Thursday, October 17, 2019
Follow Us on :

‘శిశు’పాలకులు..!

By BhaaratToday | Published On Jun 20th, 2019

బీహార్ లో ఆగని మృత్యుఘోష. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత. విజృంభిస్తున్న వ్యాధులు. రాలుతున్న పసిమొగ్గలు. దేశంలో వసివాడుతున్న బాల్యం. పాలకులకు పట్టని శిశు సంక్షేమం. ఈ మృత్యుఘోష ఆగెదెన్నడు..? భావితరం నిలిచేదెప్పుడు..?

బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మెదడువాపు వ్యాధి తీవ్రంగా విజృంభిస్తూ చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. ముఖ్యంగా ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాల్లో మెదడువాపు వ్యాధి నరకం చూపిస్తోంది. ఆస్పత్రులన్నీ మెదడువాపు వ్యాధి బాధితులతో నిండిపోయాయి. ఈ మృత్యుఘోషకు కారణమెవరు..? మరణమృదంగం ఆగెదెన్నడు..? మూడు వారాల్లోనే వందలాది చిన్నారుల మృత్యుఘోష. ఈ మరణమృందంగానికి కారణమెవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యమా..? అధికారుల పట్టనితనమా..? ఐదారేళ్ల నుంచి ఇదే సమస్య వెక్కిస్తున్నా స్థానిక ప్రభుత్వం గానీ.. కేంద్రం గానీ.. సరైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతో వందలాది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. శిశు మరణాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారతే ముందుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ప్రతీ వంద మంది చిన్నారుల్లో 29 మంది భారత్‌‌కు చెందిన వారే ఉంటున్నారు.  మనదేశంలో చిన్నారుల మరణాలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు లోపాలను ఎత్తిచూపినా.. ఎన్నో సర్వే సంస్థలు భయంక నిజాలు వెల్లడించినా.. దశాబ్దాలుగా పాలకులు మొద్దునిద్ర వీడటం లేదు.

బీహార్ లో పసిమొగ్గలు నేల రాలుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు మెదడువాపు వ్యాధి ప్రబలుతుండటంతో.. కేవలం 17 రోజుల్లో 130 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ముజఫర్ పూర్ ప్రభుత్వాసుపత్రి మృత్యుగీతం ఆలపిస్తోంది. ఒక్క ముజఫర్ పూర్ లోనే కాదు.. ఆ జిల్లాలోని వేరే ప్రాంతాలతో పాటు.. పొరుగునున్న చంపారన్, మోతీహరి జిల్లాల్లో సైతం ఇప్పటికి వెయ్యిమందికిపైగా పిల్లలు మెదడు వాపు వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా చేరుతూనేవున్నారు. సోమవారం ఒక్కరోజే ఈ వ్యాధితో ముజఫర్‌ పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మరణాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల మృతితో ముజఫర్ జిల్లాతో పాటు.. పరిసర జిల్లాల్లోని ఆసుపత్రులు శోక సంద్రంగా మారాయి. తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక చికిత్స పొందుతున్న తమ పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు మెదడువాపు వ్యాధి మరణాలు ఎంతకీ తగ్గకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు చనిపోతున్నారంటూ మంత్రులపై కేసులు కూడా పెట్టారు. అయితే, అధికారులు, వైద్యులు మాత్రం పిల్లల మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మరణాలన్నీ మెదడు వాపు వ్యాధి కారణంగా సంభవించినవి కావని అంటున్నారు. హైపోగ్లైసీమియా కారణంగా కొందరు చనిపోయారని డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, మెదడువాపు వ్యాధి విజృంభణతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శిద్దామని ఆస్పత్రికి వెళ్లిన సీఎం నితీష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో నితీష్ కుమార్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితుల నినాదాల మధ్యే సీఎం నితీశ్ కుమార్ డాక్టర్లతో మాట్లాడారు. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెదడువాపు వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి నితీశ్ డాక్టర్లతో చర్చించారు. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎలాంటి చికిత్స అందించాలో తెలియకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ఆయన అంగీకరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక మెదడువాపు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఊహించనంతగా పెరుగుతుండటంతో.. కేంద్రం కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఓవైపు వందల్లో చిన్నారులు మృత్యువాత పడుతుంటే.. పాలకులు, అధికారగణం మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. సాక్ష్యాత్తు బీహార్ ఆరోగ్యశాఖామంత్రి మంగల్ పాండే వ్యవహారశైలి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కేంద్రమంత్రి హర్షవర్ధన్ తో పాటు.. ఆసుపత్రిని సందర్శించిన మంగల్‌ పాండే క్రికెట్ స్కోరు గురించి అడగటం వివాదాస్పదంగా మారింది.  ఓవైపు పిల్లల మరణాలపై అంతా రోదిస్తుంటే.. అక్కడ క్రికెట్‌ గురించి మాట్లాడుతారా అంటూ మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల మృతిపై ముజఫర్ పూర్ ఎంపీ అజయ్ నిషద్ ఆందోళన వ్యక్తం చేశారు. గాంవ్, గర్మి, గరీబీ, గండగి.. అంటే గ్రామం, వేడి, పేదరికం, పరిశుభ్రత లేకపోవడం వల్లే ఇంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనిని ఆయన 4జీ గా అభివర్ణించారు. 4జీ మీద దృష్టిపెట్టాల్సిన అవసరం వుందన్నారు. ఇదిలావుంటే, బీహార్‌లో మెదడువాపుతో చిన్నారుల మరణించడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యాక్సినేషన్‌తో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయపడింది. అమాయకులైన చిన్నారుల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని విమర్శించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్‌కు చెందిన ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పిల్లల మరణాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ముజఫర్‌పూ‌ర్‌కు పంపించాలని ఆదేశించారు.

బీహార్ లోని ముజఫర్‌ పూర్ తో పాటు.. దాని పొరుగు జిల్లాల్లో 1995 నుంచి ఏటా ఇదే కాలంలో పెద్దయెత్తున చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. చిన్నారుల మృతికి కారణమవుతున్న వ్యాధికారక వైరస్‌ ఏమిటో, అది ఎందుకు వ్యాపిస్తోందో.. ఇప్పటివరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఇదిలావుంటే, కనీసం ఈ సమస్య దాపురించే కాలానికి ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల్ని చేర్చుకుని చికిత్స అందించడానికి.. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా దీన్ని అక్యూట్‌ ఎన్సెఫలైటిస్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తున్నా అది స్పష్టంగా ఫలానా కారణంగా వస్తుందని నిర్ధారించలేదు. వైరస్‌లు, బాక్టీరియా, ఫంగీ తదితరాలవల్ల ఈ సిండ్రోమ్‌ రావొచ్చని, వడదెబ్బ తగలడం వల్ల సైతం ఇది ఏర్పడవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముజఫర్‌ పూర్‌ లో వ్యాధిగ్రస్తులైన పిల్లల్లో 98 శాతంమందికి ఏఈఎస్‌తో పాటు హైపోగ్లైసీమియా లక్షణాలుంటున్నాయన్నది వైద్యుల మాట. ఇలాంటి స్థితి వియత్నాం, బంగ్లాదేశ్‌ల తర్వాత ముజఫర్‌పూర్‌లోనే కనిపిస్తుందని అంటున్నారు. పౌష్టికాహారలోపం వల్ల లేదా సరైన తిండి తినకపోవడంవల్ల హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిలు భారీగా పడిపోవడం దీని లక్షణం. ఖాళీ కడుపున స్థానికంగా లభించే లిచీ ఫ్రూట్‌ తింటున్న పిల్లల్లో తీవ్రమైన జ్వరం రావడం, చూస్తుండగానే అయోమయావస్థలోకి వెళ్లడం లేదా పిచ్చివాళ్లుగా మారడం, చివరకు కోమాలోకి వెళ్లడం చూస్తే.. వీరందరికీ ఏఈఎస్‌తోపాటు హైపోగ్లైసీమియా కూడా ఉందని తేలుస్తున్నారు. అయితే, హైపోగ్లైసీమియా ఏర్పడటానికి లిచీ పండ్లు కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు. ముజఫర్ పూర్‌ లిచీ పండ్ల సాగుకు ప్రసిద్ధి చెందింది. దేశంలోనే గరిష్ఠంగా ఇక్కడ లిచీ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు ఆసుపత్రుల్లో చేరినవారిలో లిచీ సాగుచేసే రైతుల పిల్లలే అత్యధికంగా వున్నారు. అపరిపక్వ స్థితిలో నేలరాలిన పళ్ళను ఈ పేదపిల్లలంతా ఏరుకొని తినడం వల్ల దానిలోని హైపోగ్లైసిన్‌–ఎ అనే విషపదార్థం ప్రభావంతో వారి శరీరంలో చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. అసలే పోషకాహారలోపంతో, శరీరంలో కనీస స్థాయి చక్కెర నిల్వలు కూడా లేని ఈ పిల్లలు ఈ పండ్లతో కడుపునింపేసుకొని, రాత్రిళ్ళు ఏమీ తినకుండా నిద్రపోతుండటంతో మెదడు పనితీరుపై తీవ్రదుష్ప్రభావం కలుగుతోంది. ఈ హైపోగ్లైసిన్‌ కారణంగా శరీరంలో చక్కెర తయారయ్యే ప్రక్రియ ఆగిపోయి, ఆ కారణంగా మెదడు దెబ్బతింటుంది. దీంతో ఉదయానికల్లా పిల్లలంతా అనేకానేక రోగలక్షణాలతో చివరకు కోమాలోకి కూడా జారిపోతున్నారు. నాలుగైదు గంటల్లోగా వారిని రక్షించని పక్షంలో అత్యధికులు ప్రాణాలు కోల్పోతారు. లిచీ ఫ్రూట్‌లో ఉండే హైపోగ్లైసిన్‌–ఏ అనే పదార్ధం విషపూరితమైనదని, మితిమీరి తింటే ఆ పదార్థం శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో కూడా తేలింది. ఈ పండ్లు అధికంగా లభించే మే, జూన్‌ మాసాల్లోనే పిల్లల్లో ఈ ప్రాణాంతక వ్యాధి బయటపడుతోంది. పైగా ఈ పండ్లు తిన్నాకే వారంతా మంచాన పడుతున్నారు. కనుక వ్యాధి మూలాలు లిచీ ఫ్రూట్‌లో ఉండొచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. ఆరేళ్ళక్రితం ముజఫరాపూర్‌లో ఈ తరహా హఠాన్మరణాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైద్యబృందాన్ని నియమిస్తే, అది లిచీ పండ్లలోని హైపోగ్లైసిన్‌ తెచ్చిపెడుతున్న అనర్థాన్ని తేల్చి చెప్పింది. రెండేళ్ళ క్రితం భారత్‌–అమెరికా వైద్యబృందం కూడా ఇది వాస్తవమేనని నిర్థారించింది. ఐదేళ్ళక్రితం ఈ విధంగా అనారోగ్యం పాలైన పిల్లలకు సకాలంలో పదిశాతం డెక్స్‌ట్రోజ్‌ అందించి మూడువంతుల మందిని కాపాడుకున్న సందర్భం కూడా ఉంది. ఆ తరువాత లిచీ సాగుకాలంలో పిల్లలెవరినీ తిండితినకుండా నిద్రపోనివ్వవద్దంటూ.. ముజఫర్ పూర్‌ దాని సమీప జిల్లాల్లో ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు చేపట్టడంతో మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, ఆశావర్కర్లు, స్వచ్ఛంద వైద్యబృందాలతో గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చైతన్యం కల్పించే పనిలో ఈ ఏడాది బిహార్‌ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఇక, చాలామంది ఆశావర్కర్లు తమకు కనీసం ఓఆర్‌ఎస్‌ కూడా అందుబాటులో లేదని ఫిర్యాదు చేస్తుంటే, అనేక అంబులెన్సుల్లో డెక్స్‌ట్రోజ్‌ ఇంజక్షన్లు ఇచ్చే సదుపాయం కూడా లేదని చెబుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రాథమిక వైద్యకేంద్రాలు చేతులెత్తేయడంతో, తల్లిదండ్రులు గ్రామాలనుంచి పిల్లలను జిల్లా ఆసుపత్రులకు తరలించేలోగానే అత్యధికశాతం కేసుల్లో ప్రాణాలు పోతున్నాయి. దీంతో ప్రతీ ఏటా ఎదురయ్యే సమస్య పరిష్కారంలో ఇలా విఫలం కావడం క్షమించరాని నేరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, పిల్లల మరణాలకు సంబంధించిన కారణాలపై.. ముజఫర్‌ పూర్‌ లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేస్తామని, పిల్లలకు వంద పడకల ఐసీయూ యూనిట్, వైరాలజీ ల్యాబ్‌ నెలకొల్పుతామని  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. అయితే, ఈ పని ముందే జరిగుంటే సమస్య ఇంత ముదిరేది కాదని స్థానికులు చెబుతున్నారు. నిజానికి, శిశు మరణాలు కేవలం బీహార్ కే పరిమితం కాలేదు. ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లోనూ వుంది. కాకపోతే, బీహార్ లో ఎక్కువగా వుంది. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో ప్రకటించింది. దానికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి కూడా. కానీ ఎందుకో ఇంతవరకూ అది సాకారం కాలేదు. అంతకు చాన్నాళ్లముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. మొన్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తామొస్తే ఆరోగ్య పరిరక్షణను ప్రాథమిక హక్కు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్రకటించారు. ఇలా ఎవరెన్నిసార్లు చెబుతున్నా ఆరోగ్యరంగానికి కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మన దేశంలో చికిత్సకు అవకాశమున్న వ్యాధుల వల్ల ఏటా 24 లక్షలమంది జనం చనిపోతున్నారంటే వైద్య సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్ధమవుతుంది. మనదేశంలో ప్రతి లక్షమంది రోగగ్రస్తుల్లో 122 మంది నాసిరకం వైద్యసదుపాయాల కారణంగా చనిపోతున్నారని లాన్‌సెట్‌ గ్లోబల్‌ సర్వే చెబుతోంది. ఇది బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ దేశాలతో పోలిస్తే చాలాఎక్కువ. ముజఫర్‌ పూర్, దాని పొరుగునున్న జిల్లాల్లో పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడం, పౌష్టికాహార లోపం లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదు. కనీసం అక్కడ తగినంతమంది వైద్యులున్నా, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా పసివాళ్ల ప్రాణాలు ఇలా గాల్లో కలిసేవి కాదు. వ్యాధి సోకిన నాలుగు గంటల్లోగా పిల్లలకు 10 శాతం డెక్స్‌ట్రోజ్‌ను అందిస్తే వారు సత్వరం కోలుకునే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆమాత్రం సదుపాయమైనా అందుబాటులో లేదు. చిత్రమేమంటే బిహార్‌కు పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌ తూర్పుప్రాంతంలో సైతం పౌష్టికా హారలోపం అధికంగా ఉంది. దేశంలో ఏటా సంభవించే పిల్లల మరణాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 35 శాతంగా వుందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతోంది. ముజఫర్‌పూర్‌ను స్మార్ట్‌ నగరంగా ప్రకటించమంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్‌ ప్రభుత్వం ఆమధ్య నివేదిక అందజేసింది. దాని ప్రకారం ఆ నగరంలో ప్రతి లక్షమంది రోగులకు 80 మంది వైద్యులున్నారు. అక్కడి ఇతర జిల్లాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి గనుక ముజఫర్‌పూర్‌ చాలా మెరుగ్గా ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటే చాలాచోట్ల లక్షమంది రోగులకు సగటున కేవలం ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో కనీసం లక్షమంది రోగులకు వందమంది వైద్యులుండటం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలన్నిటికీ హితవు పలికింది. మరి పట్టించుకునేవారేరి..? వైద్యరంగంపై సమగ్రమైన దృక్పథంతో వ్యవహరించి సమూల ప్రక్షాళన చేయడానికి అవసరమైన నిధులను, మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థ బాగుపడదు. అంతవరకూ ఈ మరణమృదంగం ఆగదు.

దేశంలో సంభవించిన శిశు మరణాలపై పరిశోధనలు జరిపిన.. అమెరికా సంస్థ జాన్స్ హోప్కిన్స్ టూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌.. భయంకర నిజాలు వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, అందుకు కారణమైన అంశాలపై పరిశోధన జరిపిన ఈ సంస్థ.. చిన్నారుల మరణాలు అత్యధికంగా ఉంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే ఉందని తేల్చింది. ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉందని, గోవాలో కన్నా ఆ రాష్ట్రంలో ఏడు రెట్లు ఈ రేటు అధికంగా ఉందని తెలిపింది. 2016 సంవత్సరంలో వెల్లడైన పిల్లల అకాల మరణాలతో ఈ విషయం స్పష్టం అయింది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక శిశు మరణాలు నమోదయ్యాయి. వైద్య విజ్ఞాన వారపత్రిక లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాలల విషాద భారతం గురించి తెలియచేసిన ఈ అధ్యయనంలోనే మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. పేద సంపన్న దేశాలలో బాలల మరణాలపై కొట్టొచ్చే వ్యత్యాసాలు ఉన్నట్లు తేల్చారు. సగటున పేద దేశాలలోని పిల్లలు ఎక్కువగా మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. భారత దేశంలో శిశు మరణాల సంఖ్య క్రమంగా తగ్గినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మన దేశంలోనే పసికందుల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శిశు మరణాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారతే ముందుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ప్రతీ వంద మంది చిన్నారుల్లో 29 మంది భారత్‌‌కు చెందిన వారే అయి ఉన్నారు. మొత్తం 186 దేశాల్లో ఈ స్వచ్ఛంధ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయంలో బైటపడింది. అన్ని దేశాల కంటే లక్సంబర్గ్‌లో శిశు మరణాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. భారత్‌లో పౌష్టికాహార లోపం వల్లే ఎక్కువ శిశు మరణాలు నమోదవుతున్నాయి. అయితే 1990తో పోలిస్తే ఇండియాలో పసిపిల్లల మరణాలు సగానికి పైగా తగ్గాయి. నవజాత శిశు మరణాలను తగ్గించడంలో దేశంలోని సగానికి పైగా జిల్లాలు విఫలమయ్యాయి. దీంతో 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాన్ని అవి అందుకోలేకపోయాయి. ఈ సంస్థ ఇటీవల వెలువరించిన నివేదికలో వెల్లడైన కఠోర సత్యమిది. అత్యంత పేలవమైన పురోగతి వున్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశువు నుండి ఐదు సంవత్సరాల వయస్సుగల చిన్నారుల మరణాలు మన దేశంలోనే ఎక్కువ. ఏడాదికి 11 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ప్రతి వెయ్యి మందికి 12 మంది చనిపోతుంటే, మన దేశంలో 29 మంది మరణిస్తున్నారు. 1990లో వెయ్యి మంది నవజాత శిశువులకు గాను 109 మంది మరణించేవారు. 2013 నాటికి ఆ సంఖ్య 50కు చేరింది. అయితే నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇది రెట్టింపు. మరణాల్లో లింగ వివక్ష కొనసాగుతోంది. నవజాత శిశు మరణాల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా వుంటున్నారు. ఇది ఐదేళ్ల లోపు శిశు మరణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. లింగ వివక్షనూ చూపుతుంది. సామాజిక ఆర్థిక అసమానతలు, భౌగోళిక అంతరాలు, మహిళల నిరక్షరాస్యత, ప్రభుత్వ పథకాల అమలు తీరు, అవసరమైన లేక అందుబాటులో వున్న ఆరోగ్య సంరక్షణ వంటి కారణాల వల్ల ఇటువంటి మరణాలను నియంత్రించడంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా భారతదేశంలో శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. 2015 లో ప్రపంచంలోనే దీనికి సంబంధించి ఇండియా మొదటి స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో శిశు మరణాలు దాదాపు 21 లక్షల వరకూ ఉన్నాయి. అయితే 2015 నాటికి ఈ సంఖ్య 11 లక్షలకు తగ్గింది. అయితే ప్రపంచంలోనే ఇది అత్యధిక బాలల మరణ సంఖ్యగా రికార్డు అయింది. అసోంలో అత్యధికంగా బాలలు బలి అవుతున్నారు. నవజాత శిశువుల దశలలో తలెత్తే సమస్యలు, సంక్రమిత వ్యాధులు సోకడం, వాటి నుంచి సరైన రీతిలో పిల్లలను కాపాడుకోలేకపోవడం వంటి కారణాలతో పిల్లలు ఎక్కువగా మృత్యువాత పడుతన్నారు. కొన్నిరాష్ట్రాలలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల టీకాలు, ప్రసవం తర్వాత జాగ్రత్తలపై సరైన అవగావహన కల్పించకపోవడం కూడా శిశు మరణాలు పెరగడానికి కారణమవుతున్నాయి.  దేశంలో శిశు మరణాలకు మొదటి కారణం పౌష్టికాహార లోపమే. పౌష్టికాహార లోపం వల్లే దేశంలో 40 శాతం శిశు మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇదే వ్యాధుల బారినపడేలా చేస్తోంది. వారి భవిష్యత్‌ జీవితానికి అడ్డంకిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బక్కచిక్కిపోతున్న బాల్యాన్ని చక్కదిద్దడానికి, పోషకాహారాన్ని అందించడంలో ఉన్న సమస్యలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాలపై ఇటీవల నీతి ఆయోగ్‌ కొన్ని సిఫార్సులు చేసింది. ‘నవీన భారత్‌ ఎట్‌ 75’ పేరిట ఒక వ్యూహ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. శిశువు ఎదుగుదలకు తొలి 1000 రోజులే కీలకమని, 80 శాతం మెదడు ఎదుగుదల ఈ దశలోనే జరుగుతుందని, ఆ దశలో పౌష్టికాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని సూచించింది.  దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ 2005నుంచీ అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పడుతుండటం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే అయినా.. ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గణాంకాలను అందుకోవడంలో ఇంకా చాలా దూరంలోనే వున్నాం. 2030 నాటికి ప్రతి వెయ్యి ప్రసవాలకు అయిదేళ్లకన్నా తక్కువ వయసున్న చిన్నారుల మరణాలు 25లోపు, నవజాత శిశు మరణాలు 12లోపునకు తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రభుత్వ వైద్య సేవల వ్యవస్థను పటిష్ఠపరచడంతోనే అది సాధ్యపడుతుంది. వైద్యరంగంలో ప్రజలందరికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం తప్పనిసరి. అంతకన్నా ముందు అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస వసతులను సమకూర్చాలి. దీనితోపాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ప్రభుత్వాలు సాకులు చూపించకుండా తక్షణమే భర్తీ చేయాలి. ఆరోగ్యం విషయంలో ప్రజలు మూఢనమ్మకాలను అధిగమించి శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించేలా చేయడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. శిశువుల భావిజీవితం చిన్నాభిన్నం కాకుండా కాపాడే అన్ని టీకా మందులను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉంచడం ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అనారోగ్యం రాకముందే.. నివారణ చర్యలపై  దృష్టి పెడితే.. ఆరోగ్యవంతమైన భావితరం మనకు దక్కుతుంది.

-ఎస్. కె. చారి