్మక్క-సారక్క...ఇంకా జోహార్ లో ఆహుతలైన ఎందరెందరో స్త్రీమూర్తులు మహిళాశక్తికి నిదర్శనాలు. వారందరూ మనకు పూజనీయులు.

ప్రతి తల్లీ తన బిడ్డల్ని దయార్ద్ర దృష్టితో చూస్తుంది. విరాట్ శక్తిని...మాతృభావంతో శాక్తేయులు ఆరాధిస్తారు. అడిగింది కాదనకుండా ఇస్తాందని... అమ్మపైనా అందరికీ అపార విశ్వాసం ఉంటుంది. ఆమె దయామయి...సర్వమయి...! ప్రాచీన కాలం నుంచి కూడా  దేశాన్ని తల్లిగా పూజించడం..., మాతృభూమిగా ఆరాధించడం.....సంప్రదాయంగా వస్తోంది. 

మనందరికీ ఈ దేశం కూడా మాతృమూర్తియే...! మనం మన మాతృభూమిని  భారతమాతగా ఆరాధిస్తాం. మహర్షి అరవిందులు కూడా భారతదేశాన్ని మహాశక్తిగా జగన్మాతగా భావించారు. పూజించారు. ఆయన దృష్టిలో దేశభక్తికి....దైవభక్తికి మధ్య అంతరం లేదు. ఈ జగజ్జనని అయినా భారత మాతను స్వార్థరహితంగా అర్చించాలని ఆయన అన్నారు. దేశాన్ని తల్లిగా భావన చేసిన వెంటనే మన మనస్సులో పవిత్రభావం, భక్తిభావన పుట్టుకొస్తాయి. బంకించంద్రుడు కూడా తన వందేమాతరం గీతంలో భారత మాతను దుర్గమాతగా, సకల విద్యాదాయనిగా...కొలిచారు. ఆయన రచించిన ఈ వందేమాత గీతం భారత జాతిని తట్టిలేపింది. మనకు అమ్మ ఒడి...తొలి బడి..! జీజాబాయి...వీర మాత...! తన కుమారుడైన శివాజీని....హిందూ ధర్మసంరక్షణ కోసం మహావీరుడిగా తీర్చిద్ధింది. దేశం నుంచి మొగలుల పాలనను అంతం చేసి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించేలా అతనిలో ప్రేరణ నింపింది. వీరమాత జీజాబాయి ఒడిలో చదువుకున్న ఛత్రపతి శివాజీ సచ్ఛీలుడయ్యాడు. అంతేకాదు భవానీమాత కరుణా కటాక్షానికి పాత్రుడయ్యాడు. శివాజీ సౌశీల్యం గురించి మనకు చరిత్రలో ఓ కథ కూడా ఉంది. ఓ దుర్గాన్ని శివాజీ  సైన్యం జయించింది. అప్పుడే ఆ కోటలో బీజాపూర్ రాజ కుటుంబానికి చెందిన ఓ అందమైన కన్య వారి కంటపడింది. ‘శివాజీకైతే తగిన జోడు’ అని భావించిన మరాఠా సర్దార్... ఆమెను బంధించి  శివరాయుడి ముందు ఉంచారు. ఛత్రపతిని చూసి ఆమె వణికిపోయింది. కానీ శివాజీకి మాత్రం ఆమెను చూస్తే... తన తల్లి జిజియాబాయి గుర్తుకొచ్చింది. ‘అమ్మా’ అని ఆ యువతిని సంబోధించాడు. తన సేనాధిపతి చేసిన తప్పును క్షమించమని వేడుకొన్నాడు. ఆమెను సగౌరవంగా తిరిగి బీజాపూర్ లోని తమ బంధువుల ఇంటికి పంపాడు. మన భారతీయులందరూ పరస్ర్తీలను వారి పేరు చివరన అమ్మ అనే సంబోధిస్తారు.ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.  శాలివాహన శకకర్త శాలివాహనుడు...తనను తాను గౌతమి పుత్రుడుగా పేర్కొన్నాడు. రామకృష్ణ పరమహంస ‘జగజ్జనని బడి’లో చదువుకున్నారు. ఆ గురువు అడుగుజాడల్లో నడచినవారు వివేకానందులు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ‘స్వామీ! స్త్రీల పట్ల మీ దేశానికి, ఇతర దేశాలకు ఉండే అభిప్రాయాల్లో భేదం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. ‘మీ దేశాల్లో స్త్రీ అంటే భార్య. మా దేశంలో స్త్రీ అంటే తల్లి’ అని వివేకానందస్వామి సూటిగా సమాధానమిచ్చారు. ఇంకా ఒక సంపూర్ణ పవిత్ర భారత స్త్రీమూర్తిని ఈ ప్రపంచం సీతమ్మ తల్లిలో చూడవచ్చు. మంచికి, స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరుగా ఆమెకనబడుతుంది. ఆమె సహనాన్ని, కష్టమయ గాథను స్మరించినంత మాత్రాన కన్నులు చెమ్మగిల్లుతాయి. సీతమ్మ తల్లి ఔన్నత్యం ముందు పురుషుడి పాత్ర నిలవలేదు.  ప్రాచీన కాలంలో స్త్రీలను గౌరవించలేదనీ, ఆధునిక యుగంలో అమితంగా గౌరవిస్తున్నామనీ కొందరు భ్రాంతి పడుతుంటారు. వేదకాలంలో మైత్రేయి, గార్గి మొదలైన విదుషీమణులు బ్రహ్మపదార్థాన్ని గురించి లోతైన చర్చలు గావించారు. మహర్షులతో దీటుగా నిలిచారు. గార్గి యాజ్ఞవల్క్య మహర్షితో వాదించగలిగింది. మధ్యయుగాల్లో ముస్లిం దండయాత్రల కారణంగా మనల్ని ఆవరించిన అంధకారం... స్త్రీ గౌరవాన్ని అధఃపాతాళానికి నెట్టివేసింది. ఎందరెందరో మాతృమూర్తులు..తమ శీల సంపదను కాపాడుకునేందుకు...జోహార్ అంటూ అగ్నికి ఆహుతయ్యారు. 

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’... ! అమ్మ అంటే అమృతం. ఆ నిర్వచనం కన్నతల్లితో పాటు జన్మభూమికీ వర్తిస్తుంది. మన జన్మభూమి సర్వశ్రేష్ఠ. భవిష్యత్‌ ద్రష్ట. అందుకే తన తరతరాల, యుగయుగాల తన బిడ్డలకోసం శాశ్వతంగా తనను తాను ఓ రత్నగర్భగా మలచుకొంది భారత మాత..! మన స్ర్తీశక్తిని...అమ్మగా ఆరాధించినంత కాలం...మనకు జయమే...! 

-వనకళ్ల బీరప్ప కురుమ