Thursday, October 17, 2019
Follow Us on :

మహా‘కట్’బంధన్..!..

By BhaaratToday | Published On Jun 5th, 2019

సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. బద్ధ శత్రువులు ఒక్కటయ్యారు. ఎన్నికలకు ముందు.. మోదీ ఓటమే లక్ష్యమంటూ బీరాలు పలికారు. కానీ, గెలుపు వాకిట బోర్లాపడ్డారు. దీంతో అనైతిక మైత్రికి అడ్రస్ గల్లంతైంది. కూటమి ముచ్చట తీరిపోయింది. మహా‘కట్’బంధన్..!.. 

పోరు నష్టం.. పొందు లాభం.. అనేది నానుడి. కానీ, యూపీలో ఇది రివర్సయింది. పొత్తు నష్టం.. పొందని లాభం అన్నట్టు తయారైంది మహాగఠ్ బంధన్ పరిస్థితి. పాతికేళ్ల శత్రుత్వాన్ని పక్కన బెట్టి.. పార్టీ సిద్ధాంతాలను మూలకు నెట్టిన ఎస్పీ-బీఎస్పీలు.. అనైతికంగా జట్టుకట్టి.. మోదీ ఓటమే లక్ష్యమంటూ బీరాలు పలికాయి. కానీ, కమలనాథులు ఇచ్చిన షాక్ తో కూటమి మైత్రి మూణ్ణాళ్ల ముచ్చటైంది. ఎస్పీతో మైత్రీబంధాన్ని తెంచుకున్నారు మాయావతి. అంతేకాదు, ఓటమి మీవల్లేనంటూ ఎస్పీపై దుమ్మెత్తిపోశారు. మూణ్ణాళ్ల ముచ్చటగా మారిన ఎస్పీ-బీఎస్పీ మైత్రిపై కమలనాథులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీని ఓడించడమే లక్ష్యంగా జట్టుకట్టిన కూటమి స్ఫూర్తి ఏమైందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమి కుప్పకూలుతుందని ముందే చెప్పామని.. తాము చెప్పినట్టుగానే జరిగిందని.. కూటమి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. యూపీలో ఎస్పీ-బీఎస్పీ మైత్రి బీటలువారడానికి అనేక కారణాలున్నాయి. కేవలం బీజేపీనీ ఓడించాలనే లక్ష్యమే తప్ప.. జననాడిని ఎస్పీ-బీఎస్పీలు అంచనావేయలేపోయాయనే విమర్శలున్నాయి. నిజానికి, పాతికేళ్ల శత్రుత్వాన్ని పక్కనపెట్టి.. చేతులు కలపడంతోనే.. జనానికి నెగిటివ్ సంకేతాలిచ్చారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, ఓటమి ఎదురుకాగానే మైత్రిని తెంచుకున్న ఇరు పార్టీలు.. మరింత అబాసుపాలయ్యాయి. రాజకీయ లబ్ది కోసమే తప్ప.. సిద్ధాంతాలకు అవి విలువ ఇవ్వవనే విషయం మరోసారి తేటతెల్లమైంది.

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలొచ్చి ప్రభుత్వం కూడా కొలువుదీరింది. మోదీ మంత్రివర్గం కూడా డ్యూటీలో చేరిపోయింది. ఇక యూపీలో కలిసి పోటీచేసిన బీఎస్పీ-ఎస్పీలు తమ ఓటమిని అంగీకరించాయి. కానీ, ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. అయితే, బెహన్ జీ మాయావతి ఆ లోటును పూడ్చివేశారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి కోపాన్నంతా దిగమింగుకున్న మాయావతి.. ఒక్కసారిగా తన భాగస్వామ్య పక్షం ఎస్పీపై విమర్శలు కురిపించారు. యూపీ కోటాలో ఎస్పీ-బీఎస్పీ ప్రభావం చూపలేదు. ఇక్కడ మెజార్టీ సీట్లలో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుదామని మాయావతి, అఖిలేవ్ భావించారు. కానీ, ప్రజలు అనుహ్య తీర్పునివ్వడంతో మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభావం చూపలేదని మాయావతి అంగీకరించారు. ఇన్నాళ్లూ కోపాన్ని అణచుకున్న బీఎస్పీ అధినేత్రి పార్టీ ఆఫీస్ బేరర్లలో సమావేశం తర్వాత.. తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. తన భాగస్వామ్య పక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో యాదవుల ఓట్ల చీలికను ఆపడంలో అఖిలేశ్ విఫలమయ్యారని మండిపడ్డారు. దీనిపై కార్యకర్తలకు ఉదహరణ కూడా చెప్పారు. తన భార్య డింపుల్ యాదవ్.. కనౌజ్‌లో 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని.. యాదవుల ఓట్లు చీలకుంటే.. ఆమె గెలిచేదని గుర్తుచేశారు. యూపీలో బీఎస్పీ - ఎస్పీ - ఆర్ఎల్డీలతో ఏర్పాటైన మహాగఠ్‌ బంధన్‌ వృథాయేనని మాయావతి చెప్పుకొచ్చారు. అభ్యర్థుల మధ్య యాదవుల ఓట్లు బదిలీ కాలేదని.. తమ పార్టీ ఓట్లు ఎస్పీకి పడ్డాయని అన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచిందన్న మాయావతి.. అఖిలేశ్‌ యాదవ్‌ కుటుంబీకులకు కూడా యాదవుల ఓట్లు పడలేదని ఆరోపించారు. కూటమి లేకున్నా ఎస్పీతో సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే.. ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ లాంటి వాడు కాదన్న మాయావతి.. అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్‌ కారణంగానే యాదవుల ఓట్లు చీలిపోయాయని అన్నారు. కనీసం అఖిలేశ్‌ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని ఆరోపించారు. అతని ఇద్దరు సోదరులూ ఓడిపోయారని అన్నారు. ఇక ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేద్దామని.. అందుకు సన్నద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాయావతి. ఓట్ల బదిలీ జరిగి ఉండుంటే తాము కనీసం 30 స్థానాలైనా గెల్చుకోగలిగి ఉండేవారమని అన్నారు మాయవతి. కాంగ్రెస్‌ అనేకచోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టడం వల్ల, వారు ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థుల విజయావకాశాలను బలంగా గండికొట్టినట్లు కూడా తేలింది. ఎమ్మెల్యేలు లోక్‌ సభకు పోటీచేయడం వల్ల 11 సీట్లు ఖాళీ అయ్యాయి. ఇందులో 9 బీజేపీ, 2 బీఎస్పీ సీట్లున్నాయి. ఈ సీట్లకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఒంటిరిగానే పోటీచేయాలని మాయావతి నిర్ణయించారు. యూపీలో కూటమితో అసంతృప్తితో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాయావతి. రాష్ట్రంలో ఎస్పీ చేసిన చర్యలతో ఓటు బ్యాంకు పడిపోయిందని.. ఈ క్రమంలో తాము కూటమి నుంచి వైదొలుగుతామన్న సంకేతాలిచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. తమ సత్తా చాటుదామని శ్రేణులను ఉత్తేజపరిచినట్టు తెలిసింది. అంతేకాదు ఎన్నికల్లో ఆశాజనక ఫలితం చూపని తమ పార్టీకి చెందిన నేతలపై ఇదివరకే మాయావతి వేటు వేశారు. రెండు రాష్ట్రాల బీఎస్పీ అధ్యక్షులను, ఉత్తరాఖండ్, బీహర్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల కో ఆర్డినేటరన్లు తొలగించారు. ఎన్నికల్లో ఘోర పరజయానికి మాత్రం ఎస్పీ కారణమని దుమ్మెత్తిపోశారు మాయావతి.  మొత్తానికి, బీజేపీని ఎదిరించడమే లక్ష్యంగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్.ఎల్.డీ మహాకూటమి లోక్ సభ ఫలితాలతో చెల్లాచెదురైంది. యూపీలో ఎస్పీకి బీఎస్పీ సహకరిస్తే కేంద్రంలో ప్రధాని కావడానికి మాయవతికి ఎస్పీ సపోర్ట్ ఇవ్వాలన్నది ఈ కూటమి ఒప్పందం. అయితే బీజేపీ సునామీకి ఈ కూటమి చెల్లాచెదురయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ చతికిలపడింది. ఎస్పీ 37, బీఎస్పీ 36, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీ చేయగా.. బీఎస్పీకి 10 స్థానాలు, ఎస్పీకి 5 స్థానాలు మాత్రమే దక్కాయి. బీజేపీ ఏకంగా 62 సీట్లలో విజయం సాధించింది. దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అమేథీలో ఓడి, రాయ్‌బరేలీతో సరిపెట్టుకుంది. తమ పార్టీకి ఎస్పీ యొక్క యాదవ ఓటు బ్యాంకు అనుకూలిస్తుందని, తద్వారా 35 స్థానాలు గెలవచ్చని మాయవతి అనుకున్నారు. కానీ, యాదవులు ఎస్పీకే ఓటు వేయలేదు. ఫలితంగా అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, తమ్ముళ్లు అక్షయ్, ధర్మేంద్రలు కూడా ఓడిపోయారు. ఇలా సొంత వర్గం నుండి కూడా ఓట్లు రాబట్టుకోలేని పార్టీతో ఇకపై పొత్తు అనవసరం అనుకున్న మాయవతి రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించారు. ఇదిలావుంటే, రానున్న ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తే.. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్‌ చీఫ్‌ అఖిలేశ్‌యాదవ్‌ తెలిపారు. యూపీలో ఇదో సరికొత్త రాజకీయ పరిణామం. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉండి, ఇటీవలి ఎన్నికల్లో మళ్ళీ మిత్రులైన రెండు ప్రధాన పార్టీలు చెరో దారి పడుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మొత్తానికి ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పారు. మాయావతి తాజా నిర్ణయంతో ఇక విపక్షాల ‘మహాకూటమి’ కి గండి పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎస్పీ-బీఎస్పీ కూటమి బీటలు వారడంతో.. ఇప్పుడు ఆ రెండు పార్టీలపై బీజేపీ విమర్శలకు పదును పెట్టింది. మోదీ మళ్లీ పీఎం కాకుండా అడ్డుకోవాలని కూటమి కుటిల పన్నాగం పన్నిందని.. ఇప్పుడు వారి పన్నాగం పారకపోవడంతో.. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. ఎస్పీ-బీఎస్పీ అనైతిక పొత్తును ప్రజలు అంగీకరించలేదని.. అందుకే వారికి గుణపాఠం చెప్పారని అన్నారు. అసలు మహాకూటమి కుప్పకూలుతుందని ఎన్నికల ముందే బీజేపీ చెప్పిందన్నారు జీవీఎల్. ఇప్పుడు ఓటమికి ఎవరిని నిందించాలో తెలియక వారిని వారే నిందించుకుంటున్నారని విమర్శించారు. 2014లో విడిగా పోటీచేసిన ఎస్పీ, బీఎస్పీ.. 2017 ఉప ఎన్నికలతో పాటు.. ఈసారి కూడా కలిసి బరిలోకి దిగారని.. అయితే.. మోదీ ముందు నిలవలేకపోయారని విమర్శించారు యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ. రాజకీయాల్లో మసకబారుతున్న తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే.. బద్ధశత్రువులైన ఎస్పీ-బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయని.. తీరా ఓటమి పాలయ్యాక ఇప్పుడు విమర్శలకు తెరతీశాయని అన్నారు బీజేపీ సీనియర్ నేత జగదంబికా పాల్. మే 23 తర్వాత మహాగఠ్ బంధన్ కుప్పకూలుతుందని బీజేపీ ముందే చెప్పిందన్నారు. ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకముందే.. కూటమి బీటలు వారిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీని ఓడించేందుకు ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన ఎస్పీ-బీఎస్పీ పార్టీలు ఇప్పుడు విమర్శలు చేసుకోవడం హాస్యాస్పదంగా వుందన్నారు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్. రెండు పార్టీల కథ ముగిసిపోయిందని ఎద్దేవా చేశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ను విశ్వసించిన ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ వెంట నడిచారని అన్నారు. మొత్తానికి, మూణ్ణాళ్ల ముచ్చటగా మారిన ఎస్పీ-బీఎస్పీ లపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అవసరం కొద్దీ ప్లేట్లు ఫిరాయించే పార్టీలని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదమే.. కొద్దిరోజుల క్రితం యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకొని అధికార బీజేపీని చిత్తుగా ఓడించింది. దీంతో మాయ రెచ్చిపోయారు. మా మహాకూటమిని ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని బీరాలు పలికారు. అఖిలేష్ తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మాయా మరోసారి కూటమి నుంచి బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మాయవతి ప్రకటించడం బీజేపీ శ్రేణులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపీ ప్రజలు జాతీయ కోణంలో కాకుండా రాష్ట్రీయ కోణంలో ఆలోచిస్తారు. ఎస్పీ-బీఎస్పీ కలిసి ఉంటే వారికే ఓటేస్తారు. అందుకే ఇప్పుడు మాయవతి తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా బీజేపీ శిబిరాన్ని సంతోషపెట్టగా.. ఎస్పీ అఖిలేష్ యాదవ్ ను షాక్ కు గురిచేసింది. ఆది నుంచి మాయావతి లో దూకుడు ఎక్కువ. స్థిరంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండరని విశ్లేషకుల భావన వుంది. ఓడినా.. గెలిచినా కట్టుబడి ఉండే రకం కాదు. అందుకే అలా ఓడగానే ఇలా ప్రత్యర్థులకు అస్త్రాలను అందిస్తుంటారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ పార్టీకి పట్టం కట్టడంతో ఎస్పీతో దోస్తీకి స్వస్తి పలికారు. నిజానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలు అయిన ఎస్పీ- బీఎస్పీకి ఓటేస్తే అది వేస్ట్ అన్న భావన ఆ రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. అందుకే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జాతీయ కోణంలో ఆలోచించి బీజేపీ-కాంగ్రెస్ ను గెలిపించారు. అలా అని కూటమి విచ్చిన్నం చేసుకుంటే మాత్రం మునిగేది మాయావతియే. రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఓటర్లు స్థానిక పార్టీల వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి తొందరపడి మాయావతి ముందేకూసి ఎస్పీతో దోస్తీ కట్ చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యూపీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ ఓటమితో.. అఖిలేష్ యాదవ్ పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. తండ్రి మాటను లెక్క చేయకుండా అఖిలేష్ చతికల పడ్డారు. తండ్రి ఏర్పరిచిన ఓటు బ్యాంకునంతా ఆరేళ్లలో హరీమనిపించారు. దూకుడు నిర్ణయాలు, దూరాలోచన లేకపోవడం వంటి అంశాలు అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసాయన్నది ఆపార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో రెండే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన తన తండ్రి ములాయం సింగ్ బాటలో అఖిలేష్ నడవలేదు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా అణిచివేయాలనుకోవడంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లో పడేశాయంటున్నారు. చిరకాల ప్రత్యర్థి మాయావతి పార్టీతో పొత్తు వద్దని ములాయం వారిస్తున్నా తనకు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి అడ్డులేకుండా చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ మాయావతితో చేతులు కలిపారు. కానీ సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా ఐదు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. చివరికు మాయావతి, ములాయం సింగ్ ఒకే వేదికపైకి వచ్చి కలసి ఉన్నామని సంకేతాలు పంపినా ప్రజలు దానిని తిప్పికొట్టారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ రాంగ్ స్టెప్ లతో తండ్రి మాటను లెక్క చేయకుండా పార్టీని కష్టకాలంలోకి నెట్టారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరోవైపు, మహాకూటమి బీటలు వారడంతో ఎస్పీ- బీఎస్పీలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ పరిణామంతో.. కేవలం గెలుపు కోసమే తప్ప.. ఎస్పీ-బీఎస్పీలు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వవని మరోసారి రుజువైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన పలు లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసి పోటిచేసి విజయం సాధించిన మహాకూటమి.. ఇప్పుడు పరాజయం పాలు కావడంతో బంధాన్ని తెంచుకున్నాయి. అంటే గెలిస్తే ఒకలా.. ఓడిపోతే మరోలా.. అవసరానికి తగ్గట్టు ప్లేటు ఫిరాయించే పార్టీలని ముద్రవేయించుకున్నాయి ఎప్పీ-బీఎస్పీ. ఇప్పటికే పాతికేళ్ల శత్రుత్వాన్ని పక్కనబెట్టి రాజకీయ లబ్దికోసం జట్టుకట్టాయన్న అపవాదును మూటగట్టుకున్న రెండు పార్టీలు.. ఓటమి ఎదురుకాగానే విడిపోయి మరింత అబాసుపాలయ్యాయి. ఈ పరిణామం రానున్న ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-ఎస్.కె. చారి