Thursday, September 19, 2019
Follow Us on :

5జీ.. హుజూర్..!..

By BhaaratToday | Published On May 11th, 2019

ఆపరేషన్లలో స్పీడు. అఫీసు పనుల్లో దౌడు. కిచెన్ లోనూ చేదోడు. షాపింగ్ లోనూ తోడు. అక్కడా ఇక్కడా తేడా లేదు. అంతటా అదే జోరు. క్షణాల్లో డేటా బదిలీ. మారుమూల ప్రాంతాల్లోనూ కవరేజీ. 5జీ దూసుకొస్తోంది..! పరుగులు పెట్టిస్తానంటోంది..! 5జీ.. హుజూర్..!.. 

చిటికెలో మూవీ డౌన్లోడ్.. యమ స్పీడ్ తో ఇంటర్నెట్.. స్మార్ట్‌ ఫోన్ల ప్రపంచంలోకి 5జీ దూసుకువస్తోంది. వేగం సరే.. అది మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది..? ఈ 5జీ కోసం మనం కొత్త ఫోన్లు కొనుక్కోవాలా..? మారుమూల ప్రాంతాల్లోని వారికి సైతం 5జీ సేవలు అందుతాయా..? ఇంతకీ, మన దేశంలోకి ఈ టెక్నాలజీ ఎప్పుడు వస్తుంది..?  5జీ వస్తే.. కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుందనుకుంటే పొరపాటే. ఈ హైస్పీడ్ కనెక్టివిటీ సమాచార స్వరూపాన్నే మార్చోబోతంది. డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెట్టవచ్చు. వేల కిలోమీటర్ల దూరంలో పేషెంటుకు డాక్టర్లు సర్జరీలు చేయవచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ డివైజులను మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు.. ఒకటా రెండా.. 5జీ వల్ల ఎన్నో ఉపయోగాలు. 5జీ టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో.. అన్ని సమస్యలు కూడా వున్నాయి. ఎందుకంటే మన జీవితం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్త ఉండాలి. వైరస్, డేటా థెప్ట్, హ్యాకింగ్ బారిన పడితే.. బతుకు రోడ్డున పడ్డట్లే. దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరం. వ్యక్తిగత దేశ భద్రతకే కాదు.. మూగజీవాల మనుగడకు కూడా.. 5జీ ముప్పు పొంచింది.

ఇంట్లో నీళ్లు లేకుండా అయినా ఉంటాం.. కానీ, ఇంటర్ నెట్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చేశాం. తిండీ తిప్పలు లేకున్నా సరే.. మొబైల్ లో డేటా ప్యాక్ లేకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్స్. దేశంలోని చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ కనెక్టివిటీతోపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది. చాలా ఏరియాలు 2జీ నుంచి 3జీకి ఎప్పుడో అప్‌డేట్ అయిపోయాయి. నగరాలన్నీ 3జీ నుంచి 4జీలోకి మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం 5జీ వేగాన్ని అందుకునేందుకు దౌడు తీస్తోంది.  ప్రస్తుత వైర్‌లెస్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ లలో మనం వాడుతున్న 4జీ పరిజ్ఞానానికి తర్వాతి దశ 5జీ. ఇది ఐదోతరం ఇంటర్నెట్‌ కనెక్టివిటీ. ప్రాథమిక దశలో 5జీ సేవల వల్ల మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సూపర్ హై డెఫినిషన్ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివన్నీ అత్యంత సులభమైపోతాయి. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్లు అత్యంత వేగంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కళ్లుమూసి తెరిచేలోగా మూవీ డౌన్లోడ్ అయిపోతుంది. క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇంతకాలం 4జీ వాడుతున్న వినియోగదారులను 5జీ ఇంటర్‌నెట్‌ మరింత పరుగులు పెట్టిస్తుంది. 5జీ నెట్‌వర్క్ వాస్తవ పరిస్థితుల్లో.. ఇప్పుడున్న వేగంకన్నా 10 నుంచి 20 రెట్లు అధిక వేగంగా బ్రౌజింగ్, డౌన్‌లోడ్ స్పీడ్లు అందించగలదని చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ చెబుతోంది. అంటే.. ఒక హైడెఫినిషన్ సినిమా వీడియోని ఒక్క నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. 5జీ నెట్ వర్క్ రాకతో ఆటోమొబైల్ రంగం, ఫైనాన్స్, హెల్త్ కేర్ వంటి ఎన్నో రంగాల్లో ప్రగతి సాధ్యమై ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. 5జీ వస్తే.. కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటే పొరపాటే. ఈ హైస్పీడ్ కనెక్టివిటీ సమాచార స్వరూపాన్నే మార్చోబోతంది. ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్‌ ఇంటర్నెట్‌కి కనెక్ట్‌ అయ్యేలా వీలు కల్పిస్తుంది 5జీ టెక్నాలజీ. అంటే వంటగదిలో వాడే మైక్రోవేవ్ ఓవెన్, రిఫ్రిజిరేటర్ల నుంచి ఇంట్లోని ఏసీ, వాషింగ్ మిషన్లను సైతం 5జీ స్పీడుతో మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లను కూడా ఉన్నచోటినుంచే ఆపరేట్ చేయవచ్చు. అంతేనా.. 5జీతో డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెడతాయి. డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడతాయి. 5జీ వేగాన్ని అందుకోవాలంటే.. 5జీ టెక్నాలజీ వున్న స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌పై పనిచేసే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికొద్దిరోజుల్లో అవి మార్కెట్లో దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది. 5జీ వాడకంలో చైనా అన్ని దేశాలకంటే ముందంజలో వుంది. అక్కడ ఇప్పటికే 5జీ నెట్ వర్క్ ప్రారంభమైపోయింది.  5జీ టెక్నాలజీతో ఇప్పటికే అక్కడ డాక్టర్లు ఆపరేషన్లు చేసేస్తున్నారు. 2016 అక్టోబరులోనే 100 నగరాల్లో 5జీ పరికరాలను పరిశీలించించిన డ్రాగన్ కంట్రీ.. వచ్చే ఏడాది వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో 5జీ సేవలు ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2025 నాటికి ప్రపంచలోనే అతిపెద్ద 5జీ మార్కెట్ గా అవతరించనుందని.. 2025 నాటికి చైనాలో 43 కోట్ల 5జీ కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ప్రపంచంలోని మొత్తం 5జీ కనెక్షన్లలో ఇది 39 శాతం ఉంటుందని అంచనా. 5జీ టెక్నాలజీ విషయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం చైనాకంటే వెనుకే వుంది. 5జీ టెక్నాలజీని క్వాల్‌కామ్‌ వంటి అమెరికా సంస్థలు అభివృద్ధి చేసినా, దాన్ని ఉపయోగించుకోవడంలో చైనా, జర్మనీలు ముందున్నాయి. 5జీ వినియోగానికి పాత టెలికాం నెట్‌వర్కులు పనికిరావు. అపార నిధులు వెచ్చించి సరికొత్త భూతల కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, ఉపగ్రహాలు, 5జీ స్మార్ట్‌ ఫోన్లను అందుబాటులోకి తేవాలి. అంతటి ఆర్థిక సత్తా భారీ వాణిజ్యలోటుతో సతమతమవుతున్న అమెరికాకన్నా చైనాకే ఎక్కువ. హువావై చిప్స్‌, పరికరాలతో చైనా అమెరికాకన్నా చాలా ముందుగా 5జీ సాంకేతికతను వినియోగంలోకి తీసుకురానుంది. దీంతో అంతర్జాతీయ నవీకరణ కేంద్రంగా సిలికాన్‌ వ్యాలీకున్న పేరు కాలగర్భంలో కలిసిపోతుందని అమెరికా భయపడుతోంది. అందుకే, ఇంతవరకు 5జీ రంగంలో అత్యధిక మూల పేటెంట్లు కలిగిన అమెరికన్‌ క్వాల్‌కామ్‌ సంస్థ స్వాధీనానికి సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌ కామ్‌ ప్రయత్నించగా డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్డుకున్నారు. క్వాల్‌కామ్‌, బ్రాడ్‌కామ్‌ల నుంచి అత్యధిక చిప్‌లను కొనుగోలు చేస్తుంది హువావై సంస్థే. ఈ చిప్‌లతో 5జీ హ్యాండ్‌సెట్లు తయారుచేస్తోంది. అనేక దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌లను విస్తృతంగా నిర్మిస్తోంది. ఇక, చైనా బాటలో చాలా దేశాలు 2020 సంవత్సరం కన్నా ముందే 5జీ సర్వీసులను ప్రారంభించే అవకాశముందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కతార్‌కు చెందిన ఊరెడూ నెట్‌వర్క్ తాము ఇప్పటికే 5జీ వాణిజ్య సర్వీస్‌ను ప్రారంభించినట్లు చెబుతోంది. దక్షిణ కొరియా కూడా త్వరలోనే 5జీని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దేశంలోని మూడు అతి పెద్ద నెట్‌వర్క్ సంస్థలు ఒకేసారి దీనిని ప్రారంభించటానికి అంగీకరించాయి. ఇప్పటికే.. కొత్త సర్వీసుల విషయంలో మొబైల్ తయారీ సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్న టెలికాం కంపెనీలకు.. స్పెక్ట్రమ్‌ను వేలంవేసి విక్రయించటంలో ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణ సంస్థలు బిజీగా ఉన్నాయి. 5జీ మొబైల్ ఇంటర్నెట్ త్వరలోనే భారత్ లో అడుగుపెట్టబోతోంది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ-2018 కి గతేదాడి సెప్టెంబర్ లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త ఈ విధానం ద్వారా 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలని లక్ష్యం పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఒక సెకనుకు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020నాటికి దేశంలో 40లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ విధానం కింద స్పెక్ట్రమ్ ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది భారత్ లో 5జీ అందుబాటులోకి వస్తుందంటున్నారు టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్. మొత్తానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు 5జీ జపం చేస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీ వల్ల 2035 నాటికి 12 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కెట్ అంచనా వేస్తోంది.

గత మార్చి నెలలో చైనాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 3 వేల కిలోమీటర్ల దూరంలో వున్న ఓ పేషెంటుకు.. చైనా రాజధాని బీజింగ్ నుంచి విజయవంతంగా సర్జరీ చేశాడో డాక్టర్. నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది అక్షర సత్యం. 5జీ వేగం వల్లే ఇది సాధ్యమైంది. 5జీ టెక్నాలజీతో రిమోట్‌ కంట్రోల్ ద్వారా 3 గంటలపాటు కష్టపడి ఆపరేషన్‌ ను సక్సెస్‌ చేశారు డాక్టర్‌ లింగ్‌ జీపి. పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఓ పేషెంట్‌ కి.. న్యూరోస్టిమ్యులేటర్‌, బ్రెయిన్‌ పేస్‌ మేకర్‌ను ఎక్కించారు. చైనాకు చెందిన హవాయీ మొబైల్‌ కంపెనీ రూపొందించిన 5జీ టెక్నాలజీకి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ ద్వారా ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ చేస్తున్నంత సేపు రోగి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఒక్కసారి కూడా అనిపించలేదన్నారు డాక్టర్‌ లింగ్‌. 5జీ టెక్నాలజీతో ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెట్టబోతోందో చెప్పడానికి.. చైనా నిర్వహించిన ఈ 5జీ బేస్డ్ సర్జరీయే ప్రత్యక్ష ఉదాహరణ. భవిష్యత్తులో డాక్టర్ ను సంప్రదించకుండానే ట్రీట్మెంట్ కూడా పొందవచ్చంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు.. మీకు ఏదైనా జ్వరం వచ్చిందని అనుకుందాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు. మీరు మొబైల్ హాస్పిటల్ బుక్ చేసుకుంటే అదే మీ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడ్తుంది. అందులో మీకు టెస్టులు కూడా జరిగిపోవచ్చు. రియల్ టైంలో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్‌తో ఆన్‌లైన్‌లో మాట్లాడేసి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ కేవలం 5జీ వంటి హైస్పీడ్ వంటివాటితోనే సాధ్యం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి బాగా ఉపయోగపడొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్, ఆగ్మెంటెడ్ రియాల్టీ వంటివాటితో మొత్తం హెల్త్ కేర్ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోవచ్చు. ఒక్క వైద్య రంగంలోనే కాదు.. ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, స్పేస్ సైన్స్.. ఇలా ఒకటేమిటి.. ప్రతి రంగంలోనూ స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కేవలం కొన్ని వాటి అంశాలకే పరిమితమైంది. 5 జీ వస్తే.. ఇక ప్రతీ వస్తువూ నెట్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 2030 నాటికి 125 బిలియన్ డివైజులు హై స్పీడ్ నెట్‌కు కనెక్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ప్రయార్టీ ఉంటుంది. అప్పుడు మీరు దేశంలో ఎక్కడైనా కూర్చుని మీ ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయొచ్చు. మీ నోటి మాటతో గ్రాసరీ సామాన్లు కూడా మీ ఇంటికి డెలివరీ అయిపోతాయి. అది కూడా మనుషులతో ఏ మాత్రం సంబంధం లేకుండా. మీ ఇంట్లోని వస్తువులు మరింత స్మార్ట్‌గా మారి మీకు చాలా ఉపయోగపడతాయి. 5జీతో బ్యాంకింగ్ రంగం కూడా పరుగులు పెడుతుంది. భవిష్యత్తలో చేతిలో డబ్బు ఉండాలనే చింత ఉండదు. కార్డులు మోసుకెళ్లాలనే బాధ కూడా తప్పుతుంది. సూపర్‌మార్కెట్లలోని కెమెరాలు బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ సాయంతో మీ దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసుకుంటాయి. 5జీ సెన్సర్లు మీ ఇంట్లో నిండుకున్న వస్తువుల వివరాలని ఎప్పటికప్పుడు సూపర్‌మార్కెట్లకి తెలియచేసి ఇంటికి కావాల్సిన కిరాణా సామాన్లు ఆర్డరు ఇచ్చేస్తాయి. ‘సారీ మేడమ్‌ మీరు అడిగిన వస్తువు ఇప్పుడే అయిపోయింది’ అని దుకాణదారులు సాకులు చెప్పడానికి వీలులేకుండా సెన్సర్లు దుకాణంలో వస్తువులు నిండుకోకుండా జాగ్రత్తపడతాయి. వినియోగదారుల సమయం ఆదా చేస్తాయి. కృత్రిమమేధ సాయంతో బిల్లుబోర్డులు, అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులు.. వినియోగదారుల అవసరాలని గుర్తించి ప్రకటనలని  ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. ఆన్‌లైన్‌లో మీరు కొన్న వస్తువు ఈరోజు వస్తుందా.. రేపు వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం ఇప్పుడా వస్తువు ఏ ప్రదేశంలో ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వస్తువు గురించి రియల్‌ టైం ట్రాకర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తాయి. ఒక వేళ వస్తువులో ఏదైనా లోపం తలెత్తితే ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి.. వినియోగదారులు నష్టాల బారిన పడకుండా కాపాడతాయి. చేపల దగ్గర నుంచి రైతులు పండించిన పండ్లు, కాయగూరలు వరకూ ఆ వస్తువు మన చేతికి రావడానికి పట్టిన సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవడం ద్వారా వస్తువు నాణ్యతను పక్కాగా తెలుసుకోవచ్చు. ఇక ఇంటికెళ్లే ముందు మీ ఫోన్‌ నుంచి కోరితే చాలు.. మీరు ఇంటికెళ్లే సమయానికే ఏసీ ఆన్‌ అవుతుంది. అన్నంతోపాటు కూర కూడా సిద్ధంగా ఉంటుంది. వాటర్‌, గ్యాస్‌, విద్యుత్‌ బిల్లుల కోసం నెలాఖరు వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు బిల్లుల వివరాలు తెలిసిపోతూ ఉంటాయి. 5జీతో రవాణా రంగంలోని పెను మార్పులు సంభవిస్తాయి. డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెడతాయి. ఇప్పటికే యాపిల్ - ఉబెర్ సంస్థలు డ్రైవర్‌లెస్ కార్లపై విపరీతంగా ఖర్చు చేసి మంచి పురోగతి సాధించాయి. 5 జీ వస్తే.. మైక్రో సెకెన్లలో డేటాను ప్రాసెస్ చేసి తక్షణ నిర్ణయాన్ని సదరు వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కార్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, ట్యాక్సీలు కూడా డ్రైవర్లు లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తాయి. 5జీ టెక్నాలజీతో టోల్‌గేటు దగ్గర వాహనాలు కిలోమీటర్ల దూరం కొద్దీ బారులుతీరే పరిస్థితి నుంచే కాదు.. వాహనాల పార్కింగ్‌ ఎక్కడ చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి తప్పుతుంది. ఎప్పటికప్పుడు కెమెరాల నుంచి రియల్‌టైం ట్రాఫిక్‌ వివరాలని సేకరించడం ద్వారా వాహనాలని దారి మళ్లించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా అడ్డుకుంటాయి. మనుషుల అవసరం లేని సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్లు సెన్సర్ల సాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానించుకుంటూ యాక్సిడెంట్లని నివారించి ప్రాణ నష్టం లేకుండా చేస్తాయి. టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌ చెల్లించేందుకు అధిక సమయం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా 5జీ చిప్స్‌ ఈ పనిని క్షణాల్లో చేసిపెట్టేస్తాయి. ఈ విధానంలో ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. 5జీతో వ్యక్తిగత భద్రత కూడా పెరుగుతుంది. మీరుఅనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్నా.. లేదా ఆగంతకులెవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నా.. మీరున్న చోటు, వివరాలు చాలా కచ్చితంగా పోలీసులకు తిలిసిపోతాయి. ఇలాంటి సమయంలో నేరస్థుల వివరాలు తెలియచేసేందుకు పర్సనల్‌ బాడీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి. నేరాలని అదుపులో ఉంచేందుకు, తక్షణం... రక్షణ సాయం పొందేందుకు అవసరం అయిన బాడీ కెమెరాలని ఇప్పటికే వాడుతున్నా అందరికీ అందుబాటులో లేవు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే పర్సనల్‌ బాడీ కెమెరాలతో అనుసంధానించిన మొబైల్‌ సేవలు.. ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడతాయి. ఇక ఆఫీస్ సంగతి వేరు చెప్పాల్సిన పనిలేదు. ఇళ్లు, రోడ్లు, ఫ్యాక్టరీలు, బ్యాంకులే ఇంత స్మార్ట్‌గా మారిపోతే.. ఆఫీసులో మరింత అడ్వాన్స్ టెక్నాలజీలు అందుబాటులోకి రావొచ్చు. కంప్యూటర్‌లతో మాట్లాడేవారు ఉద్యోగాల్లో పెరిగిపోతారు. మీ వాయిస్ కమాండ్స్ తోనే ఆఫీసులో పనులు జరిగిపోతాయి.

5జీ టెక్నాలజీతో ఉపయోగాల మాట ఎలావున్నా.. పెను ముప్పు పొంచి వుందని పరిశోధకులు కనుగొన్నారు. 5జీ డేటాతో భద్రతకు ముప్పు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 5జీ డేటాతో హ్యాకర్లు సులభంగా డేటాను చోరీ చేసుకోగలరని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. 5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా కాల్స్, డెక్ట్స్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని, 5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా డేటా స్పైయింగ్ అవుతుందని.. బెర్లిన్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌తో ప్రైవసీకి విఘాతం కలుగుతుందని.. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్‌వర్క్ సులభంగా వుంటుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది.  డేటా చోదకులు, హ్యాకర్లకు 5జీ ఎయిర్‌వేవ్స్ ఎంతగానో సహకరిస్తాయని పరిశోధకులు తెలిపారు. 5జీ భద్రతతో వైరుధ్యం వుందని, ఇది ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటికి లేదా ఐఎమ్ఎస్ఐ క్యాచర్లకు వ్యతిరేకంగా వుంటుందని.. 5జీ డేటా ఫోన్లలో గూఢచర్యం చేసేందుకు సెల్ టవర్ల వలె వ్యవహరిస్తుందని.. పరిశోధకులు తేల్చారు. దీన్ని బట్టి.. 5జీ వస్తోంది అని సంబరపడే ముందు మనం ఎంత అప్ గ్రేడ్ కావాలో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 5జీ టెక్నాలజీ వల్ల లైఫ్ ఈజీగా మారొచ్చేమో కానీ.. అదే సాంకేతిక మన నోటి దగ్గర కూడు లాగేసుకునే ప్రమాదం కూడా వుంది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరిగడం వల్ల.. మనుషుల కంటే టెక్నాలజీని నమ్మేందుకే సంస్థలు ఎక్కువగా మొగ్గుచూపిస్తాయి. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెంచుకునేందుకు ఇవి ఎక్కువగా దోహదపడతాయి. దీంతో కంపెనీలు మ్యాన్ పవర్ ను తగ్గించుకుంటాయి. అదే జరిగితే.. లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయి. 5జీ టెక్నాలజీ వల్ల మనిషి జీవితంలో వేగం పెరుగుతుందేమో కానీ, మూగ జీవాలకు మాత్రం శాపమేనంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇటీవల వచ్చని 2 పాయింట్ ఓ సినిమాలో చూపించినట్టుగా.. 5జీ వల్ల వెలువడే రేడియేషన్ తో పక్షి జాతి అంతరించి పోయే ప్రమాదం వుందని హెచ్చిరిస్తున్నారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లోని ఓ పార్క్‌లో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆ పార్క్ పరిధిలో 300 పక్షులు చనిపోయి ఉన్నాయి. వరసగా పక్షులు చనిపోతుండటంతో ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించగా వారికి షాకింగ్ విషయం తెలిసింది. 5జీ టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్ వల్లనే వందలాది పక్షులు చనిపోతున్నాయని గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి పశు వైద్యులు కూడా నిర్థారించారు. టెలికాం కంపెనీ అధికారులు కూడా దీనిని అంగీకరించారు. డచ్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా అధికారులు 5జీ టెస్ట్ సిగ్నల్ అక్కడ ప్రయోగం చేశారు. దీని కారణంగా రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న పక్షులపై తీవ్ర ప్రభావం చూపింది. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయి. కొన్ని పక్షులు రేడియేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు నీళ్లలో తలదాచుకుంటున్నాయి. ఈ ఘటనపై నెదర్లాండ్స్ పక్షి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయోగాలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పక్షులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికే సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4జీ టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే.. రాబోయే 5జీ సిగ్నల్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతున్నది అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

-ఎస్. కె. చారి