Thursday, October 17, 2019
Follow Us on :

కమల కాంతులు..

By BhaaratToday | Published On May 29th, 2019

నాడు వాజ్ పేయి, అద్వానీల సారథ్యం. నేడు మోదీ, అమిత్ షాల నాయకత్వం. రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం. ఇప్పుడు 303 సీట్లతో తిరుగులేని ఆధిక్యం. వారసత్వ రాజకీయాలకు ధీటుగా.. అవినీతి పార్టీలకు పోటీగా.. నాలుగు దశాబ్దాల అలుపెరుగని పోరాటం. కమల కాంతులు.. 

దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతాపార్టీ అంచెలంచెలుగా ఎదిగి.. నేడు విపక్ష పార్టీలు అందుకోలేనంత ఉన్నత స్థితికి చేరుకుంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం జనతా పార్టీ నుంచి వేరుపడిన జనసంఘ్ అభిమాన నేతలు.. భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆరంభ దశలో బీజేపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. బురదలో పుట్టిన కమలం అంటూ ఈసడించారు ప్రత్యర్ధులు. అయితే రాజకీయాలనే బురదలో.. స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని.. ధీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. జాతీయవాద రాజకీయ పార్టీగా, వారతస్వ రాజకీయాలకు అతీతంగా.. పూర్తి స్థాయి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న బీజేపీ ప్రస్థానం అంత తేలికగా సాగలేదు. వాజ్ పేయి, అద్వానీల మార్గనిర్దేశనంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. నేడు మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అటల్‌ బిహారి వాజ్‌ పేయి, అద్వానీల నాయకత్వంలో పరిణతి చెందిన బీజేపీ.. ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వం, అమిత్‌ షాల సారథ్యంలో కొత్త శిఖరాలను అధిరోహించింది. మరింత విస్తరిస్తోంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా, పటిష్ఠ జాతీయవాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉంది. దానికో సిద్ధాంతం ఉంది. 2014లో అఖండ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ జగన్నాథ రథం.. అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఏటేటా రాష్ట్రాల్లో విస్తరిస్తూ వస్తోంది. గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు.. ఈశాన్య భారతంలో జెండా ఎగురవేసింది. త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ.. భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ.. అఖండ మెజారిటీని కైవసం చేసుకుని మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతోంది. అంతేకాదు, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులున్నారు. మరో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలక చారిత్రక సందర్భంలో.. సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించిన వేళ.. మొన్న ఏప్రిల్ 6న బీజేపీ 39వ సంస్థాపక దినోత్సవం జరుపుకుంది. ఈ ప్రయాణం సాధారణమైంది కాదు. ఒక జాతీయవాద పార్టీగా ఆవిర్భవించి, జాతీయ పార్టీగా మారి, సామాన్య ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని క్రమంగా దేశమంతటా విస్తరించడం.. బీజేపీ చారిత్రక గమనంలో అపూర్వ ఘట్టం. లక్షలాది కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి బీజేపీ సిద్ధాంతాన్ని విస్తరింపజేసినందువల్లే పార్టీకి నేడు దేశవ్యాప్త ఆమోదయోగ్యత లభించిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అటల్‌ బిహారి వాజ్‌ పేయీ, అద్వానీల నాయకత్వంలో పరిణతి చెందిన బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వం, అమిత్‌ షాల సారథ్యంలో కొత్త శిఖరాలను అధిరోహించింది. మరింత విస్తరిస్తోంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా, పటిష్ఠ జాతీయవాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉంది. దానికో సిద్ధాంతం ఉంది. 1980 ఏప్రిల్‌ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో దాదాపు 3 వేల 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ జనతాపార్టీ పేరుతో కొత్త రాజకీయ పక్షం ఏర్పడాలని ఏప్రిల్‌ 6న సదస్సులో తీర్మానించారు.  వాజ్‌ పేయిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కమలాన్ని కొత్త చిహ్నంగా.. మూడింట ఒకవంతు ఆకుపచ్చ, మిగిలిన రెండు భాగాల్లో కాషాయం రంగుపై చిత్రించిన కమలంతో జెండాను నిర్ణయించారు. ఆ తరవాత 1980 డిసెంబర్‌ 28-30 తేదీల్లో ముంబయిలో జరిగిన బీజేపీ జాతీయమండలి ప్లీనరీ సదస్సులో అటల్జీ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైంది. ‘ఒక చేతిలో బీజేపీ రాజ్యాంగం, మరో చేతిలో సమానత్వ నినాదంతో మనం ముందడుగు వేద్దాం..’ అంటూ ఆయన ప్రకటించారు. ‘అంధేరా ఛటేగా, సూరజ్‌ నికలేగా ఔర్‌ కమల్‌ ఖిలేగా’.. అంటే, ‘అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు.. కమలం వికసిస్తుంది’ అని అటల్జీ భవిష్యవాణి వినిపించారు. పార్టీ ఆవిర్భావ సదస్సులో వాజ్ పేయి చెప్పినట్టుగానే కమలం పరిపూర్ణంగా వికసించింది. ఇప్పుడు దేశం మొత్తం ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడుతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఏ కాంగ్రెసేతర పార్టీకి సాధ్యం రీతిలో.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసింది బీజేపీ. నరేంద్ర మోదీ చరిష్మా, అమిత్ షా నాయకత్వంలో.. ఏకంగా 303 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షాలకు అందనంత ఎత్తున నిలిచింది. భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2014లో 282 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన బీజేపీ.. ఈసారి మరో 21 సీట్లను పెంచుకుని.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నింటినీ మట్టికరిపించింది. నిజానికి ఐదేళ్లు అధికారంలో వున్న ఏ పార్టీకైనా ప్రజల్లో వ్యతిరేకత పోగుపడటం సర్వసాధారణం. కానీ, బీజేపీ మాత్రం ఈ ఐదేళ్ల కాలంలో ప్రజాభిమానాన్ని మరింత ప్రోదిచేసుకుంది. ఇందుకు మోదీ అందించిన అవినీతిరహిత సుస్థిర పాలన.. అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన సంక్షేమ పథకాలు.. బలీయమైన విదేశీ విధానమే కారణమని చెప్పకతప్పదు. పాకిస్తాన్ వంటి శత్రుదేశాల తాటాకు చప్పుళ్లకు సైతం.. గతంలె అధికారంలో వున్న పార్టీలు బెదిరిపోయేవి. కానీ, అందుకు భిన్నంగా.. మెరుపుదాడులతో ఉగ్రదేశానికి ముచ్చెమటలు పట్టించిన వైనం.. డ్రాగన్ చైనా దూకుడుకు చెక్ పెట్టిన దౌత్య నీతి.. మోదీ అనుసరించిన పటిష్టమైన విదేశాంగ విధానం.. ప్రతి ఓటరును ఆలోచింపజేసింది. దీంతో మరోసారి బీజేపీకి అఖండ మెజారిటీని అందించారు ప్రజలు.  దశాబ్దాల తరబడి వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టి.. అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ విజయ ప్రస్థానం ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. దీనివెనుక శ్యామాప్రసాద్ ముఖర్జీ దూరదృష్టి.. వాజ్ పేయి, అద్వానీల మార్గనిర్దేశనం.. మోదీ, అమిత్ షా నాయకత్వ పటిమతో పాటు.. నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన లక్షలాది బీజేపీ కార్యకర్తల కృషి దాగివుంది. అసలు బీజేపీ పుట్టిందే పటిష్టమైన జాతీయభావ పునాదుల నుంచి. బీజేపీ పూర్వ రూపం భారతీయ జన సంఘ్.. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం అని భావించారు ప్రముఖ జాతీయవాద నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ. 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో ప్రభావితులైన జాతీయ వాదులు ఆ పార్టీలో చేరారు. ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జన సంఘ్ 3 సీట్లే సాధించినా, 1971 ఎన్నికల నాటికి 22 సీట్లలో ధీటైన ప్రతిపక్షంగా రూపొందింది. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతి పక్షాలన్నీ ఒకటి కావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం.. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గ కుమ్ములాటలలో ఎక్కువ కాలం నిలవలేదు ఈ ప్రభుత్వం. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులంతా జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీని ప్రారంభించారు. అలా 1980లో భారతీయ జనతాపార్టీ ఏర్పడింది. దేశమంతా.. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరా గాంధీ హత్యానంతం జరిగిన 1984 పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ పార్టీని ముందుకు నడిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇచ్చింది. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృత్తమై ఈ ప్రభుత్వం పతనమైంది. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ, తొలి విడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణిచడంతో తదుపరి పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 120 సీట్లు వచ్చాయి. 1996లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లును కైవసం చేసుకున్నా కనీస మెజారిటీ రాలేదు. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్ పేయి. బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న రోజులవి. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ ఘోరంగా విఫలమైంది. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ.. ఎన్డీఏను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే అర్థాంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటల్జీ నేతృత్వంలో ఐదేళ్లు విజయవంతంగా సాగిన ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పథంలో అద్భుత విజయాలను సాధించింది. కానీ, మితిమీరిన అంచనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. పదేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అఖండ మెజారిటీని అసాధించింది. ఈ ఘనతకు కారకుడు నరేంద్ర మోదీయే. దేశ ప్రజల మనసును చూరగొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్న ప్రధానిగా మోదీ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చేప్పట్టిన కార్యక్రమాలు ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ మరింత పెంచాయి.  ముఖ్యంగా పెద్దనోట్ల రద్దుతో నల్ల ధనంపై యుద్ధం ప్రకటించారు. అవినీతి తావులేని పారదర్శక పాలన అందిస్తున్నారు. స్వచ్చ్ భారత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు దీటైన జవాబు ఇస్తున్నారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మరింత మమేకం అయ్యారు మోదీ. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. అయితే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అంతలోనే పుంజుకుని తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఢంకా మోగించింది.

వాజ్‌ పేయి సారథ్యంలో 1998, 1999ల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్‌ తప్ప దేశాన్ని మరెవరూ పాలించలేరన్న భ్రమలు కొనసాగుతున్న రోజులవి. ఆ తరుణంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌ పేయి భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించారు. అనుసంధాన విప్లవానికి శ్రీకారం చుట్టారు. కార్యదక్షతతో దాదాపు 23 పార్టీలను ఒక్కతాటిపై నిలిపి అయిదేళ్లపాటు జనరంజకంగా పాలించారు. అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో భారతీయ జనతాపార్టీకి పటిష్ట పునాదులు పడ్డాయి. ఆ ప్రభావంతో పార్టీ ఆవిర్భావం నుంచీ లోక్‌ సభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్‌పట్ల సానుభూతి పవనాలు వీచాయి. ఆ నేపథ్యంలో ఎనిమిదో లోక్‌ సభలో బీజేపీ రెండు సీట్లకే పరిమితమైంది. ఆపై అద్వానీ రథయాత్ర పరిణామాలవల్ల బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతూ వచ్చింది. తొమ్మిదో లోక్‌ సభలో 85 సీట్లు, 10వ లోక్‌ సభలో 120 సీట్లు, 11వ లోక్‌ సభలో 161 సీట్లు, 12వ లోక్‌ సభలో 182 సీట్లు, 13వ లోక్‌ సభలో 182 సీట్లు రావడమే ఇందుకు నిదర్శనం. ఆ తరవాత 14వ లోక్‌ సభలో బలం 138 సీట్లకు, 15వ లోక్‌ సభలో 116 సీట్లకు తగ్గినా.. 2014లో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించిన తరువాత ప్రజలకు భారతీయ జనతాపార్టీలో దీటైన ప్రత్యామ్నాయం కనబడింది. ఎన్నడూ లేనంతగా బీజేపీని 282 స్థానాల్లో ప్రజలు గెలిపించారు. ప్రప్రథమంగా కాంగ్రెసేతర ప్రత్యామ్నాయానికి పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఈసారి ఏకంగా 303 స్థానాల్లో గెలిపించి బీజేపీపై అచెంచలమైన విశ్వాసం వుంచారు ఓటర్లు. బీజేపీ విజయప్రస్థానంకేంద్రానికే పరిమితం కాలేదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ లోనూ- ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి అజెండాపట్ల ప్రజలు తమ విశ్వాసం ప్రకటించారు. కుల, మత రాజకీయాలను అధిగమించి అభివృద్ధి, సుపరిపాలన అజెండాను ప్రజల ముందుకు తెచ్చిన ప్రధాని మోదీ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. చరిత్రాత్మకమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి, నల్లధనం, అవినీతిపై మోదీ పోరాటానికి ఈ ఎన్నికల ఫలితాలు అండగా నిలిచాయి. కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలకు ఈ ఎన్నికలు స్వస్తి పలికాయి. బీజేపీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అపవాదులు, అపోహలు, తప్పుడు ముద్రలకు లోనైంది. బీజేపీని ఉత్తరాది రాజకీయ పక్షంగా, వ్యాపారుల పార్టీగా, అగ్రవర్ణాల పార్టీగా, చివరకు శాకాహారుల పార్టీగా కూడా చిత్రించారు. మతతత్వ రాజకీయ పక్షమనీ అన్నారు. కానీ, అలాంటి పార్టీ ఇప్పుడు అంచెలంచెలుగా విస్తరించి ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పక్షంగా ఎదిగింది. పదకొండు కోట్లమంది ఈ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మునుపెన్నడూ లేని మెజారిటీ వుంది. దేశవ్యాప్తంగా శాసన సభల్లో పార్టీకి సుమారు వెయ్యి మందికి పైగా ఎమ్మెల్యేలున్నారు. 12 రాష్ట్రాల్లో సొంతంగా.. మరో 6 రాష్ట్రాలతో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో వుంది. భౌగోళిక ప్రాతిపదికన దేశంలో 70 శాతానికిపైగా భూభాగంలో పార్టీ విస్తరించింది. జనాభాలో 60 శాతానికి పైగా ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఒకప్పుడు బీజేపీని అగ్రవర్ణాల పార్టీ అని ఎద్దేవా చేశారు. కానీ, పార్టీలో షెడ్యూల్డు కులాల సభ్యులే నేడు పార్లమెంటులో అధికంగా ఉన్నారు. గిరిజన ఎంపీలు అత్యధిక సంఖ్యలో బీజేపీలోనే ఉన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో వెనకబడిన వర్గాల ఎంపీలు, రైతు ప్రతినిధులు, యువతరం ప్రతినిధులు పార్లమెంటులో అందరికన్నా బీజేపీలోనే ఎక్కువ. మహిళా ఎంపీల్లోనూ అధికులు పార్టీలోనే ఉన్నారు. వాజ్‌ పేయి సారథ్యంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అనుసంధాన విప్లవానికి, స్వావలంబనకు పునాదులు వేసింది. ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలో రిఫార్మ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ ఫామ్‌ మంత్రంగా సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు చేరవేసేందుకు కృషి జరుగుతోంది. సమాజంలో అన్ని వర్గాలను చేరుకోవడమే ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ లక్ష్యం. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యత్యాసాలు తొలగించడం, అవినీతిపై పోరాటం, నల్లధనాన్ని వెలికి తీయడం, పారదర్శక, కుంభకోణాలు లేని స్వచ్ఛమైన పాలన అందించడం; పేదలు, రైతులు, మహిళలు, మధ్యతరగతి వర్గాలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని సాకారం చేయడమే ధ్యేయంగా ముందుకుసాగిన మోదీ సర్కార్ మరోసారి జనం విశ్వాసాన్ని చూరగొన్నది. ఈ నమూనా పాలన, అభివృద్ధి పథంలో సాధించిన విజయాలు మోదీని ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన పేద ప్రజలకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశం అంతటా అస్థిరత, విధానాల ప్రతిష్టంభన, నాయకత్వలేమి కొనసాగుతున్నాయి. ఆ తరవాత మోదీ సర్కారు ఈ జడత్వాన్ని బద్దలు కొట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం స్వతంత్ర భారత చరిత్రలో వినూత్న పరిణామం. ఐదేళ్ల పాలన తరవాత వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా అద్భుత పాలన సాధ్యపడింది. ఒక్క అవినీతి ఆరోపణ కానీ, కుంభకోణం కానీ మచ్చుకైనా తలెత్తలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగులుపెట్టాయి. మోదీ మేనియా ఇలాగే కొనసాగితే ఇక తమకు పుట్టగతులుండవని ప్రతిపక్ష పార్టీలకు అర్థమైందని.. దీంతో బీజేపీ సర్కార్ ను ఎలాగైన గద్దెదించాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి విపక్షపార్టీలు. మొదట అసహనం బ్యాచ్, తరువాత అవార్డు వాపసీ బ్యాచ్, అనంతరం తుక్డే తుక్డే బ్యాచ్, మొన్నటిమొన్న ద్రవిడ నాడు పేరుతో మరో కొత్త బ్యాచ్. ఆ తర్వాత నార్త్ సౌత్ బ్యాచ్. మొన్నటికి మొన్న దళితుల ఆందోళనలను పక్కదారి పట్టిస్తూ.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకునే మరో బ్యాచ్ కూడా తెరపైకి వచ్చింది. ఇదిలావుంటే, సిద్ధాంతాలను పక్కనబెట్టి అవసరమైతే అనైతిక పొత్తులు పెట్టుకోనైనా.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఢీకొట్టేందుకు ప్రయత్నించాయి. అయితే, ఇక్కడ ప్రత్యర్థుల పప్పులుడకలేదు. వారి కుటిల పన్నాగాలను గ్రహించిన ఓటర్లు విపక్ష పార్టీలన్నింటికీ మడతబెట్టి మరీ మట్టికరిపించారు. బీజేపీకి వరుసగా రెండోసారి పట్టం కట్టారు.

2014 సాధారణ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తూ.. ఏకంగా 282 స్థానాలను గెలుచుకున్నారు కమలనాథులు. బీజేపీ దెబ్బకు స్వతంత్ర భారతంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. కేవలం 44 సీట్లతో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేపోయింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ.. ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కమలనాథులు. ఈశాన్యంలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి.. త్రిపురలో విజయదుందుభి మోగించారు. అటు మేఘాలయ, నాగాలాండ్ లలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో నేరుగా.. మరో 6 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను కలుపుకుని.. మొత్తం 18 అధికారంలో వున్నారు కమలనాథులు. ఇక 2017 లోనైతే బీజేపీకి ఎదురే లేకుండా పోయింది. ఆ సంవత్సరం కమలనాథులకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. 2017లో భారతీయ జనతాపార్టీకి అఖండ విజయాలను అందించింది. కమలదళం దాదాపు దేశమంతా విస్తరించింది ఆ ఏడాదే. 2017లో ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు నాలుగుచోట్ల విజయదుందుభి మోగించారు. రెండుచోట్ల మాత్రం.. బొటాబొటీ మెజారిటీ వచ్చినా.. అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, ఒక్క పంజాబ్‌ను మాత్రం ఆ పార్టీకి మింగుడుపడలేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. బీజేపీకి 2017 బాగా కలిసొచ్చింది. సాధారణ ఎన్నికలతో పాటు.. జమ్మూ కశ్మీర్‌, హర్యానా, మహరాష్ట్ర, జార్ఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ భాగస్వామిగా అధికారాన్నిపంచుకుంది. అయితే, ప్రత్యేక హోదా పోరుతో ఏపీలో టీడీపీ, బీజేపీ మైత్రికి బ్రేక్ పడింది. ఇక 2015లో జరిగిన ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటములను చవిచూసింది. 2016లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ కమలదళానికి చేదు ఫలితాలే వచ్చాయి. అయితే, ఫెమా ఖండూ పార్టీ మారడంతో.. అరుణాచల్‌ ప్రదేశ్‌ను బీజేపీ దక్కించుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ జయకేతనం ఎగురవేయడంతో.. పెమా ఖండూ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక 2017లో జరిగిన గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లలో అధికారం దక్కించుకుంది బీజేపీ. అలాగే బిహార్‌లో జరిగిన రాజకీయ మార్పులతో.. అధికార కూటమిలో భాగస్వామిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే బీజేపీ ఓటమి పాలైంది. శిరోమణి అకాళీదళ్‌తో కలిసి పోటీ చేసిన కమలం పార్టీకి ఇక్కడ చుక్కెదురైంది. బీజేపీకి కొత్త ఊపు, శక్తిని ఇచ్చింది యూపీ అసెంబ్లీ ఎన్నికలే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 325 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలను నామమాత్రపు స్థాయికి పరిమితం చేసింది. పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్మాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికలకు బీజేపీ వెళ్లినా ప్రజలు మాత్రం తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. తరువాత యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రం 2017 వరకూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం. ముఖ్యమంత్రిగా హరీష్‌ రావత్‌ వ్యవహరించారు. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 69 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ శాసనసభలో.. 57 చోట్ల బీజేపీ విజయదుందుభి మోగించింది. ప్రస్తుతం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పక్కన పెట్టారు. 2012లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకూ గోవా ముఖ్యమంత్రిగా వ్యహరిస్తున్న మనోహర్‌ పారికర్‌ను మోదీ.. రక్షణ మంత్రిగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో పారికర్‌ స్థానంలో లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పర్సేకర్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి రెండో స్థానంలో నిలించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్‌ పారికర్‌ తిరిగి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల మనోహర్ పారికర్ మరణించడంతో.. యువనేత ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇక మణిపూర్‌లోనూ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 11 మంది స్వతంత్రులను కలుపుకుని బీరేన్‌ సింగ్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనూ కమలనాధులు జయకేతనం ఎగురవేశారు. అప్పటిదాకా అధకారంలో వున్న వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీని గద్దె దింపి.. అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. మొత్తం 68 స్థానాల్లో బీజేపీ 44 చోట్ల విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం.. బీజేపీ కంచుకోటగా అయిన గుజరాత్ లో మాత్రం.. ఆ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. వరుసగా ఐదు పర్యాయాల నుంచి అధికారంలో వుండి కూడా.. ఆరోసారి ఇక్కడ విజయం సాధించడం గొప్ప విషయమే. అయితే ఈసారి హస్తం పార్టీ గట్టిపోటీ ఇవ్వడంతో.. మునుపెన్నడూ లేనంతంగా కమలదళం మెజారిటీకి భారీగా కోత పండింది. ఇక్కడ బీజేపీకి గతంతో పోలిస్తే సీట్లు పెద్దయెత్తున తగ్గాయి. మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సీట్లకంటే కేవలం ఏడు సీట్లను ఎక్కువగా సాధించింది.. మొత్తానికి అధికారాన్ని నిలబెట్టుకోగలింది. బిహార్‌ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించింది. అయితే.. సరిగ్గా రెండేళ్లు కూడా తిరగముందే నితీష్‌ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి వరకూ కాంగ్రెస్‌, జేడీయూలు అధికార కూటమిలో ఉండగా.. ప్రస్తుతం అవి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఎలాగైతేనేం... మిత్రపక్షంతో కలిసి బీహార్ లో మళ్లీ అధికారంలో నిలిచింది బీజేపీ. ఇక ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతున్న బీజేపీకి దక్షిణాదిన 2017లో శృంగభంగం తప్పలేదు. ముఖ్యంగా.. తమిళనాట ఓవైపు ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలతో కలిసి పద్మవ్యూహం పన్నినా.. అది వర్కవుట్ కాలేదు. ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి కళ్లు బైర్లు కమ్మివుంటాయి. ఎందుంటే, అక్కడ ఆ పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 12 వందలు మాత్రమే. మొత్తానికి అక్కడక్కడా కాస్త వెనుకబడినా.. 2017లో బీజేపీ జగన్నాథ రథం అప్రతిహతంగా ముందుకు సాగింది. గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో విజయంతో.. మిత్రులతో కలుపుకొని 18 రాష్ట్రాలలో కమలనాథులు అధికారంలో వున్నారు. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలలో పోటీచేసి గెలవగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రాజకీయ ఎత్తుగడలు, ఫిరాయింపులతో కైవసం చేసుకుంది బీజేపీ. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠినమైన ఆర్థిక విధానాలను అమలుచేసినప్పటికీ.. విజయ పరంపరను కొనసాగించింది. ఈ నిర్ణయాల వల్ల  ప్రజలు నష్టపోతున్నారని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. ప్రజలు మాత్రం 2017లో కూడా బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇక 2018లో జరిగిన 9 రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఎన్నడూ లేనివిధంగా ఈశాన్యంలో కాషాయ జెండా పాతిన కమలనాథులకు.. మూడు పెద్ద రాష్ట్రాలు మాత్రం షాకిచ్చాయి. త్రిపురలో సొంతంగా మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి జయకేతనం ఎగురవేసిన బీజేపీ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మాత్రం అధికారానికి దూరమైంది. ఇక అనూహ్య పరిణామాల మధ్య కర్నాటకలో అధికారానికి చేరువగా వచ్చి పీఠాన్ని చేజార్చుకుంది. తెలంగాణలో సైతం బీజేపీకి దారుణ ఫలితమే ఎదురైంది. గతంలో ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల్ని కూడా దక్కించుకోలేక.. కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, వెంటనే పుంజుకున్న బీజేపీ తెలంగాణలో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, ఏపీలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఓవైపు ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతున్న బీజేపీ.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించి.. ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది. మోదీ నేతృత్వంలో మరో ఐదేళ్ల వరకు సుస్థిర పాలన అందించేందుకు బీజేపీ సిద్ధమైంది.

-ఎస్. కె. చారి