Monday, November 18, 2019
Follow Us on :

భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదట..!

By BhaaratToday | Published On Oct 15th, 2019

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదట..! ఆ విషయాన్ని భూమా అఖిలప్రియనే చెప్పుకొచ్చారు. తన భర్త భార్గవ రామ్‌‌పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని.. ఫ్యాక్షన్ కేసులకే భయపడనివాళ్లం... ఇలాంటి కేసులకు భయపడుతామా? అని ప్రశ్నించారు. గతంలో తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కూడా ఇలాగే కేసులు పెట్టి.. లేని పోని ప్రచారాలు చేశారని అన్నారు. ఇప్పుడు తన భర్తను టార్గెట్ చేశారని ఆరోపించారు. 

పారిపోవాల్సిన ఖర్మ తన భర్తకు పట్టలేదని.. ఒక చిన్న గొడవను హత్యాయాత్నం కేసుగా మార్చేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని అన్నారు. ప్రైవేటు వాహనాల్లో మఫ్టీలో వస్తే.. వాళ్లు పోలీసులేనని ఎలా తెలుస్తుందన్నారు. పోలీసులు ఆంధ్రా నుంచి ప్రైవేట్ వాహనంలో రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులేనన్న విషయం పోలీసులకు కూడా తెలుసన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ అన్నారు. క్రషర్ వివాదం సివిల్ విషయమని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. తప్పుడు కేసులు బనాయించడం, ఆస్తులు లాక్కోవడం వంటి పనులకు తాము ఎప్పుడూ పాల్పడలేదని ఆమె అన్నారు. 

 తన భర్తపై కేసులు పెట్టిన వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని అఖిలప్రియ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పకుండా తెలంగాణలో కేసులు పెట్టడం సాధ్యం కాదని ఆరోపించారు.