Thursday, September 19, 2019
Follow Us on :

పరశురాముడి జయంతి - 1

By BhaaratToday | Published On May 7th, 2019

అది పౌరాణిక కాలం...! చాలా మంది రాజులు..., భారతీయ సమాజానికి కంటకులుగా తయారయ్యారు..!  ప్రజల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని నిరంకుశంగా దేశాన్ని పాలిస్తుండేవారు..!  సనాతన భారతీయ సంస్కృతిని పాటించే ప్రచారం చేసే రుషులను, మునులను, ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దైవ స్వరూపుడైన ఒక మనిషి ఈ భూమిపై అవతరించాడు. తన పరశువును ఎత్తి...భూమండలంలోని ప్రజకంటకులైన రాజులందరిని 21 సార్లు సంహరించాడు..! ఆ మహా పరాక్రమవంతుడైన పుణ్యపురుషుడే పరశురాముడు...! పరశురాముడు..!

చేతిలో గండ్రగొడ్డలి...! అంతేకాదు ఆజానుబాహుడు..! బలిష్టమైన దేహం...! అతని పొడవు కూడా ఎక్కువే...! పైగా బ్రాహ్మణుడు...! 22 సార్లు భూ ప్రదక్షిణం చేశాడు. ప్రజలను పీడించే క్షత్రియ రాజులను అంతమొందించాడు. 

పరశురాముడికి సంబంధించి మన పురాణాల్లో అనేక కథలు మనకు కనిపిస్తాయి. త్రేతాయుగంలో సీతారాముల వివాహ సమయంలో మనకు పరశురాముడు కనిపిస్తాడు. మహాభారతంలోనూ పరశురాముడు మనకు దర్శనమిస్తాడు. భీష్ముడు..., కర్ణుడు కూడా పరశురాముడి వద్ధనే శస్ర్త విద్యులు  నేర్చుకున్నట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. రామాయణ కాలం నుంచి మొదలు పెట్టి మహాభారత కాలం వరకు ఒక ప్రవాహంగా నిలిచిన మాతా - పితృభక్తుడు, మహా పరాక్రమశాలి, పరశురాముడు..! ఇక పరశురాముడి జన్మవృత్తాంతానికి వస్తే..., పూర్వకాలంలో రుచికుడు అనే ఒక రుషి తనకు భార్య కాదగిన వధువు కోసం దేశమంతటా పర్యటించాడు. ఆ సమయంలో మన భారత దేశాన్ని రెండు ప్రసిద్ధ రాజవంశాలు పాలిస్తుండేవి. అవి ఒకటి సూర్యవంశము, రెండోది చంద్రవంశం.  గాధి అనే రాజు చంద్రవంశపురాజు..! ఆయనకు సద్గుణాల రాశి అయిన కుమార్తె ఉండేది. ఆమె పేరు సత్యవతి.! అదే సమయంలో యవ్వనవతి అయిన తన కుమార్తెకు తగిన వరుని కోసం గాధి రాజు వెతుకుతున్నాడు. అటు రుచికుడు కూడా గాధి రాజ్యానికి వచ్చాడు... ఈ విషయం తెలుసుకున్న రాజు ఆయనకు కెదురేగి రాజసభకు తీసుకువచ్చారు. సకల సపర్యలు చేశాడు. రాజు చేసిన అతిథి మర్యాదకు రుచికుడు ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత  ఓ మహారాజా నేను నీ వద్దకు ఒక కోరిక తో వచ్చాను. నీవు దాన్ని పూర్తి చేయగలవా..?  అని ప్రశ్నించాడు. దాంతో రాజు... పూజనీయ మహర్షీ..! మీకు సంతోషం కల్గించడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధం. మీ కోరిక ఏమిటో సత్వరమే తెలియజేయండి అంటూ వాగ్దానం చేశాడు మహారాజు. రాజు అడగడంతో... రుచికుడు ఓ రాజా నేను మీ కూతురు సత్యవతిని వివాహమాడాలనుకుంటున్నాను అంటూ తన కోరిక బయటపెట్టాడు రుచికుడు.   రుచికుడి మాటలు రాజుకు దిగ్ర్బాంతి కలిగించాయి. మొదట్లో తనకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవాలనే ఆలోచన మనస్సులో మొదిలింది. రాజభవనంలో సర్వసుఖాల మధ్య పెరిగిన తన కూతురును బీదరికంలో మ్రగ్గే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేయడానికి అతని మనస్సు  ఇష్టపడలేదు. దాంతో ఒక ఆలోచన చేశాడు. ఋషికి మాట ఇచ్చాను కాబట్టి...దాన్ని నిలబెట్టుకోవాలి...!  చాలా ఆలోచించిన తర్వాత గాధి రాజు...తన కుమార్తెను రుచికుడికి ఇచ్చి...వివాహం చేయడానికి ఒక షరతు పెట్టాడు. ఆ షరతును ఒప్పుకున్నట్లైతేనే వివాహం జరుగుతుందని చెప్పాడు. కట్నం క్రింద ఒక చెవి నల్లగా ఉండి, మిగిలిన శరీరమంతా తెల్లని రంగు గల వేయి గుర్రాలను మీరు నాకు ఇవ్వాలంటూ షరతు ను బయటపెట్టాడు.  ఇటు రుచికుడు కూడా రాజు షరతుకు అంగీకరించాడు. వెంటనే తపస్సు ప్రారంభించాడు. వరణదేవుడిని మెప్పించాడు. అతని ద్వారా తనకు అవసరమైన వేయి గుర్రాలను పొంది...వాటిని గాధి రాజుకు సమర్పించాడు. దాంతో తనకు కాబోయే అల్లుడి శక్తిని గ్రహించిన గాధి రాజు...రుచికుడికి తన కుమార్తె సత్యవతిని ఇచ్చి వివాహం చేశాడు.  అయితే గాధి రాజుకు కుమారులు లేరు. దాంతో ఒక రోజు...సత్యవతి తనకు తన తల్లికి పుత్ర సంతానం కలిగేట్లు అనుగ్రహించమని కోరింది. రుచికుడు ఒక మూలికతో రసాన్ని తయారు చేసి ఇద్దరికీ వేర్వేరుగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిన రసం వారే తాగాలని చెప్పాడు. అయితే తన కూతురికి ఇచ్చిన మూలికా రసంలో ఏదో విశేషం ఉంటుందని భావించిన సత్యవతి తల్లి... ఆ రసాన్ని తాను త్రాగింది. తన రసాన్ని కూతురుకు ఇచ్చింది. తర్వాత కొంతకాలనికి ఇద్దరు గర్భవతులు అయ్యారు. తన భార్య ముఖంపై క్షత్రియ తేజస్సును గమనించిన రుచికుడు ఆశ్చర్యపోయాడు. తన దివ్యదృష్టితో విషయం తెలుసుకొని దాన్ని సత్యవతికి తెలియజేశాడు. తన కుమారుడు రుషిగాను, తనకు కాబోయే మనవడు పరాక్రమవంతుడిగాను జన్మించాలని ఆమె అతన్ని పార్థించింది. రుచికుడు కూడా అలాగే ఆమెను దీవించాడు.  రుచికుడి కుమారుడే జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇతడే చేత గండ్రగొడ్డలి ధరించి భూమండలం ప్రదక్షిణం చేశాడు. ప్రజకంఠకులుగా మారిన క్షత్రియ రాజులను సంహరించి శాంతిని స్థాపించాడు. 

-వనకళ్ల బీరప్ప కురుమ