Monday, December 09, 2019
Follow Us on :

బర్నింగ్ బెంగాల్..!.

By BhaaratToday | Published On Jun 11th, 2019

ఓవైపు జైశ్రీరాం నినాదాలు. మరోవైపు జైహింద్ గ్రూపులు. పోటాపోటీ ర్యాలీలు. పరస్పర దాడులు, హత్యలు. బెంగాల్ లో ఆరని మంటలు. దీదీ తీరుపై సర్వత్రా విమర్శలు. బర్నింగ్ బెంగాల్..! 

సార్వత్రిక ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుదీరింది. పలు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ, బెంగాల్ లో మాత్రం ఎన్నికల వేడి ఇంకా సెగలు రాజేస్తూనేవుంది. అనూహ్యంగా బీజేపీకి ఆధిక్యం లభించడంతో.. ఓటమి భారంతో దీదీ రగిలిపోతున్నారు. ఓవైపు జైశ్రీరాం నినాదాలతో బీజేపీ శ్రేణులు హోరెత్తిస్తుంటే.. మరోవైపు తృణమూల్ ప్రోద్బలంతో జైహింద్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. పరస్పర దాడులు, హత్యలతో బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ, ఈ ‘హింసా’రాజకీయానికి తెరతీసిందెవరు..? వంగభూమిలో రాజకీయ మంటలకు ఆజ్యం పోస్తోందెవరు..? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇప్పుడు జైశ్రీరాం నినాదాలతో హోరెత్తుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కడికి వెళ్లినా.. బీజేపీ శ్రేణులు జైశ్రీరాం నినాదాలతో విరుచుకుపడుతున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న దీదీ.. బీజేపీ శ్రీణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, వారికి వ్యతిరేకంగా జైహింద్ గ్రూపులను ఎగదోస్తూ.. హింసను ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో హింసా రాజకీయాలు నానాటికీ పెరిగిపోతుండటంతో.. దీదీ సర్కార్ పై విమర్శల వర్షం కురుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన షాక్ తోనే మమతా ఇలా వ్యవహరిస్తున్నారని.. అందుకే ఎక్కడికక్కడ ప్రత్యర్థులపై తృణమూల్ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని.. బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఓటమి ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా.. ఇప్పటినుంచే ఎన్నికల రాజకీయాలకు దీదీ తెరతీశారనే ఆరోపణలు వినిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌ లో హింసాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఈ హింస.. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగుతుండటం అక్కడి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. 24 పరగణ జిల్లాలో మొదలైన అల్లర్లు పలు ప్రాంతాలకు పాకాయి. ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో నలుగురు కార్యకర్తలు మృతి చెందారు. ఇందులో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు.  ఇదిలావుంటే, గత శనివారం జరిగిన అల్లర్లలో మృతి చెందిన బీజేపీ కార్యకర్తల శవయాత్రను చేపట్టారు. అయితే ఈ శవయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ సంఘటనపై బీజేపీ నేతలు పైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టి బొమ్మను తగులబెట్టారు. దీంతో బెంగాల్‌లో మమత సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ ఎంపీలు గవర్నర్ కెశరీ నాథ్ త్రిపాఠీని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఎలాంటీ అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదిలావుంటే, అల్లర్లను అదుపులోకి తీసుకురావాడానికి ఉత్తర 24 పరగణా జిల్లాల్లోని కార్యకర్తలకు ఘర్షణ చెలరేగిన సందేశ్‌ ఖలి జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో అటు బీజేపీతోపాటు తృణముల్ కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయాల పాలయ్యారు. దీంతో కొద్ది పార్టీల మధ్య కొద్దిరోజులుగా ఉద్రిక్త వాతవారణం నెలకోంది. అటు పశ్చిమ బెంగాల్లో చెలరేగిన ఘర్షణలకు నిరసనగా బీజేపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బ్లాక్‌ డేకు పిలుపునిచ్చింది. సందేశ్‌ ఖాలీలో జరిగిన ఘర్షణలో తమ పార్టీకి చెందిన నలుగురు కనపడడం లేదని బీజేపీ ఆరోపిస్తుంటే.. తమ పార్టీకి చెందిన ఐదుగురు కనిపించడం లేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఘర్షణల సందర్భంగా ఆదివారం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆచూకీ కనిపించకుండా పోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, ఒక టీఎంసీ కార్యకర్త మృతదేహాన్ని, ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో గుర్తించారు.  ఇదిలావుంటే, రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలనును రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారనీ, సమావేశాలు పెడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని ఏడుగురు బీజేపీ పార్లమెంట్ సభ్యులు సందర్శించారు. సీఎం మమతపై బీజేపీ నేత ముకుల్ రాయ్ నేతృత్వంలోని ఏడుగురు ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ దాడుల వెనుక టీఎంసీ నేత షాజసాన్ షేక్ హస్తం ఉందని ఆరోపించారు. ఇదిలావుంటే, తాజాగా వెలుగుచూసిన ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఈ లేఖ ఎవరు రాశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో హింస నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ సర్కార్ కు మాటల యుద్ధం కొనసాగుతోంది. మమతకు వ్యతిరేకంగా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మమత, జై శ్రీరాం అన్న వారందరినీ అరెస్ట్‌ చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా మమతకు మద్దతుగా నిలిచారు. ఆమె బెంగాల్‌ ఆడపులి లాంటిదని.. ఆమెను రెచ్చగొట్టవద్దని అన్నారు. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉత్తర కొరియా నియంత కిమ్ ఉన్ జంగ్ తో పోల్చారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. మమత బెనర్జీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. ఆ భయంతోనే ఆమె అరాచకంగా మారారని గిరిరాజ్ అన్నారు. తన ప్రత్యర్దులను అణచివేయడానికి ఉత్తర కొరియా నియంత మాదిరిగా ఆమె వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ, శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమవడం పట్ల స్పందించింది. ప్రజల ప్రశాంతతకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీసు పంపించింది. కొద్ది వారాలుగా తీవ్రత తగ్గని రీతిలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేసింది. శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా సలహా ఇచ్చింది. విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అడుగుపెట్టడం అసంభవం అనే పరిస్థితి నుంచి.. అక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. క్రితంసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ జస్ట్ ఖాతాను తెరిచింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీ అక్కడ మమతా బెనర్జీకి  ప్రధాన ప్రత్యర్థిగా మారింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోగా.. అక్కడ బీజేపీ సంచలన స్థాయి ఫలితాలను సాధించింది. ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బీజేపీ అక్కడ ఇంతటితో ఆగేలా లేదు. మోదీ అంటే ఊగిపోతున్న మమతా బెనర్జీని గద్దె దించి ఆ పార్టీ అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ లో ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ గా బండి నడిపించారు. అసలు ఉనికే లేని చోట తమ ఊపు ఏమిటో చూపించారు. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలన్న తదుపరి లక్ష్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి భారంతో కుంగిపోయిన మమతా బెనర్జీని బీజేపీ అడుగడుగునా అడ్డుతగులుతూనేవుంది. దీదీ ఎక్కడికి వెళ్తున్నా బీజేపీ కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలతో విరుచుకుపడుతున్నారు. దీంతో బీజేపీకి పోటీగా ఆమె జైహింద్‌ బృందాలను ఎగదోస్తున్నారు. ఇలా హిందుత్వ శక్తులను ఎదుర్కోవడానికి ఇదే మార్గమని భావిస్తున్న దీదీ వైఖరి వల్లే ఇప్పుడు బెంగాల్ లో హింస చెలరేగుతోందనే వాదన వినిపిస్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు జైశ్రీరాం నినాదాలను మరింత ఉధృతం చేశారు. అయితే, జైశ్రీరాం నినాదాలు చేసిన వారిపై మమత ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. బీజేపీ నాయకులు జై శ్రీరాం అని రాసిన పోస్టు కార్డులను మమత ఇంటికి పంపిస్తున్నారు. సీఎం మమత బెనర్జీకి  సాధారణంగా రోజుకు 30 నుంచి 40 రకాల మొయిల్స్ వస్తుంటాయి. వాటిలో రిజిష్టర్ పోస్ట్ లు, లెటర్స్ ఉంటాయి. వీటిని దక్షిణ కొల్ కతాలోని కాళీఘాట్ పోస్టాఫీసు నుంచి డెలివరీ చేస్తారు. ఎప్పూడూ ప్రశాంతంగా ఉండే ఈ పోస్టాఫీసు ఇప్పుడు జైశ్రీరాం నినాదంతో వచ్చే పోస్టుకార్డులతో నిండి పోయింది. బీజేపీ నేతలు ఇచ్చిన పిలుపుతో ఈ తపాలా కార్యాలయానికి వచ్చే మొత్తం మెయిల్‌లో 10 శాతం పోస్ట్ కార్డులే ఉంటున్నాయి.  బీజేపీ పోస్టు కార్డు ఉద్యమానికి ధీటుగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా జైహింద్ జై బంగ్లా  నినాదాలతో రాసిన పోస్టు కార్డులను ప్రధాన మంత్రి కార్యాలయానికి పోస్ట్ చేస్తున్నారు. తృణమూల్ కార్యకర్తలు రోజుకు సుమారు 8 వేల పోస్టు కార్డులను ప్రధాని కార్యాలయానికి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, జైశ్రీరాం నినాదాలు చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వుండటంతో.. దీదీ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై శ్రీరాం అంటూ వస్తున్ననినాదాలపై మండిపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సమాధిని తానే తవ్వుకుంటుందని సినీ నిర్మాత, జాతీయ అవార్డు గ్రహిత అపర్ణ సేన్ వ్యాఖ్యనించారు. రాజకీయాలు, మతం వేరని.. జైశ్రీరాం తోపాటు, అల్లా హు అక్బర్, జై మహంకాళీ లాంటీ నినాదాలను ఎవ్వరు ఆపలేరని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ మంచి మెజారీటి సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారని అన్నారు. అయితే ఆమే ప్రవర్తన తీరుపట్ల బెంగాల్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఆమె ప్రవర్తిస్తున్న తీరే ఆమె ఓటమికి కారణమవుతుందని అపర్ణ సేన్ తెలిపారు. నిజానికి, జైశ్రీరాం నినాదాలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రారంభమయ్యాయి. ఇలా నినాదాలు చేస్తున్న వారిపై అప్పటి నుంచే ఉక్కుపాదం మోపుతున్నారు దీదీ. ఆమె వ్యవహారశైలిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలోనే విరుచుకుపడ్డారు. జై శ్రీరాం నినాదాలు చేసినవారిని దీదీ జైల్లో పెట్టారని.. నేను కూడా జై శ్రీరాం అని అంటున్నా.. నన్ను కూడా జైల్లో పెడతారా..? అంటూ మోదీ ప్రశ్నించారు. అంతేకాదు, అప్పట్లో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా సైతం దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ లో ఎవరైనా, ఎక్కడైనా జైశ్రీరాం అన్న వెంటనే మమతా బెనర్జీ ఉలిక్కి పడుతున్నారని దీదీపై విమర్శలు గుప్పించారు. ఇదేదో పెద్ద సమస్య అయినట్టు ఆమె ప్రవర్తిస్తుండటాన్ని తాను గమనించానని చెప్పారు. జైశ్రీరాం అని మన దేశంలో కాకపోతే పాకిస్థాన్ లో అంటామా..? అని ఎద్దేవా చేశారు. జైశ్రీరాం అనకుండా తమను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. జైశ్రీరాం నినాదాలు ఈమధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. దీదీ ఎక్కడికి పోయినా బీజేపీ శ్రేణులు జైశ్రీరాం నినాదాలు చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ కాన్వాయ్ దిగి మరీ అల్టిమేటమ్స్ జారీ చేస్తున్నారు మమతా బెనర్జీ. ఒక్కొక్కడి తాటతీస్తా అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో దీదీ వ్యవహారశైలిపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వంగభూమిలో కమలం అనూహ్యంగా వికసించింది. పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదు అన్నట్లు ప్రధాని మోదీతో పాటు బీజేపీతో కయ్యానికి దిగిన మమతా బెనర్జీ ఘోరంగా భంగపడ్డారు. కేంద్రంతో అనుసరించిన ఘర్షణ వైఖరికి తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మమత అనుసరించిన కుహనా లౌకికవాద విధానాలు, హిందూ వ్యతిరేక రాజకీయాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో ఓటర్లు స్పష్టంగా తిరస్కరించ డంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖామమని అంచనా వేస్తున్నారు కమలనాథులు. దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బీజేపీ పక్షాన ఈ ఎన్నికలలో పనిచేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అదే జోష్ తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీదీ సర్కార్ కు చెక్ పెట్టాలని.. బీజేపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా దీదీ సర్కార్ పై బీజేపీ జైశ్రీరాం అస్త్రాన్ని ప్రయోగించింది. ‘నీ నామం, నా నామం, జై శ్రీరాం, జై శ్రీరాం’. ఇప్పుడిదే నినాదం నేటి బెంగాల్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ, సాంస్కృతిక మార్పుకి ఒక సంకేతంగా నిలుస్తోంది. గత ఆరు దశాబ్దాలలో రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు వివిధ రూపాలు సంతరించుకుంటున్నట్లుగానే ఈ నినాదం కూడా మారుతూ వచ్చింది. ఈ నినాదంలోని మొదటి భాగమైన.. నీ నామం, నా నామం అనే నినాదం ఇన్ని సంవత్సరాలుగా ఏ మార్పు లేకుండా అట్లాగే ఉంది. బహుశా ఆ పదాల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి వల్లే ఇది సాధ్యపడి వుండవచ్చు. మనం ఎవరిని ఉద్దేశించి ఈ నినాదం వాడుతున్నామో వారితో ఒక బంధం ఏర్పాటు చేసుకోవటానికి అవసరమైన శక్తి ఈ పదాలలో ఉంది. మారుతున్న రాజకీయ పరిణామాలు, చెప్పదలుచుకున్న రాజకీయ సందేశాలని అనుసరించి నినాదంలోని రెండో భాగం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ‘నీ నామం, నా నామం వియత్నాం, వియత్నాం’ అనే నినాదం తొలినాళ్ళల్లో బెంగాలీలని ఉత్తేజపరిచింది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వియత్నాం ప్రజలకి మద్దతుగా ఈ నినాదం వచ్చింది. 1960వ దశకంలో మొదటిసారిగా కలకత్తా వీధులు నీ నామం, నా నామం, వియత్నాం, వియత్నాం నినాదంతో మారుమోగాయి. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఒక రాడికల్ ధిక్కరణతో హోరెత్తుతున్నది. బెంగాల్ కూడా ఆ హోరులో భాగం అయ్యింది. దురాక్రమణ చేస్తున్న అమెరికా సైన్యాన్ని కమ్యూనిస్ట్ మహానేత హో ఛి మిన్ ఎదుర్కొంటుండగా ఆ యుద్ధస్ఫూర్తి అక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో బెంగాల్ లోని వామపక్షాలకు ఒక ఉత్ప్రేరకం అయ్యింది. అందరూ ఒకటిగా నిలబడి ఈ పదాలని నినదిస్తూ కలకత్తా వీధులలో తమ నిరసన తెలియచేసేవారు. బెంగాల్ కమ్యూనిస్టులు ఇచ్చిన ఈ నినాదం హో ఛి మిన్  పేరు బెంగాల్‌లో ఇంటింటా తెలిసేలా చేసింది. బెంగాల్ ప్రజల మస్తిష్కంలో పాతుకుపోయిన ఈ నినాదం తొలి రూపు,.. తరువాత వచ్చిన వివిధ అనుకరణలు బెంగాల్ రాష్ట్రంలోని మూడు విభిన్న రాజకీయ దశలకి సంకేతాలు. 2011ఎన్నికలలో తృణముల్ కాంగ్రెస్ మార్క్సిస్ట్ లని ఓడించి అవిరామ లెఫ్ట్ సర్వాధికారానికి చరమ గీతం పాడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2016లో తిరిగి గెలిచారు. ప్రస్తుతం బెంగాల్ మరొక రాజకీయ సాగరమథనం అంచులలో ఉంది. దీనికి కారణం బీజేపీ. ఈ పార్టీ ఐదు సంవత్సరాల క్రితం వరకు బెంగాల్ రాజకీయ చిత్రపటంలో లేనేలేదు. ఈ నినాదాన్ని ప్రజలు వాడిన రెండవ చారిత్రక ఘట్టం నందిగ్రాం మారణకాండ. అప్పుడు ‘నీ నామం, నా నామం నందిగ్రాం, నందిగ్రాం’గా నినాదం రూపాతంరం చెందింది. బెంగాల్ రాజకీయాలు ఒక చారిత్రక మలుపు తిరిగినప్పటి నినాదం ఇది. సింగూర్‌లో టాటా వారి నానో పరిశ్రమ కోసం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తలెత్తిన పోరాటం ఆతర్వాత నందిగ్రాంలో మరింత ఉధృతంగా జరిగిన పోరాటానికి దారి తీసింది. ఒక రసాయనిక పరిశ్రమల కేంద్రం కోసం అప్పటి సీపీఎం ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం చేపట్టిన 10,000 ఎకరాల వ్యవసాయ భూముల బలవంతపు సేకరణకి వ్యతిరేకంగా 2007లో నందిగ్రాం వాసులు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు.  ఈ రైతాంగ ఉద్యమం మొదట భూసేకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో మొదలయ్యింది. కానీ రాను రాను బెంగాల్ మొత్తానికి వ్యాపించింది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని ఒక మూల జరుగుతున్న రైతాంగ పోరాటం ప్రభావం కలకత్తా వీధులలో కూడా కనిపించింది. మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో, అలాగే బెంగాల్ రాజకీయ జీవితంలో నందిగ్రాం ఒక ముఖ్య ఘట్టం. అప్పటివరకు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం మీద మొండిగా, దాదాపుగా ఓటమి అంచులలో నిలబడి పోరాటం చేస్తున్న మమతా బెనర్జీ, ఒకప్పుడు రైతుల హక్కుల కోసం పోరాడిన పార్టీకి, ముప్పై సంవత్సరాలు పాటు ఆ రైతుల విశ్వాసం మీద ఆధారపడి గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటన పోరాటానికి కేంద్ర బిందువు అయ్యారు. అటువంటి పరిస్థితుల్లో నినాదం ‘‘నీ నామం, నా నామం వియత్నాం, వియత్నాం’’ నుండి.. ‘‘నీ నామం, నా నామం నందిగ్రాం, నందిగ్రాం’’ కి మారింది. కలకత్తాలోనూ, నందిగ్రాంలోనూ అలాగే సింగూర్ లోనూ మారుమోగుతున్న పదాలు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి మరణ శాసనాలుగా మారాయి. అప్పటినుండి లెఫ్ట్ పతనం మొదలయ్యింది. 2009 పార్లమెంట్ ఎన్నికలలో తృణముల్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఐదేళ్ళ తరువాత 2014లో  జరిగిన  పార్లమెంట్ ఎన్నికలలో తమ పరాజయ పరంపరని కొనసాగించింది. కేంద్రంలో పూర్తి మెజారిటీతో నరేంద్ర మోదీ గద్దెనెక్కటంతో బెంగాల్‌లో మరొక రాజకీయ దశ మొదలయ్యింది. ఇది మునుపటి రెండు దశలతో పోల్చుకుంటే పూర్తిగా భిన్నమైనది. సీపీఎం కార్యకర్తలు మొదట తృణముల్ కాంగ్రెస్‌కి, తరువాత మరింత ఆకర్షవంతంగా కనబడుతున్న బీజేపీకి ఆకర్షితులవ్వడంతో.. అప్పటివరకు బెంగాల్‌లో ఎవరికీ పట్టని బీజేపీ ప్రాముఖ్యతలోకి వచ్చింది. ఒకప్పుడు ఉత్సాహపూరితమైన ప్రతిపక్షంగా ఉన్నసీపీఎం తాను ఆక్రమించిన రాజకీయ స్థలాన్ని ఖాళీ చేస్తూ పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2011కి చాలా ముందే జవసత్వాలు పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ వంతు వచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టి దీదీని గద్దెదింపాలని కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు నినాదం ‘‘నీ నామం.. నా నామం.. జైశ్రీరాం.. జైశ్రీరాం..’’గా రూపాంతరం చెంది.. దీదీకి నిద్రపట్టకుండా చేస్తోంది.

-s.k. chary