Thursday, September 19, 2019
Follow Us on :

ఇదుగో సాక్ష్యం..!..

By BhaaratToday | Published On May 10th, 2019

అంతా అబద్దమన్నారు. కొందరేమో సాక్ష్యాలడిగారు. తూచ్.. ఉత్తిదేనంటూ పాకిస్తాన్ కు వంతపాడారు. ఇప్పుడు నిజం నిగ్గుతేలింది. వాస్తవం వెలుగుచూసింది. బాలాకోట్ దాడులపై పక్కా ‘ఆధారం’ దొరికింది. ఇదుగో సాక్ష్యం..!.. 

పుల్వామా ఘటన తర్వాత ప్రతి భారతీయుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయాడు. 40 మంది వీరజవాన్ల మరణానికి బదులు తీర్చుకోవాల్సిందేనంటూ దేశం మొత్తం నినదించింది. అటు ప్రధాని మోదీ సైతం.. జవాన్ల కుటుంబ సభ్యులు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం ఇస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఊహించని రీతిలో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. బాలోకోట్ లోని జైషే శిబిరాలను నేలమట్టం చేసి వందలాది ఉగ్రవాదలను మట్టుబెట్టింది. ఈ దాడులపై ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. అసలు దాడులే జరగలేదంటూ బుకాయించింది పాకిస్తాన్. మనదేశంలోనూ పలువురు ప్రబుద్ధులు దాడులపై అనునాలు వ్యక్తం చేశారు. వారికి బుద్ధి చెప్పేలా బాలాకోట్ దాడులపై ఇప్పుడు బలమైన సాక్ష్యాలు వెలుగుచూశాయి. బాలాకోట్ లో భారత వైమానిక దళం దాడులు చేసిందా..? చేస్తే.. సాక్ష్యాలు ఎందుకు బయటపెట్టడం లేదు..? దాడుల విషయంలో మాకు ఎన్నో అనుమానాలున్నాయంటూ విపక్షాలు.. మోదీ సర్కార్ పై ఏకపక్ష దాడులు మొదలుపెట్టాయి. భారత వైమానిక దళం పాటవాన్ని కించపరిచేలే అనే ఆరోపణలు గుప్పించాయి. వాటన్నింటికీ.. గట్టి సమాధానం ఇచ్చింది ఓ ఇటాలియన్ జర్నలిస్ట్. బాలాకోట్ దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు ఇటాలియన్ జర్నలిస్టు ఫ్రాన్సెస్కో మారినో. బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన దాడులు ముమ్మాటికీ నిజమని.. సాక్ష్యాధారాలతో నిరూపించారు. అసలు దాడులే జరగలేదంటూ బుకాయించిన పాకిస్తాన్ కుయుక్తులను బయటపెట్టారు.

సార్వత్రిక ఎన్నికల వేళ బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులపై రసవత్తర జరుగుతోంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలోనూ వాయుసేన దాడులను ప్రస్తావిస్తుంటే.. విపక్షాలు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు వైమానిక దాడులు జరగలేదంటూ ఇన్నాళ్లూ పాకిస్తాన్ సైతం బుకాయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇటలీకి చెందిన ఓ జర్నలిస్ట్ పక్కా ఆధారాలు సేకరించి ప్రపంచం ముందుంచింది. దీంతో పాకిస్తాన్ తో పాటు.. ఆధారాలు చూపాలంటూ డిమాండ్లు చేస్తున్న విపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అసలు ఇటలీ జర్నలిస్టు సేకరించిన సాక్ష్యాలు సరైనవేనా..? ఏ ఆధారాలతో ఆమె ఎయిర్ స్ట్రయిక్స్ నిజమేనని చెబుతోంది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేముందు.. బాలాకోట్ వైమానిక దాడులను ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత.. భారతమాత కోసం అసువులు బాసిన జవాన్ల వీర మరణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడి జరిగిన తర్వాత సరిగ్గా 12 రోజులకు పాకిస్తాన్ కు బుద్ధిచెప్పింది భారత్. సమయం చూసి శత్రుదేశంలో దాగున్న ముష్కరుల స్థావరాలపై గత ఫిబ్రవరి 26న ఎయిర్ స్ట్రయిక్స్ జరిపింది. అమరజవాన్లు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన మిరాజ్ యుద్ధ విమానాలు.. వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బను రుచి చూపించింది. బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల మధ్య తొలి దాడి జరిగింది. భారత వాయుసేన విమానాలు బాలాకోట్ ను చేరిన మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3 గంటల 48 నిమిషాల నుంచి 3 గంటల 58 నిమిషాల మధ్య దాడులు జరిగాయి. ఇక మూడో దాడిలో భాగంగా చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3 గంటల 58 నిమిషాల నుంచి 4 గంటల 4 నిమిషాల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4 గంటల 12 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాలకల్లా అన్ని విమానాలూ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. దాడి చేయాలనుకున్న ప్రాంతాలను యుద్ధ విమానాలు ఆటోమేటిక్ గా గుర్తించాయి. సరిగ్గా ఆ ప్రాంతంలోనే బాంబులను వేసిన వాయుసేన విమానాలు విజయవంతంగా తిరిగివచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తో పాటు పాక్ భూభాగంపై విరుచుకుపడిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు.. సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ప్రధానంగా నియంత్రణ రేఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంఖ్తుఖ్వా ప్రావిన్సుల్లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది.  వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు అప్పట్లో ఆర్మీ వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్‌లు ధ్వంసమయ్యాయని తెలిపాయి.  ఎయిర్ స్ట్రయిక్ జరిగిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ భారత భూభాగంలోకి రావడం కలకలం రేపింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దాన్ని గుర్తించిన వాయుసేన సిబ్బంది కూల్చివేశారు. భారత సైన్యం కదలికలను తెలుసుకునే క్రమంలో పాకిస్థాన్ డ్రోన్ ప్రయోగించింది. అయితే అప్రమత్తంగా ఉన్న వాయుసేన సిబ్బంది.. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతో కూల్చివేశారు. ఇక పాక్ పై భారత్ చేసిన మెరుపుదాడిలో పెద్ద ఎత్తున జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే అప్పట్లోనే ప్రకటించారు. దాదాపు 300 మంది చనిపోయివుంటారని అంచనావేశారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ క్యాంప్‌పై దాడి కారణంగా సామాన్యులకు ఎలాంటి నష్టం కలగలేదని విజయ్ గోఖలే స్పష్టం చేశారు. ఉరి ఘటన తర్వాత తొలిసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్ చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసన భారత్.. పుల్వామా ఘటన తర్వాత మలివిడత మెరుపుదాడులతో ఉగ్రదేశానికి బుద్ధి చెప్పింది. నాడు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే దాడులు జరిపిన భారత వాయుసేన.. ఈసారి పాక్ భూభాగంలోనూ బాంబుల వర్షం కురిపించి ఆ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ జోలికొస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. పైగా సామాన్య పౌరులకు ఎలాంటి హానీ జరగకుండా.. కేవలం ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా భారత్ జరిపిన మెరుపుదాడులపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. పుల్వామా ఘటనకు బాధ్యత వహించిన జైషే మహ్మద్ అగ్ర ఉగ్రవాదులు దాక్కున్న శిబిరాలను వెతికి వెతికి మరీ మట్టుబెట్టాయి. మనపై దాడికి పాల్పడ్డ శతృవు ఎక్కడ దాక్కున్నా.. ఏ దేశం లో దాక్కున్నా.. మట్టుబెట్టవచ్చనే అంతర్జాతీయ సూత్రాలను అనుసరించి.. పకడ్బందీ వ్యూహంతో ముష్కర మూకలను మట్టుబెట్టింది భారత వాయుసేన. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి చార్టర్ లో పేర్కొన్న విధంగా శత్రువు దాడి చేస్తాడని అనుమానం వస్తే.. శత్రువు కంటే ముందే దాడి చేయొచ్చు. ఇదే సూత్రాన్ని అనుసరించి సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ భారత్ పై తరుచూ దాడులకు పాల్పడుతున్న పాక్ పై సరైన రీతిలో బుద్ధి చెప్పారు మన వీరజవాన్లు. ఇదీ.. బాలాకోట్ లో భారత్ జరిపిన వైమానిక దాడుల వృత్తాంతం.

మలివిడత మెరుపుదాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్.. ఎటూ తేల్చుకోలేక బుకాయింపుల పర్వానికి తెరలేపింది. అసలు మెరుపుదాడులే జరగలేదని.. భారత యుద్ధవిమానాలు తమ భూభాగంలో పైన్ చెట్లను కూల్చివేసి వెళ్లిపోయాయని బుకాయించింది. పొంతనలేని కథనాలెన్నో వడ్డించింది. ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించడానికి ఎన్నో కుయుక్తులు పన్నింది. శత్రుదేశం పాకిస్తాన్ కుయుక్తులు పన్నడంలో అర్థం వుంది. కానీ, మనదేశంలోనే కొందరు ప్రబుద్ధులు బాలాకోట్ దాడులను తప్పుబట్టారు. అంతా ఉత్తిదేనంటూ పాకిస్తాన్ కు వంతపాడారు. కొందరు విపక్ష పార్టీల నాయకులైతే సాక్ష్యాలేవంటూ డిమాండ్ చేశారు. వైమానిక దళం నిర్వహించిన దాడుల ఘటనకు సంబంధించి సాక్ష్యాలు కావాలని.. అప్పుడే తాము విశ్వసిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దాడులకు సంబంధించిన సాక్ష్యాలను దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన సందర్భం కూడా వుంది. బాలాకోట్ ఘటనకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను బహిర్గతం చేయాలని.. డిగ్గీ రాజా, కపిల్ సిబల్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ నాయకులు సైతం ఘాటుగా బదులిచ్చారు. మన ఇంటెలిజెన్స్ పైన కూడా కాంగ్రెస్ కు నమ్మకం లేదని మండిపడ్డారు కమలనాథులు. ఇదిలావుంటే, విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేలా.. భారత వాయుసేన గతంలోనే పలు ఆధారాలు చూపించింది. నిర్ధేశిత లక్ష్యాలపై గురిపెట్టిన బాంబు దాడుల్లో 80 శాతం మేర లక్ష్యాలను ఢీకొన్నాయని పేర్కొంటూ.. దీనికి ఆధారంగా శాటిలైట్‌ చిత్రాలను భారత వాయు సేన ప్రభుత్వానికి అందచేసింది. వైమానిక దాడులు లక్ష్యానికి దూరంగా సాగాయని, వాటి గురితప్పిందని సాగుతున్న ప్రచారం అవాస్తవమని వాయుసేన ఓ నివేదికను కేంద్రానికి సమర్పించింది. వైమానిక దాడుల తీరుతెన్నులను విశ్లేషిస్తూ శాటిలైట్‌ చిత్రాలతో కూడిన 12 పేజీల నివేదికను వాయుసేన భారత ప్రభుత్వానికి సమర్పించింది. బాలాకోట్‌ వైమానిక దాడులు విజయవంతమయ్యాయని చెప్పేందుకు ఈ ఆధారాలను మోదీ సర్కార్‌కు వాయుసేన సమర్పించించింది. దాడుల్లో భాగంగా మిరాజ్‌ 2000 యుద్ధవిమానాలు బాలాకోట్‌ జైషే శిబిరంపై ఇజ్రాయిల్‌ స్పైస్‌ 2000 ప్రిసిషన్‌ బాంబులతో విరుచుకుపడినట్టు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. ఈ బాంబులు నిర్ధేశిత భవనాల పైకప్పులను చిధ్రం చేసి లోపల భారీ పేలుడు సంభవించిందని, పైకి కనిపించని రీతిలో అంతర్గతంగా విధ్వంసం జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు బాలాకోట్ దాడులు గురితప్పలేదని వాయుసేన స్పష్టం చేసినా.. విపక్షాల ఆరోపణలు మాత్రం ఆగలేదు. అసలు దాడులే జరగలేదంటూ బుకాయిస్తున్న పాకిస్తాన్ కు వంతపాడేలా.. విపక్షాలు సైతం సాక్ష్యాలు డిమాండ్ చేస్తూనేవున్నాయి. ఈ నేపథ్యంలో అసలు భారత్ చెబుతున్నట్లు బాలాకోట్ లో వందలమంది ఉగ్రవాదులు చనిపోయారా..? ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి నిజమేనా..? లేక పాక్ చెబుతున్నది నిజమా..? అనే అంశాలు తేల్చేందుకు విదేశీ మీడియా రంగంలోకి దిగింది. ఒక సమయంలో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులను పాక్ ప్రభుత్వం అనుమతించలేదు. మరోసారి పలువురు విదేశీ మీడియా ప్రతినిధులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాజాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఇటాలియన్ జర్నలిస్టు.. ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాలాకోట్‌పై జరిపిన దాడిలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన దాదాపు 170 మంది టెర్రరిస్టులు చనిపోయి ఉంటారని నిర్థారించారు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన ప్రకటనపై చైనా ఇంతకాలం అభ్యంతరం చెబుతూ వచ్చింది. తాజాగా తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత స్ట్రింగర్ ఏసియా జర్నిలిస్ట్ ఫ్రాన్సెస్కా మారినో బాలాకోట్‌లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. దాడులు నిజమేనని నిర్ధారించారు. అందుకు సంబంధించిన సక్ష్యాలను ప్రపంచం ముందుంచారు. మారినో బహిర్గతం చేసిన సాక్ష్యాలతో శత్రుదేశంతో పాకిస్తాన్ పాటు.. దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారికి.. గూబ గుయ్యిమనేలా పక్కా ఆధారాలు లభించినట్టయింది.

బాలాకోట్‌ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో.. ఒక్కరు కూడా చనిపోలేదని, కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చింది ఓ ఇటాలియన్ జర్నలిస్టు.. భారత్ ఎయిర్ స్ట్రయిక్స్ ముమ్మాటికీ నిజమంటూ ఆధారాలతో సహా వెల్లడించారు. ఫిబ్రవరి 26 న బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసే యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని, ట్రీట్మెంట్ సమయంలో మరణించిన వారితో కలిపి 130 నుంచి 170 మధ్యలో జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్‌ జర్నలిస్ట్‌ ఫ్రాన్సెస్కా మారినో.. దాడులకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ప్రపంచం ముందుంచారు.  భారత యుద్ధ విమానాలు దాడి చేసి వెళ్లిన రెండున్నర గంటల తర్వాత ఉదయం 6 గంటల సమయంలో బాలాకోట్ కి 20 కిలోమీటర్ల దూరంలోని షింకియారి నుంచి పాక్ ఆర్మీ స్పాట్ కు చేరుకుందని మారిన్ తెలిపారు. క్షతగాత్రులను షింకియారి ప్రాంతంలో ఉన్న హర్కతుల్‌ ముజాహిదీన్‌ క్యాంప్‌ కు పాక్ ఆర్మీ తరలించిందని మారినో తెలిపారు. పాక్ ఆర్మీ డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ చేసినట్లు స్పష్టం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం ఆ క్యాంప్ లో ఇప్పటికీ 45 మంది ఉగ్రవాదులు ట్రీట్మెంట్ పొందుతుండగా, తీవ్రమైన గాయాల కారణంగా ట్రీట్మెంట్ సమయంలో 20 మంది చనిపోయారని మారినో తెలిపారు. కోలుకున్నవారు ఇప్పటికీ పాక్ ఆర్మీ కస్టడీలోనే ఉన్నారని మారినో అన్నారు. మృతులలో 11 మంది ఆయుధాల వినియోగంలో శిక్షణనిచ్చేవారు, బాంబులు తయారు చేయడం నేర్పించే వారు ఉన్నారని మారినో తెలిపారు. ఈ శిక్షకులలో ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారు కూడా వున్నట్టు స్పష్టం చేశారు. జైషే మహమ్మద్ నాయకత్వం మృతుల కుటుంబాలను కలుసుకొని, వారికి నగదు రూపంలో పరిహారం అందజేసిందన్న మారినో.. బాధిత కుటుంబాలు మృతుల వివరాలను వెల్లడించకుండా ఉండేందుకే జైషే సంస్థ వారికి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పినట్టు అర్థమవుతోందన్నారు.  ప్రస్తుతం జైషే క్యాంపును మదర్సాగా మార్చేశారని, నలుగురు టీచర్లు, కొంతమంది చిన్నారులకు తప్ప ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదని మారినో చెప్పారు. జైషే క్యాంప్ ఆనవాళ్లు లేకుండా చేసేశారని ఆమె తెలిపారు. బాలాకోట్‌ లో దాడి జరిగిన ఆనవాళ్లను కూడా పాకిస్తాన్ సైన్యం మాయం చేసిందని మేరినో వెల్లడించారు. కొండ దిగువన నుంచి జైషే మహమ్మద్ క్యాంపుకు వెళ్లేదారిలో కొత్త సైన్ బోర్డులను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కొండపై ‘తలీమ్-ఉల్-ఖురాన్’ నడుస్తోందని సైన్ బోర్డుల్లో పేర్కొన్నారని, కానీ వైమానిక దాడులకు ముందు అలాంటివి ఏవీ అక్కడ లేవని వెల్లడించారు. జైష్-ఎ-మహమ్మద్  చీఫ్ మసూద్ అజర్‌ పేరిట భవనాల పేర్లు కనిపించేవని, ఇప్పుడు వాటిని తొలగించారని పేర్కొన్నారు. దాడులు జరిగిన ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉందని ఫ్రాన్సెస్కో మెరినో తన కథనంలో ప్రస్తావించారు. స్థానిక పోలీసులతో పాటు ఎవ్వరినీ కొండపైకి అనుమతించడం లేదని స్పష్టంచేశారు. దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ ఎలాంటి అటాక్ చేయలేదని కబుర్లు చెప్పిందని విమర్శించారు. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని సమర్థించుకునే పనిచేసిందని మండిపడ్డారు. దాడికి సంబంధించి యావత్ ప్రపంచం గుర్తిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో తెలిపారు. భారత వైమానిక దళం దాడుల చేసిన తర్వాత షిన్‌కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందని.. ఒకవేళ భారత్ దాడి చేయకుంటే.. ఉదయం 6 గంటలకే పాకిస్థాన్ తన బలగాలను ఎందుకు మొహరించిందని ఆమె ప్రశ్నించారు. మారినో రాసిన సంచలనాత్మక కథనాన్ని ఆన్ లైన్ మ్యాగజైన్ స్ట్రింగర్‌ ఆసియా పబ్లిష్ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో మారినో కథనం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా విపక్షాలు బాల్‌కోట్‌ ఉదంతంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నతరుణంలో ఈ కథనం వెలువడటంతో వారిని షాక్ కు గురిచేసింది.

-ఎస్. కె. చారి